ఉప ఎన్నికల్లో పోటీకి టీఆర్‌ఎస్‌ దూరం

ABN , First Publish Date - 2021-04-17T07:07:27+05:30 IST

లింగోజిగూడ ఉప ఎన్నికలో కార్పొరేటర్‌

ఉప ఎన్నికల్లో పోటీకి టీఆర్‌ఎస్‌ దూరం

బీజేపీ విజ్ఞప్తికి అధికార పార్టీ అంగీకారం


హైదరాబాద్‌ సిటీ, ఏప్రిల్‌ 16 (ఆంధ్రజ్యోతి): లింగోజిగూడ ఉప ఎన్నికలో కార్పొరేటర్‌ ఏకగ్రీవ ఎన్నికకు సహకరించాలన్న బీజేపీ విజ్ఞప్తిని టీఆర్‌ఎస్‌ అంగీకరించింది. కమలం పార్టీ విజ్ఞప్తి మేరకు ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని అధికార పార్టీ నిర్ణయించింది. పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రితో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నామని టీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె.తారక రామారావు తనను కలిసిన నాయకులతో తెలిపారు. అకాలమరణం చెందిన ఆకుల రమే్‌షగౌడ్‌ కుటుంబ సభ్యులు, బీజేపీ నేతలతో మాజీ ఎమ్మెల్సీ ఎన్‌. రామచందర్‌రావు నేతృత్వంలో శుక్రవారం ప్రగతిభవన్‌లో కేటీఆర్‌ను కలిశారు. డిసెంబర్‌లో జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ తరపున లింగోజిగూడ నుంచి పోటీ చేసిన రమే్‌షగౌడ్‌ సమీప ప్రత్యర్థి టీఆర్‌ఎస్‌ సిటింగ్‌ కార్పొరేటర్‌ ముద్రబోయిన శ్రీనివాసరావుపై విజయం సాధించారు. అనారోగ్యంతో ప్రమాణ స్వీకారం చేయకముందే ఆయన అకాల మరణం పొందారు. దీంతో ఈ డివిజన్‌కు గురువారం రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ షెడ్యూల్‌ ప్రకటించింది. శుక్రవారం నామినేషన్ల స్వీకరణ మొదలైంది. ఎన్నికల్లో విజయం సాధించిన రమేష్‌ తనయుడికి పార్టీ తరపున అవకాశం ఇస్తున్నామని ఏకగ్రీవ ఎన్నికకు సహకరించాలని బీజేపీ నేతలు కోరారు. కేసీఆర్‌తో చర్చించామని, ఆయన అంగీకారం మేరకు పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించామని కేటీఆర్‌ వారితో తెలిపారు. రమేష్‌ అకాల మరణం విచారకరమన్నారు. కేటీఆర్‌ను కలిసిన వారిలో ఎల్‌బీనగర్‌ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, రమే్‌షగౌడ్‌ భార్య, కుమారులు, ఇరు పార్టీల నేతలు పలువురు ఉన్నారు. ఈ సందర్భంగా రామచందర్‌రావు, రమేష్‌ కుటుంబ సభ్యులు కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిని బరిలో నిలుపుతుందా..? ఆ పార్టీ కూడా ఏకగ్రీవ ఎన్నికకు సహకరిస్తుందా..? అన్నది తేలాల్సి ఉంది. 


బీజేపీలో భిన్నాభిప్రాయాలు

బండి సంజయ్‌ ఆగ్రహం?


హైదరాబాద్‌, ఏప్రిల్‌ 16 (ఆంధ్రజ్యోతి): లింగోజిగూడ ఉప ఎన్నికకు సంబంధించి పోటీపై బీజేపీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఏకగ్రీవం కోసం బీజేపీ నాయకులు టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ అగ్రనేతలతో భేటీ కావడంపై పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. గెలిచే అవకాశం ఉన్న చోట ఇతర పార్టీల మద్దతు కోరడంపై ఆయన పార్టీ నేతలపై అసహనం వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్సీ ఎన్‌. రాంచందర్‌రావు నేతృత్వంలో ఒక బృందం కేటీఆర్‌తో పాటు కాంగ్రెస్‌ ఎంపీలు ఉత్తమ్‌, రేవంత్‌లను కలిశారు. లింగోజిగూడ ఎన్నికను ఏకగ్రీవం చేయాలని కోరారు. వరంగల్‌ పర్యటనలో ఉన్న సంజయ్‌కి పార్టీనేతలు మంత్రి కేటీఆర్‌తో భేటీ అయిన విషయం తెలిసింది. తనకు సమాచారం ఇవ్వకుండా ఇతర పార్టీ నేతలతో భేటీ కావడంతో ఆయన సొంత పార్టీ ముఖ్యులపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. 

Updated Date - 2021-04-17T07:07:27+05:30 IST