ఎన్నికల ఏర్పాట్లను వేగవంతం చేయాలి

ABN , First Publish Date - 2021-03-05T06:08:44+05:30 IST

జిల్లాలో ఈనెల పదిన జరగనున్న మునిసిపల్‌ ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లను వేగవంతం చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ వి.వినయ్‌చంద్‌ అధికారులను ఆదేశించారు.

ఎన్నికల ఏర్పాట్లను వేగవంతం చేయాలి
సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న వినయ్‌చంద్‌

8వ తేదీ సాయంత్రం నుంచి మద్యం అమ్మకాలు నిలిపివేయాలి

జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ వినయ్‌చంద్‌ 

వెంకోజీపాలెం, మార్చి 4: జిల్లాలో ఈనెల పదిన జరగనున్న మునిసిపల్‌ ఎన్నికలకు  సంబంధించి ఏర్పాట్లను వేగవంతం చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ వి.వినయ్‌చంద్‌ అధికారులను ఆదేశించారు. జీవీఎంసీ సమావేశ మందిరంలో గురువారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ చిన్న పొరపాటు కూడా లేకుండా ఏర్పాట్లన్నీ పక్కాగా చేయాలని సూచించారు. జీవీఎంసీ, నర్సీపట్నం, ఎలమంచిలి మునిసిపాలిటీలకు సంబంధించి ఎన్నికల సామగ్రి, బ్యాలెట్‌ పేపర్లు, బ్యాలెట్‌ బాక్సులు, తదితర వాటిని సిద్ధం చేసి జోనల్‌ కార్యాలయాలకు అందజేయాలన్నారు. జడ్సీలు పోలింగ్‌ స్టేషన్ల వారీగా వాటిని విభజించాలని, సెక్టార్‌, రూట్‌ అధికారులు తాము చేయబోయే పనులకు సిద్ధం కావాలని, ఓటర్ల జాబితాలు, మార్క్‌డ్‌ కాపీలను సిద్ధం చేసుకోవాలని, ఫొటో ఓటర్‌ స్లిప్పుల పంపిణీని త్వరితంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఎనిమిదో తేదీ సాయంత్రం ఐదు గంటల నుంచి మద్యం విక్రయాలను నిలిపివేయాలని స్పష్టం చేశారు. 

10న సెలవు

జిల్లాలో జీవీఎంసీ, నర్సీపట్నం, ఎలమంచిలి మునిపాలిటీలు ఉన్నందున ఈనెల పదిన ప్రభుత్వం సెలవు ప్రకటించినట్టు వినయ్‌చంద్‌ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ కమిషనర్‌ నాగమణి, జేసీలు ఎం.వేణుగోపాలరెడ్డి, ఆర్‌.గోవిందరావు, ఏడీసీలు, ఆర్డీవోలు పెంచల కిశోర్‌, సీతారామారావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-03-05T06:08:44+05:30 IST