NRI లకు ఈ-పోస్టల్‌ బ్యాలెట్‌ సౌకర్యం.. ఓటర్లుగా నమోదు చేసుకోవాలని ప్రవాసులకు విజ్ఞప్తి

ABN , First Publish Date - 2022-04-23T12:50:35+05:30 IST

విదేశాల్లో ఉన్న భారతీయులకు ఎలక్ర్టానిక్‌ పోస్టల్‌ బ్యాలెట్‌ విధానం ద్వారా ఓటు వేసే సౌకర్యం కల్పించాలని భావిస్తున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రవాస భారతీయులు ఓటర్లుగా నమోదు చేసుకోవాలని ఈసీ కోరింది. ప్రస్తుతం ఓటర్లుగా రిజిస్టర్‌ చేసుకున్న ప్రవాసుల సంఖ్య చాలా తక్కువగా ఉందని కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌ సుశీల్‌ చంద్ర తెలిపారు.

NRI లకు ఈ-పోస్టల్‌ బ్యాలెట్‌ సౌకర్యం.. ఓటర్లుగా నమోదు చేసుకోవాలని ప్రవాసులకు విజ్ఞప్తి

అమలుకు ఎన్నికల సంఘం ప్రతిపాదన

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 22: విదేశాల్లో ఉన్న భారతీయులకు ఎలక్ర్టానిక్‌ పోస్టల్‌ బ్యాలెట్‌ విధానం ద్వారా ఓటు వేసే సౌకర్యం కల్పించాలని భావిస్తున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రవాస భారతీయులు ఓటర్లుగా నమోదు చేసుకోవాలని ఈసీ కోరింది. ప్రస్తుతం ఓటర్లుగా రిజిస్టర్‌ చేసుకున్న ప్రవాసుల సంఖ్య చాలా తక్కువగా ఉందని కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌ సుశీల్‌ చంద్ర తెలిపారు. అధికారిక పర్యటన నిమిత్తం ఆయన దక్షిణాఫ్రికా, మారిష్‌సలకు వెళ్లారు. ఈ సందర్భంగా ఆయా దేశాల్లో ఉన్న భారతీయులతో సమావేశమయ్యారు. ఇప్పటివరకు ప్రవాస భారతీయుల్లో లక్షా 12వేల మంది మాత్రమే ఓటర్లుగా నమోదు చేసుకున్నట్టు ఈసీ వర్గాలు తెలిపాయి. 


ప్రస్తుతం ఎలక్ర్టానిక్‌ పోస్టల్‌ బ్యాలెట్‌ విధానం సర్వీస్‌ ఓటర్లకు... అంటే సైన్యం, కేంద్ర సాయుధ బలగాలకు అమల్లో ఉంది. తమ సొంత నియోజకవర్గాల్లో ఓటర్లుగా నమోదు చేసుకున్న సైనిక సిబ్బంది... బాధ్యతల నిర్వహణ రీత్యా వేరే చోట ఉంటే ఎలకా్ట్రనిక్‌ పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. అలాగే విదేశాల్లోని భారతీయ రాయబార కార్యాలయాలకు చెందిన సిబ్బంది కూడా ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చు. సర్వీస్‌ ఓటర్ల విషయంలో ఈ విధానం విజయవంతంగా అమలవుతున్నందున, ప్రవాసులకు కూడా దీన్ని వర్తింపచేయాలని ఈసీ కేంద్రాన్ని కోరింది. ఈ విషయంలో న్యాయపరమైన అవరోధాలను తొలగించేందుకు కేంద్ర న్యాయశాఖ, ఈసీ, విదేశాంగ శాఖ కలిసి పనిచేస్తున్నట్టు ఈసీ ఒక ప్రకటనలో తెలిపింది.

Updated Date - 2022-04-23T12:50:35+05:30 IST