విజయోత్సవాలపై ఈసీ ఆగ్రహం... కేసు నమోదు చేయాలని ఆదేశం...

ABN , First Publish Date - 2021-05-02T19:07:52+05:30 IST

కోవిడ్-19 మార్గదర్శకాలను పాటించకుండా వేడుకలు జరుపుకునే రాజకీయ

విజయోత్సవాలపై ఈసీ ఆగ్రహం... కేసు నమోదు చేయాలని ఆదేశం...

న్యూఢిల్లీ : కోవిడ్-19 మార్గదర్శకాలను పాటించకుండా వేడుకలు జరుపుకునే రాజకీయ పార్టీల కార్యకర్తలు, నేతలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. నాలుగు రాష్ట్రాలు, ఓ కేంద్ర పాలిత ప్రాంతం శాసన సభల ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా పూర్తి ఫలితాలు వెలువడక ముందే రాజకీయ పార్టీల కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున ఒక చోట చేరుతున్నారని, వేడుకలు జరుపుకుంటున్నారని తన దృష్టికి వచ్చినట్లు తెలిపింది. ఇటువంటి సందర్భాల్లో కఠినంగా వ్యవహరించాలని, కేసులు నమోదు చేయాలని ఈ ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులను ఆదివారం ఆదేశించింది. ఇటువంటి వేడుకలను నిలవరించడంలో విఫలమయ్యే స్టేషన్ హౌస్ ఆఫీసర్లను సస్పెండ్ చేయాలని ఆదేశించింది. ఇటువంటి అన్ని సంఘటనలపైనా తక్షణమే సమాచారం అందజేయాలని, వాటిపై తీసుకున్న చర్యల నివేదికను సమర్పించాలని తెలిపింది. 


ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత విజయోత్సవాల నిర్వహణను కూడా నిలిపేయాలని ఈసీ ఆదేశించింది. ఈ మేరకు తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులను ఆదేశించింది. ఈ వేడుకలను నిలువరించడంలో విఫలమైన ఎస్‌హెచ్ఓలను సస్పెండ్ చేసి, శాఖాపరమైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. 


ఈసీ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వచ్చాయి. ఇప్పటికే తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల్లో పోలీసులు రంగంలోకి దిగారు. డీఎంకే, టీఎంసీ కార్యకర్తలకు ఈసీ ఆదేశాల గురించి వివరించి, వేడుకల నిర్వహణను ఆపాలని కోరారు. వారికి నచ్చజెప్పి కోవిడ్ నిబంధనలను పాటించేవిధంగా చర్యలు తీసుకుంటున్నారు. 


కోవిడ్ విజృంభణ నేపథ్యంలో భారీ ఎత్తున ఎన్నికల సభలు నిర్వహించడంపై ఇటీవల మద్రాస్ హైకోర్టు ఎన్నికల సంఘాన్ని తప్పుబట్టిన సంగతి తెలిసిందే. 


Updated Date - 2021-05-02T19:07:52+05:30 IST