ఎక్కడి చెత్త అక్కడే!

ABN , First Publish Date - 2021-06-14T05:35:12+05:30 IST

విశాఖ మహా నగరంలో చెత్త తరలింపు ప్రక్రియ అస్తవ్యస్తంగా తయారైంది. వారం రోజులుగా ఇళ్ల నుంచి చెత్త సేకరణ పూర్తిస్థాయిలో జరగడం లేదు. దీంతో వీధుల్లో, రోడ్లపక్కన చెత్త కుప్పలు పెరిగిపోతున్నాయి

ఎక్కడి చెత్త అక్కడే!
రైల్వే న్యూకాలనీలో రోడ్డు పక్కన చెత్త కుప్పలు

నగరంలో అస్తవ్యస్తంగా ఇంటింటి చెత్త సేకరణ

వీధుల్లో పేరుకుపోతున్న చెత్త కుప్పలు

కుళ్లిపోయి తీవ్రదుర్వాసన వెదజల్లుతుండడంతో జనం అవస్థలు

వాహనాల టెండర్‌ విధానంలో మార్పులతో గందరగోళం

వాహనంతోపాటు డ్రైవర్‌కు మాత్రమే టెండర్‌ పిలిచిన జీవీఎంసీ

చెత్త లోడింగ్‌, అన్‌ లోడింగ్‌ బాధ్యతలు జీవీఎంసీ సిబ్బందికి అప్పగింత

అన్‌లోడింగ్‌కు ససేమిరా అంటున్న కార్మికులు

అధ్వానంగా తయారైన  పారిశుధ్య నిర్వహణ


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

విశాఖ మహా నగరంలో చెత్త తరలింపు ప్రక్రియ అస్తవ్యస్తంగా తయారైంది. వారం రోజులుగా ఇళ్ల నుంచి చెత్త సేకరణ పూర్తిస్థాయిలో జరగడం లేదు. దీంతో వీధుల్లో, రోడ్లపక్కన చెత్త కుప్పలు పెరిగిపోతున్నాయి. రోజుల తరబడి వీటిని తరలించకపోవడంతో కుళ్లిపోయి తీవ్రదుర్వాసన వస్తున్నది. ‘ఇంటింటి చెత్త సేకరణ’కు ఇటీవల పిలిచిన టెండర్లలో కొత్త నిబంధనలే ఇందుకు కారణమని తెలిసింది.  మహా విశాఖ నగరపాలక సంస్థ (జీవీఎంసీ) పరిధిలో రోజూ 1,200 టన్నుల చెత్త వస్తుంటుంది. చెత్తసేకరణ, తడి/పొడి విభజన, తరలింపు పక్కాగా ఉండేందుకు ప్రతి ఇంటి నుంచీ చెత్తను సేకరిస్తున్నది. ఇందుకోసం జీవీఎంసీకి చెందిన వంద వాహనాలతోపాటు ప్రైవేటు కాంట్రాక్టర్ల నుంచి మరో 540 వాహనాలను టెండర్‌ ద్వారా సమకూర్చుకుంది. ఒక్కో వాహనానికి ఒక డ్రైవర్‌తోపాటు ఇంటింటికీ వెళ్లి చెత్తను సేకరించి, తడి/పొడిగా విభజించి వాహనంలో లోడ్‌ చేసేందుకు ఇద్దరు కార్మికులు వుంటారు. జీవీఎంసీ వాహనాల్లో సంస్థ సిబ్బంది విధులు నిర్వర్తిస్తారు. కాంట్రాక్టర్లు సమకూర్చే వాహనాలకు టెండరు దక్కించుకున్న కాంట్రాక్టరే డ్రైవర్‌ను, ఇద్దరు కార్మికులను నియమించుకోవాలి. కేటాయించిన ప్రాంతాల్లో ఇళ్ల నుంచి చెత్తను సేకరించి, సమీపంలోని మినీ సివేజ్‌ ట్రాన్స్‌ఫర్‌ స్టేషన్‌(ఎంఎస్‌ఎఫ్‌)కి తరలించాలి. ఇంకా రోడ్లను శుభ్రపరచడం, డ్రైనేజీలను క్లీన్‌ చేయడం, రోడ్లను ఊడ్చినప్పుడు పోగైన చెత్తను తోపుడుబండితో సమీపంలోని డంపర్‌ బిన్ల వద్దకు తీసుకెళ్లి వేసేందుకు జీవీఎంసీకి చెందిన వెయ్యి మంది శాశ్వత పారిశుధ్య కార్మికులతోపాటు అవుట్‌సోర్సింగ్‌ విధానంలో 5,230 మంది పనిచేస్తున్నారు. నగరంలో చెత్త సేకరణ, తరలింపు ఇంతవరకూ బాగానే జరుగుతూ వచ్చింది. అయితే పారిశుధ్య కార్మికుల్లో కొంతమంది పూర్తిస్థాయిలో పనిచేయడం లేదని జీవీఎంసీ అధికారులు క్షేత్రస్థాయి పర్యటనల్లో గుర్తించారు. చాలామంది మొక్కుబడిగా పనిచేసి వెళ్లిపోతుండడం, డోర్‌ టు డోర్‌ కలెక్షన్‌ వాహనాలకు ఇద్దరు మనుషులను పెట్టుకునేందుకు కాంట్రాక్టర్‌కు డబ్బులు చెల్లిస్తుండడం వంటి వాటివల్ల నిధులు వృథా అవుతున్నాయని అధికారులు భావించారు. దీనిని నివారించడానికి చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.

ఈ నేపథ్యంలో డోర్‌ టు డోర్‌ కలెక్షన్‌ వాహనాలకు ఈ ఏడాది మార్చి 31తో గడువు ముగియడంతో ఏప్రిల్‌ ఒకటి నుంచి సమకూర్చుకునే వాహనాలకు పిలిచే టెండర్లలో మార్పులు చేయాలని అఽధికారులు నిర్ణయించడం కొత్త సమస్యను తెచ్చిపెట్టింది. కొత్తగా పిలిచిన టెండర్‌ ప్రకారం టాటాఏస్‌ వాహనంతోపాటు డ్రైవర్‌ను మాత్రమే కాంట్రాక్టర్‌ సమకూర్చుకునేలా నిబంధనలను మార్చారు. వాహనంతోపాటు చెత్తసేకరణ, వాహనంలో వేయడం, ఎంఎస్‌ఎఫ్‌లో అన్‌లోడింగ్‌కు   ఒక్కో వాహనానికి ఇద్దరు చొప్పున జీవీఎంసీ అవుట్‌ సోర్సింగ్‌ సిబ్బందికి  బాధ్యతలు అప్పగించారు. దీనివల్ల ఇద్దరు కార్మికులకు చెల్లించాల్సిన మొత్తాన్ని టెండరులోనే కాంట్రాక్టర్‌కు తగ్గించడంతో జీవీఎంసీకి డబ్బులు ఆదా అవుతాయన్నది అధికారుల భావన. గతంలో మాదిరిగా జోన్‌ను యూనిట్‌గా తీసుకుని వాహనాలను కేటాయించకుండా, ప్రతివార్డు సచివాలయానికి ఒకటి చొప్పున కేటాయించారు. వార్డు సచివాలయం పరిధిలో 1200 నుంచి 1500 ఇళ్లకు మూడు ట్రిప్పుల్లో చెత్తను సేకరించి, ఎంఎస్‌ఎఫ్‌లో అన్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. చెత్తసేకరణ సక్రమంగా జరిగేలా చూడాల్సిన బాధ్యతలను వార్డు సచివాలయంలోని శానిటేషన్‌ సెక్రటరీలకీ అప్పగించారు. దీనివల్ల బాధ్యుడైన అధికారి పర్యవేక్షణ ప్రత్యక్షంగా ఉంటుంది కాబట్టి, డోర్‌ టు డోర్‌ కలెక్షన్‌ శతశాతం జరుగుతుందని అధికారులు అంచనా వేశారు. ఈ నెల ఆరు నుంచి కొత్త విధాన అమల్లోకి రావడంతో టెండరు దక్కించుకున్న కాంట్రాక్టర్లు వాహనాలను వీధుల్లో తిప్పేందుకు వార్డు సచివాలయాల వద్ద పెట్టారు. అయితే సిబ్బంది మాత్రం ఇంటింటికీ వెళ్లి చెత్తసేకరించి, ఎంఎస్‌ఎఫ్‌లో అన్‌లోడ్‌ చేసేందుకు ససేమిరా అనడంతో చెత్తసేకరణ నిలిచిపోయింది. దీనిపై అధికారులు అప్రమత్తమై, యూనియన్ల నేతలతో చర్చించడంతో రెండు రోజుల తర్వాత తమకు కేటాయించిన వాహనాలతోపాటు చెత్తసేకరణకు వెళ్లినప్పటికీ, తర్వాత తమవల్ల కాదంటూ చేతులెత్తేశారు. దీంతో వీధుల్లో ఎక్కడి చెత్త అక్కడే కుప్పలుగా పోగైపోతోంది. చెత్త తీసుకెళ్లేందుకు సిబ్బంది ఇళ్లకు రాకపోవడంతో ఇంట్లో పోగైన చెత్తను సమీపంలోని డంపర్‌ బిన్‌లలో, రోడ్డుపైనే పడేస్తున్నారు. కొంతమంది కాంట్రాక్టర్లు మాత్రం అధికారుల విజ్ఞప్తి మేరకు సిబ్బందిని పెట్టుకుని చెత్త తరలిస్తుంటే... మిగిలిన కాంట్రాక్టర్లు మాత్రం బిల్లు వస్తుందో రాదో తెలియనప్పుడు కార్మికులను పెట్టుకోవడం ఎందుకనే భావనతో మిన్నకుండిపోయారు.

యార్డుకి చేరుతున్న చెత్త 300 టన్నులే!

నగరంలో ప్రతిరోజూ ఉత్పత్తి అయ్యే 1200 టన్నుల చెత్తలో పునర్వినియోగానికి పోగా మిగిలిన 900 టన్నుల చెత్త కాపులుప్పాడలోని డంపింగ్‌యార్డుకు చేరేది. అయితే గత రెండు రోజులుగా డోర్‌ టు డోర్‌ కలెక్షన్‌ కొన్ని ప్రాంతాల్లోనే జరగడంతో రోజూ 300 టన్నుల చెత్త మాత్రమే కాపులుప్పాడ చేరుతున్నది. సీతమ్మధార, హెచ్‌బీకాలనీ, పిఠాపురం కాలనీ, రైల్వేన్యూకాలనీ, దొండపర్తి వంటిప్రాంతాల్లో రోడ్ల పక్కన భారీగా చెత్తకుప్పటు పేరుకుపోయి, తీవ్రదుర్వాసన వస్తున్నదని స్థానికులు వాపోతున్నారు.


త్వరలోనే సమస్య పరిష్కారం 

డోర్‌ టు డోర్‌ చెత్త సేకరణకు వాహనాలను సమకూర్చే టెండరులో కొన్ని మార్పులు చేయడంతో జీవీఎంసీ సిబ్బందే చెత్తసేకరణ, విభజన, డంపింగ్‌యార్డులో అన్‌లోడ్‌ వంటి విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. దీనిపై కార్మికుల నుంచి కొంత ఇబ్బంది ఎదురవడంతో చెత్తసేకరణ గాడితప్పింది. దీనిపై కమిషనర్‌ దృష్టి సారించినందున త్వరలోనే సమస్య పరిష్కారం అవుతుంది.      

- డాక్టర్‌ శాస్త్రి, ప్రధాన వైద్యాధికారి, జీవీఎంసీ

Updated Date - 2021-06-14T05:35:12+05:30 IST