హైదరాబాద్: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి తెర పడింది. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు ప్రచారం ముగిసింది. ఖమ్మం, హైదరాబాద్ పట్టభద్రుల స్థానాల పరిధిలో గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. నల్లగొండ, వరంగల్, ఖమ్మం నియోజకవర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఈనెల 14న పోలింగ్ జరగనుండగా, 12వ తేదీ సాయంత్రానికే ప్రచారానికి బ్రేక్ పడింది. ఎల్లుండి ఉదయం 8 గంటల నుంచి పోలింగ్ నిర్వహిస్తారు. ఈ నెల 17న కౌంటింగ్ చేస్తారు. ఆదివారం సెలవు రోజు పట్టణ ఓటరు బయటికి వచ్చే అవకాశం అంతంత మాత్రమే కావడంతో అంతా పల్లె ఓటర్లపై నజర్‌పెట్టారు.
నామినేషన్లు మొదలు ఇప్పటి వరకు అభ్యర్థులు ప్రచారాన్ని హోరెత్తించారు. వందలాది కార్లు, వేలాది బైక్‌లు, జనంతో పోటాపోటీగా ప్రచారం నిర్వహించారు. నల్లగొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గం పరిధిలో 11 జిల్లాలు ఉండటంతో ఓటర్లను నేరుగా పలకరించలేక మార్నింగ్ వాక్‌లు, ఆత్మీయ సమావేశాలు, సంఘాల వారీగా సభలతోనే అభ్యర్థులు సరిపెట్టారు. ప్రచారంలో భాగంగా ప్రత్యేక పాటలు, వీడియోలు రూపొందించుకున్నారు. వాహనాలు, సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా వారి వాయిస్‌ను తీసుకెళ్లారు.