మమత బెనర్జీపై ఈసీ గుస్సా

ABN , First Publish Date - 2021-04-04T21:10:19+05:30 IST

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమత బెనర్జీపై ఎన్నికల

మమత బెనర్జీపై ఈసీ గుస్సా

న్యూఢిల్లీ : పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమత బెనర్జీపై ఎన్నికల కమిషన్ (ఈసీ) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏప్రిల్ 1న నందిగ్రామ్‌ నియోజకవర్గంలోని ఓ పోలింగ్ బూత్‌లో ఆమె వ్యవహరించిన తీరును పరిశీలిస్తున్నట్లు తెలిపింది. ఈ బూత్‌లో పోలింగ్‌కు అంతరాయం ఏర్పడినట్లు ఆమె చేసిన ఆరోపణలను తోసిపుచ్చింది. 


మమత బెనర్జీ స్వదస్తూరీతో రాసి, పంపించిన ఫిర్యాదులోని ఆరోపణలు అవాస్తవాలని ఈసీ తెలిపింది. ఈ ఆరోపణల్లో పస లేదని పేర్కొంది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి, ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం చర్యలు తీసుకునేందుకు పరిశీలిస్తున్నట్లు వెల్లడించింది. 


నందిగ్రామ్ నియోజకవర్గం నుంచి మమత బెనర్జీ, తన పాత మిత్రుడు, బీజేపీ అభ్యర్థి సువేందు అధికారిపై పోటీ చేస్తున్నారు. ఏప్రిల్ 1న ఈ నియోజకవర్గంలో పోలింగ్ జరిగింది. ఈ నియోజకవర్గంలోని ఓ పోలింగ్ బూత్ వద్ద ఆమె దాదాపు రెండు గంటలపాటు చిక్కుకున్నారు. బీజేపీ, టీఎంసీ మద్దతుదారుల నినాదాలతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడటంతో ఆమె అక్కడే ఉన్నారు. సుమారు రెండు గంటల తర్వాత భద్రతా సిబ్బంది ఆమెను సురక్షితంగా బయటకు తీసుకెళ్ళారు. ఈ ఎన్నికల సమయంలో శాంతిభద్రతలను కాపాడటంలో ఈసీ విఫలమైందని మమత ఆరోపించారు. ఉదయం నుంచి 63 ఫిర్యాదులు చేసినప్పటికీ పట్టించుకోలేదని ఆరోపించారు. 


ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఆదివారం స్పందిస్తూ, నందిగ్రామ్‌లోని పోలింగ్ బూత్ వద్ద మమత బెనర్జీ ప్రవర్తన వల్ల పశ్చిమ బెంగాల్‌లో, బహుశా ఇతర రాష్ట్రాల్లో, ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని పేర్కొంది. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థి ఓటర్లను ప్రభావితం చేయడానికి, వారిని తప్పుదోవ పట్టించేందుకు గంట గంటకు మీడియా ప్రచారం కోసం ప్రయత్నించడం తీవ్ర శోచనీయమని తెలిపింది. ఈ అభ్యర్థి ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం ప్రస్తావనార్హమని తెలిపింది. ఎన్నికల ప్రక్రియ జరుగుతుండగా ఇదంతా జరిగిందని గుర్తు చేసింది. ఇంతకన్నా తీవ్రమైన పొరపాటు ప్రవర్తన మరొకటి ఉండదని పేర్కొంది. 


పోలింగ్ బూత్ వద్ద మమత ఏప్రిల్ 1న ప్రవర్తించిన తీరును ప్రత్యేకంగా పరిశీలిస్తున్నట్లు తెలిపింది. ప్రజా ప్రతినిధ్య చట్టంలోని సెక్షన్లు 131, 123(2)/ఎన్నికల ప్రవర్తనా నియమావళి ప్రకారం చర్యలకుగల అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపింది. పోలింగ్ బూత్‌లో కానీ, దానికి సమీపంలో కానీ అనుచితంగా ప్రవర్తించినవారికి జరిమానా, మూడు నెలల జైలు శిక్ష విధించవచ్చునని సెక్షన్ 131 చెప్తోంది. 


Updated Date - 2021-04-04T21:10:19+05:30 IST