4 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల షెడ్యూలు విడుదల

ABN , First Publish Date - 2021-09-04T19:30:10+05:30 IST

పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో నాలుగు శాసన సభ స్థానాలకు

4 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల షెడ్యూలు విడుదల

న్యూఢిల్లీ : పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో నాలుగు శాసన సభ స్థానాలకు ఉప ఎన్నికల షెడ్యూలును ఎన్నికల కమిషన్ (ఈసీ) విడుదల చేసింది. పశ్చిమ బెంగాల్‌లో 3 నియోజకవర్గాలకు, ఒడిశాలో ఒక నియోజకవర్గానికి ఎన్నికలను నిర్వహించనున్నట్లు శనివారం ప్రకటించింది. ఉప ఎన్నికల పోలింగ్ ఈ నెల 30న జరుగుతుందని, ఓట్ల లెక్కింపు అక్టోబరు 3న జరుగుతుందని ఈసీ ప్రకటించింది. 


పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమత బెనర్జీ భవానీపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని వార్తలు వస్తున్నాయి. ఆమె ఈ ఏడాది మార్చి-ఏప్రిల్‌లో జరిగిన ఎన్నికల్లో నందిగ్రామ్ నుంచి పోటీ చేసి ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఆమె ముఖ్యమంత్రిగా కొనసాగాలంటే ఆరు నెలల్లోగా ఎమ్మెల్యేగా గెలవవలసిన అవసరం ఉంది. భవానీపూర్ నియోజకవర్గం నుంచి ఎన్నికైన టీఎంసీ ఎమ్మెల్యే శోభన్‌దేబ్ ఛటోపాధ్యాయ్ రాజీనామా చేయడంతో ఆ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అవసరమైంది.


పశ్చిమ బెంగాల్‌లో భవానీపూర్, శంషేర్‌గంజ్, జంగీపూర్ నియోజకవర్గాలకు; ఒడిశాలోని పిప్లీ శాసన సభ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు ఈ నెల 30న జరుగుతాయి. ఓట్ల లెక్కింపు అక్టోబరు 3న జరుగుతుంది. సెప్టెంబర్ 6న ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవుతుంది. నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ సెప్టెంబర్ 13. 


ఇదిలావుండగా, దేశవ్యాప్తంగా 32 అసెంబ్లీ స్థానాలు, 2 పార్లమెంట్ స్థానాలకు ఉప ఎన్నికలు జరగవలసి ఉంది. ఉప ఎన్నికల నిర్వహణపై అభిప్రాయాలను తెలియజేయాలని రాష్ట్రాలు, రాజకీయ పార్టీలను ఎన్నికల సంఘం కోరింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు  రాతపూర్వకంగా తమ అభిప్రాయాలను తెలియజేశాయి. 


ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణా, అస్సాం, బిహార్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, మధ్య ప్రదేశ్, మేఘాలయ, రాజస్థాన్, ఉత్తరాఖండ్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు; దాద్రా అండ్ నగర్ హవేలీ, డామన్ అండ్ డయ్యూ అడ్వయిజర్ తమ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో శాసన సభ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలను వాయిదా వేయాలని కోరారు. పండుగలు, వరదలు, కోవిడ్-19 మహమ్మారిని కారణాలుగా చూపారు. పండుగ సమయం దాటిన తర్వాత ఉప ఎన్నికలను నిర్వహించాలని సూచించారు. దీంతో ఆంధ్ర ప్రదేశ్‌లోని బద్వేలు, తెలంగాణాలోని హుజూరాబాద్ శాసన సభ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు వాయిదా పడ్డాయి.


తమ రాష్ట్రాల్లో కరోనా వైరస్ మహమ్మారి అదుపులో ఉందని ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు ఈసీకి లేఖలు శారు.  వరదల వల్ల ఉప ఎన్నికల నిర్వహణకు ఎటువంటి ఇబ్బందులు ఉండబోవని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలిపారు. ఎన్నికల నిర్వహణకు పూర్తి సన్నద్ధంగా ఉన్నామని తెలిపారు. 


Updated Date - 2021-09-04T19:30:10+05:30 IST