ఎన్నికల నియమావళికి తూట్లు పొడవొద్దు

ABN , First Publish Date - 2021-03-04T06:48:19+05:30 IST

ఎన్నికల నియమావళిని అతిక్రమించి విత్‌డ్రా సమయం ముగిసిన తరువాత అభ్యర్థిని లోపలకు పంపడం ఎన్నికల నిబంధనలకు విరుద్ధమంటూ టీడీపీ నాయకులు మున్సిపల్‌ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు.

ఎన్నికల నియమావళికి తూట్లు పొడవొద్దు
రోడ్డుపై బైఠాయించిన మాజీ ఎమ్మెల్యే స్వామిదాసు తదితరులు

 సమయం అయిన తరువాత నామినేషన్‌ ఉపసంహరణకు యత్నం 

 టీడీపీ ఆందోళన

అవకాశం ఇవ్వని ఎన్నికల అధికారులు

తిరువూరు, మార్చి 3 : ఎన్నికల నియమావళిని అతిక్రమించి విత్‌డ్రా సమయం ముగిసిన తరువాత అభ్యర్థిని లోపలకు పంపడం ఎన్నికల నిబంధనలకు విరుద్ధమంటూ టీడీపీ నాయకులు మున్సిపల్‌ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు. నామినేషన్‌ ఉపసంహరణ చివరి  రోజైన బుధవారం మధ్యాహ్నం మూడుగంటలకు గడువు ముగిసిన తరువాత 9వ వార్డులో బీజేపీ అభ్యర్థి శేగు నాగేశ్వరరావు తన నామినేషన్‌ ఉపసంహరణకు ప్రయత్నించాడు. మున్సిపల్‌ కార్యాలయం వద్ద ఉన్న మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాసు తదితరులు ఆందోళన చేశారు. సీఐ జీపు వెనుక నుంచి బీజేపీ అభ్యర్థి నేరుగా మున్సిపల్‌ కార్యాలయంలోకి వెళ్లి తన నామినేషన్‌ ఉపసంహారించేందుకు ప్రయత్నించాడు. దానిని నిరశిస్తూ స్వామిదాసు రోడ్డుపై బైఠాయించారు. ఎన్నికల అధికారి నామినేషన్‌ ఉపసంహరించింది, లేనిది చెప్పాలని డిమాండ్‌ చేశారు. దాంతో సీఐ శేఖర్‌బాబుకు టీడీపీ నాయకులకు మధ్య వాగ్వాదం జరిగింది. మున్సిపల్‌ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. చివరకు బీజేపీ అభ్యర్థి నామినేషన్‌ ఉపసంహరణకు ఎన్నికల అధికారులు అనుమతించలేదనడంతో టీడీపీ ఆందోళన విరమించింది.  పట్టణ టీడీపీ అధ్యక్షుడు బొమ్మసాని మహేష్‌, యండ్రాతి చంద్రం, వాసు, సిందు శ్రీని వాసరావు, సోమవరపు నరసింహారావు, తదితరులు పాల్గొన్నారు.



Updated Date - 2021-03-04T06:48:19+05:30 IST