ఇలాగైతే ఎలా!?

ABN , First Publish Date - 2022-07-29T05:27:11+05:30 IST

రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీరాజ్‌ రోడ్ల అభివృద్ధికి ఏఎంసీల నుంచి దాదాపు రూ.1100 కోట్లను కేటాయించారు.

ఇలాగైతే ఎలా!?
గుంతల మయంగా మారిన సంగం - పల్లెపాలెం రోడ్డు

పంచాయతీరాజ్‌ రోడ్లకు రూ.161 కోట్లు

ఏఎంసీ ద్వారా నిధుల కేటాయింపు

జిల్లాలో 199 రహదారుల అభివృద్ధికి టెండర్లు

35 ప్యాకేజీలకు రెండింటికే టెండర్లు

మలి విడతలోనూ అంతే!

ఆసక్తి చూపని కాంట్రాక్టర్లు

పాత ఎస్‌ఎస్‌ఆర్‌తో పిలవడమే కారణం

తాజాగా జీఎస్టీ పెంపు.. ఆ మేర పెంచని రాష్ట్ర ప్రభుత్వం 

ప్రజాప్రతినిధులు నిలదీసినా కదలని అధికారులు


జిల్లాలో దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేసే ప్రక్రియ ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కు అన్న విధంగా మారింది. వ్యవసాయ మార్కెట్‌ కమిటీలు (ఏఎంసీ) నుంచి భారీగా నిధులను పంచాయతీ రాజ్‌ రోడ్ల అభివృద్ధికి కేటాయించామని ప్రభుత్వం గొప్పగా చెప్పుకున్నా ఆ పనులు చేసేందుకు మాత్రం కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. ఇప్పటికి రెండుసార్లు టెండర్లు పిలిచినా నామమాత్రపు స్పందనే కనిపించింది. ఇక తప్పక మూడోసారి టెండర్లు పిలవాల్సిన పరిస్థితి నెలకొంది.  బిల్లులు వస్తాయో రావోనన్న అనుమానం, పాత స్టాండర్డ్‌ షెడ్యూల్డ్‌ రేట్లు (ఎస్‌ఎస్‌ఆర్‌) ప్రకారం అంచనాలు తయారు చేయడం, కేంద్రం జీఎస్టీని పెంచినా ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పష్టత రాకపోవడం.. ఇలా అనేక అంశాలు రోడ్ల అభివృద్ధిపై ప్రభావం చూపుతున్నాయి. 


నెల్లూరు, జూలై 28 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రవ్యాప్తంగా  పంచాయతీరాజ్‌ రోడ్ల అభివృద్ధికి ఏఎంసీల నుంచి దాదాపు రూ.1100 కోట్లను కేటాయించారు. ఆ నిధులను బ్యాంకు రుణంగా సమకూర్చేలా నిర్ణయం తీసుకున్నారు. ఇందులో జిల్లాకు రూ.161 కోట్లు మంజూరు చేశారు. ఈ నిధులతో మొదటి దశలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని 199 రోడ్లను అభివృద్ధి చేసే విధంగా పీఆర్‌ అధికారులు ప్రతిపాదనలు తయారు చేశారు. మొత్తం 615 కిలోమీటర్ల రోడ్లను 35 ప్యాకేజీలుగా విభజించి గత నెలలో టెండర్లు పిలిచారు. అయితే, సూళ్లూరుపేటలో ఒక ప్యాకేజీకి, ఉదయగిరిలో ఒక ప్యాకేజీకి మాత్రమే టెండర్లు దాఖలయ్యాయి. మిగిలిన వాటికి ఒక్క టెండర్‌ కూడా దాఖలుకాకపోవడంతో ఈ నెలలో రెండో కాల్‌ పిలిచారు. అయితే ఈ దఫా కూడా ఒకటి, రెండు ప్యాకేజీలకు మించి టెండర్లు దాఖలు కాలేదని తెలుస్తోంది. ఈ నెల 19వ తేదీకి టెండర్ల దాఖలుకు గడువు ముగిసినా ఎన్నింటికి టెండర్లు దాఖలయ్యాయన్న విషయాన్ని పంచాయతీరాజ్‌ అధికారులు వెల్లడించడం లేదు. 30 ప్యాకేజీల వరకు ఎవరూ టెండర్లు వేయలేదని, వీటన్నింటికీ మూడో కాల్‌ పిలవాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పుకుంటున్నారు. 


తెలిసి కూడా అదే పద్ధతిలో..


ఈ వర్కులకు పిలిచిన టెండర్లు కాంట్రాక్టర్లకు నష్టం జరిగేలా ఉన్నాయని మొదట్లోనే ప్రజాప్రతినిధులు, అఽధికారులు గుర్తించారు. అయినా అదే పద్ధతిలో టెండర్లు ఆహ్వానించారు. ఊహించినట్లుగానే కాంట్రాక్టర్ల నుంచి విముఖత వ్యక్తమైంది. ప్రతి ఏడాది జూనలో ఎస్‌ఎస్‌ఆర్‌ మారుతూ ఉంటుంది. ఏటా ఐదు నుంచి పది శాతం వరకు ధరలు పెరుగుతుండటంతో ఆ మేరకు వర్కు ఎస్టిమేషన్లు కూడా పెంచుతుంటారు. కానీ ఏఎంసీ నిధులతో చేపట్టిన వర్కులకు మాత్రం పీఆర్‌ అధికారులు గతేడాది ఎస్‌ఎస్‌ఆర్‌తోనే ఎస్టిమేషన్లు తయారు చేసి టెండర్లు పిలిచారు. కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడానికి ఇదే ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఇక రాష్ట్ర ప్రభుత్వ వర్కులకు జీఎస్టీ 12 శాతం ఉండగా దానిని ఇటీవల కేంద్ర ప్రభుత్వం 18 శాతానికి పెంచింది. కానీ టెండర్లలో మాత్రం 12 శాతంగానే చూపించారు. జీఎస్టీ పెంపుపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పష్టత రాకపోవంతో పాత జీఎస్టీతో టెండర్లు వేస్తే పెరిగిన ఆరు శాతం జీఎస్టీ తమ జేబులో నుంచి పెట్టుకోవాల్సి ఉంటుందని కాంట్రాక్టర్లు భయపడుతున్నారు. ఇప్పటికి రెండు సార్లు టెండర్లు పిలిచిన అధికారులు ఈ విషయాలను పరిగణలోకి తీసుకోలేదు. అయితే ఇటీవల జరిగిన జిల్లా సమావేశాల్లో మంత్రితోపాటు ప్రజాప్రతినిధులు పీఆర్‌ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మొదటిసారి టెండర్లు దాఖలు కానప్పుడు రెండోసారైనా కొత్త ఎస్‌ఎస్‌ఆర్‌తో టెండర్లు పిలవాలి కదా అంటూ ప్రశ్నించారు. ఒకవేళ కొత్త ఎస్టిమేషన్లతో ఖర్చు పెరుగుతుంటే ఆ మేరకు కొన్ని కిలోమీటర్ల రోడ్లను తగ్గించాలని సూచించారు. కాగా మూడోసారి టెండర్‌ పిలిచేందుకు ఇంతవరకు నిర్ణయం తీసుకోలేదు. మరి ఈ సారైనా లోపాలను సరిచేసుకొని టెండర్లు దాఖలయ్యేలా చర్యలు తీసుకుంటారో లేదో చూడాలి. 

Updated Date - 2022-07-29T05:27:11+05:30 IST