Elderly woman selling chocolates: లోకల్ ట్రైన్ లో చాక్లెట్లు అమ్ముతున్న బామ్మ బాలీవుడ్ ప్రముఖుల దాకా వెళ్ళిన ఆమె కథ

ABN , First Publish Date - 2022-09-14T15:09:50+05:30 IST

ట్రైన్‌లలో ప్రయాణం చేస్తూ చాక్లెట్లు అమ్ముతున్న బామ్మ. ఎవరు ఈ బామ్మ?? ఈ వయసులో ఆమెకు ఏంటి ఈ కష్టం??

Elderly woman selling chocolates: లోకల్ ట్రైన్ లో చాక్లెట్లు అమ్ముతున్న బామ్మ బాలీవుడ్ ప్రముఖుల దాకా వెళ్ళిన ఆమె కథ


మార్కెట్‌లలో, బస్టాండ్‌లలో, వీధులలో, ట్రైన్‌లలో ఇలా చాలా చోట్ల ఎంతో మంది తిరుగుతూ ఎన్నో అమ్ముతూ ఉంటారు. ఒక  బామ్మ కూడా అలాగే ముంబై లోకల్ ట్రైన్‌లలో ప్రయాణం చేస్తూ చాక్లెట్లు అమ్ముతోంది. ఈ విషయం ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. అయితే.. ఎవరు ఈ బామ్మ?? ఈ వయసులో ఆమెకు ఏంటి ఈ కష్టం?? అంటే..


ముంబైకి చెందిన ఒక బామ్మ లోకల్ ట్రైన్స్‌లో తిరుగుతూ చాక్లెట్లు అమ్ముతున్న వీడియో ఒకటి వైరల్‌గా మారింది. బామ్మ చాక్లెట్లు అమ్ముతున్న వీడియో చూసి ఓ ఎన్.జీ.ఓ సంస్థలో పనిచేసే వారంతా ఆ బామ్మ కోసం చాలా వెతికారు.  చివరికి రెండు రోజుల తరువాత బామ్మ కనిపించింది. ఆమెను చూసి వారు ఆశ్చర్యపోయారు. పంజాబీ డ్రస్‌లో, తెల్లబడిన జుట్టుతో కనబడిన బామ్మ హాయిగా నవ్వుతూ చాక్లెట్లు అమ్ముతూ తిరుగుతోంది. ఆమెను చూసిన వెంటనే ఎన్.జీ.ఓ కుర్రాళ్లు 'హలో ముంబై!! ట్రైన్‌లో చాక్లెట్లు అమ్ముతున్న బామ్మను మేము కలుసుకున్నాం. మేము ఆమెకు సహాయం చేస్తాం' అంటూ నెటిజన్స్‌తో పంచుకున్నారు.


వజీ అనే పేరు కలిగిన ఈ బామ్మకు ఆ ఎన్.జీ.ఓ సంస్థ ఆర్థిక సహాయం చేయబోతే ఆమె సున్నితంగా తిరస్కరించింది. కనీసం తన దగ్గరున్న చాక్లెట్లను ఎక్కువ ధరకు అమ్మడానికి కూడా బామ్మ ఒప్పుకోలేదు. 'నేను చాక్లెట్లు అమ్ముతూనే డబ్బు సంపాదిస్తాను. నాకు ఎవరి సహాయం వద్దు' అని నవ్వుతూనే సమాధానం ఇచ్చింది. ఆమెకు సహాయం చేద్దామని అనుకున్న వారికి నిరాశ ఎదురైనా, ఎలాగైనా బామ్మకు పని తగ్గించాలని ఆమె దగ్గరున్న చాక్లెట్లు మొత్తం వారే కొనేశారు. 'డబ్బు సహాయం చెయ్యబోతే బామ్మ ఎలాగూ తీసుకోదు. కనీసం ఉన్నధర కంటే ఒక్క రుపాయి కూడా ఎక్కువ తీసుకోవడానికి ఒప్పుకోలేదు, అందుకే ఇక మీదట ప్రతి వారం బామ్మ దగ్గర చాక్లెట్లు అన్నీ మేమే కొనాలని నిర్ణయించుకున్నాం' అని చెప్పారు. ఈ విధంగా ఎన్.జీ.ఓ కుర్రాళ్లు బామ్మకు సహాయం చేయాలని అనుకోవడం, ఆమె ఆ సహాయాన్ని తిరస్కరించడం వెంటవెంటనే జరిగిపోయాయి.


చాక్లెట్లు అమ్మడానికి కారణం ఏంటని వజీ బామ్మను అడిగితే.. ‘ఇంట్లో గొడవల వల్ల ఏదో ఒక మార్గంలో డబ్బు సంపాదించాలని అనుకున్నాను. ఆలోచిస్తున్నప్పుడు ఈ ఉపాయం తోచింది. అందుకే దీన్ని ఎంచుకున్నాను’ అని చెప్పింది. 



బామ్మ చాక్లెట్లు అమ్ముతున్న వీడియో బాలీవుడ్ ప్రముఖుల వరకూ వెళ్ళింది. ఆమె సంకల్పం, ఆత్మవిశ్వాసం, పట్టుదల అందరినీ ఆకర్షిస్తున్నాయి. ఆమెలో కష్టపడే తత్వం నేటి యువతకు స్పూర్తిదాయకం.


బామ్మ వీడియో చూసిన ముంబై ప్రజలు కొందరు ఆమెను ఫలానా ట్రైన్‌లో చూశామని.. ఫలనా చోట ఆమె కనిపించిందని.. చాక్లెట్లు కొని ఆమెకు సహాయం చేశామని పేర్కొంటూ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. సమస్యలకు భయపడకుండా నవ్వుతూ కష్టాన్ని భరిస్తున్న ఈ బామ్మ కష్టాలు తొందరలోనే తీరిపోతే బాగుంటుంది.

Updated Date - 2022-09-14T15:09:50+05:30 IST