అసంఘటిత కార్మికుల సంక్షేమానికే ఈ-శ్రమ్‌

ABN , First Publish Date - 2021-12-26T05:11:41+05:30 IST

దేశవ్యాప్తంగా ఉన్న అసంఘటిత రంగాల కార్మికులకు ప్రత్యేక డాటాబేస్‌ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఈ-శ్రమ్‌ వెబ్‌పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చింది.

అసంఘటిత కార్మికుల సంక్షేమానికే ఈ-శ్రమ్‌

భవిష్యత్‌లో కీలకంకానున్న ఈ-శ్రమ్‌ కార్డు

స్కీమ్‌ వర్కర్లు కూడా ఈ-శ్రమ్‌కు అర్హులే 

భువనగిరిటౌన్‌, డిసెంబరు 25: దేశవ్యాప్తంగా ఉన్న అసంఘటిత రంగాల కార్మికులకు ప్రత్యేక డాటాబేస్‌ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఈ-శ్రమ్‌ వెబ్‌పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చింది. అసంఘటిత రంగాల కార్మికులు, స్కీమ్‌ వర్కర్ల వివరాలను నమోదుచేసి వారి సంక్షేమానికి అవసరమైన ప్రణాళికలు అమలుచేసే లక్ష్యంతో డాటాబేస్‌ వెబ్‌సైట్‌ను రూపొందించింది. ఈమేర కు డిసెంబర్‌ 31వ తేదీలోపు మెజార్టీ అసంఘటిత కార్మికుల వివరాలను డాటాబే్‌సలో నమోదు చేయాలని సంకల్పించింది. ఆ తరువాత కూడా ఈ-శ్రమ్‌ నమోదు కొనసాగుతున్నప్పటికీ ఈనెలాఖరునాటికి నమోదు చేసుకొని డాటాబేస్‌ ఆవిష్కరణకు ఊతం ఇవ్వాలని అసంఘటిత కార్మికులకు కేంద్ర ప్రభుత్వం సూచిస్తోంది. ఈ మేరకు ఉమ్మడి జిల్లాలో ఈ-శ్రమ్‌కు  సుమారు 10 లక్షల మంది అర్హులని కార్మిక సంఘాల నాయకులు పేర్కొంటున్నారు.

ఈ-శ్రమ్‌కు వీరు అర్హులు

లేబర్‌కార్డుగా ప్రచారమవుతున్న ఈ-శ్రమ్‌కు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సుమారు 20 లక్షల మంది అర్హులుగా ఉన్నట్లు తెలుస్తోంది. పీఎఫ్‌, ఈఎ్‌సఐ పరిధిలో లేనివారు, ఆదాయ పన్ను చెల్లించని  16నుంచి 59 సంవత్సరాలలోపు వ యస్సు గల అసంఘటిత కార్మికులు ఈ-శ్రమ్‌కు అర్హులు. వ్యవసాయ రంగాల్లో ఉపాధి పొందే చిన్న, సన్నకారు రైతులు, కూలీలు, పాడి రైతులు, మత్స్యకార్మికులు, భవన నిర్మాణరంగంలోని తాపీ, సెంట్రింగ్‌, వెల్డింగ్‌, ఇటుక బట్టీలు, కాంక్రీట్‌, పూడీకతీత తదితర కార్మికులు అర్హులు. రవాణా రంగంలోని డ్రైవర్లు, హెల్పర్లు, టైలరింగ్‌, చేతి వృత్తి రంగంలోని చేనేత, కమ్మరి, కుమ్మరి, స్వర్ణకారులు, క్షౌరవృత్తి, బ్యూటీ పార్లర్‌ వర్కర్స్‌, రజకు లు, స్వయం ఉపాధి పొందే వీధి, చిరువ్యాపారులు,  కల్లుగీత, బీడీ, రిక్షా కార్మికులు, కళాకారులు సేవారంగంలోని పాచిపనులు చేసేవారు, కోరియర్‌ బాయ్స్‌, జర్నలిస్టులు, హమాలీలు, దుకాణా ల్లో పనిచేసే గుమాస్తలు, ఉపాధి హామీ కూలీలు, మధ్యాహ్న బోజన కార్మికులు, విద్యా వలంటరీలతో పాటు అన్ని రంగాల్లో పనిచేసే అసంఘటిత కార్మికులు అర్హులు. స్కీమ్‌ వర్కర్స్‌గా పరిగణించబడుతున్న అంగన్‌వాడీలు, ఆశా వర్కర్స్‌ సైతం ఈ-శ్రమ్‌లో నమోదుకు అర్హులు.

ప్రయోజనాలు

ఈ-శ్రమ్‌లో చేరిన ప్రతి కార్మికుడికి 12అంకెల ప్రత్యేకగుర్తింపు సంఖ్య (యూనివర్సల్‌ అకౌంట్‌ నెంబర్‌..యూఏఎన్‌) కేటాయిస్తారు. భవిష్యత్‌లో ఈ కార్డులు ఉన్నవారే ప్రభుత్వ సామాజిక భద్రత, సంక్షేమ పథకాలు వర్తించే అవకాశాలున్నాయి. ఇప్పటివరకు కొన్ని పథకాల్లో కుటుంబం లో ఒక్కరికి మాత్రమే వర్తించేది. ఈ-శ్రమ్‌ ద్వారా అదనంగా కుటుంబసభ్యులకు వర్తించనున్నా యి. ఈ-శ్రమ్‌లో నమోదైన ప్రతీ కార్మికుడికి ఏడాదిపాటు ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద మరణం, అంగవైకల్యానికి రూ.2లక్షల ప్రమాద బీమా ఉచితంగా వర్తించనుంది. కాగా, ఇప్పటివరకు అసంఘటిత కార్మికుల వివరాలు, సంఖ్యలేకపోవడంతో ఆ రంగానికి అమలు చే యాల్సిన పథకాలపై కేంద్రానికి స్పష్టత కొరవడింది. ఈకారణంగానే ఇటీవల కరోనా ఆపత్కాలం లో అసంఘటిత కార్మికులకు ప్రభుత్వం చేయూత నివ్వలేకపోయింది. అయితే వారికి ప్రయోజనాలు కల్పించే లక్ష్యంతో ఈ-శ్రమ్‌కార్డులను కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చింది. 

నమోదు ఇలా

ఆధార్‌కార్డు, ఆధార్‌కార్డుతో అనుసంధానం అయిన ఫోన్‌ నెంబర్‌, బ్యాంకు ఖాతా నెంబర్‌ ద్వారా ఈ-శ్రమ్‌లో నమోదు చేసుకోవచ్చు. అన్ని ఆన్‌లైన్‌ సర్వీస్‌ సెంటర్లలో లేదా సొంతంగానూ ఈ-శ్రమ్‌లో నమోదు చేసుకోవచ్చు. సెల్‌ నెంబర్‌లేని వారు బయోమెట్రిక్‌ (వేలిముద్రలు), ఐరిష్‌ స్కానింగ్‌ ద్వారా కూడా నమోదు చేసుకోవచ్చు.

Updated Date - 2021-12-26T05:11:41+05:30 IST