యాదాద్రీశుడికి ఏకాదశి పర్వాలు

ABN , First Publish Date - 2022-01-29T06:12:56+05:30 IST

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వా మి సన్నిధిలో శుక్రవారం ఏకాదశి పర్వదినం సందర్భంగా లక్ష పుష్పార్చన పూజలు సంప్రదాయరీతిలో కొనసాగాయి.

యాదాద్రీశుడికి ఏకాదశి పర్వాలు
లక్షపుష్పాలంకరణలో కొలువుదీరిన లక్ష్మీనృసింహుడు

స్వామికి సువర్ణ పుష్పార్చన

ఆండాల్‌ అమ్మవారి ఊంజల్‌ సేవ


యాదాద్రి టౌన్‌, జనవరి 28: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వా మి సన్నిధిలో శుక్రవారం ఏకాదశి పర్వదినం సందర్భంగా లక్ష పుష్పార్చన పూజలు సంప్రదాయరీతిలో కొనసాగాయి. బాలాలయ మండపం లో ఉత్సవమూర్తులను పట్టువస్త్రాలు, బంగారు, ముత్యాల ఆభరణాల తో దివ్యమనోహరంగా అలంకరించి ప్రత్యేక వేదికపై అధిష్ఠింపజేశారు. అర్చకబృందం, వేదపండితులు లక్ష్మీనృసింహుల సహస్రనామ పఠనాల తో, పలు రకాల పుష్పాలతో లక్షపుష్పార్చన నిర్వహించారు.


సువర్ణ పుష్పార్చన, ఊంజల్‌ సేవ

లక్ష్మీ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకువజామున స్వామి వారిని సుప్రభాతంతో మేల్కొలిపిన ఆచార్యులు బాలాలయ కవచమూర్తులను 108 బంగారు పుష్పాలతో అర్చించారు. మండపంలో ఉత్సవమూర్తులను వేదమంత్రాలతో అభిషేకించి తులసీ దళాలు, కుంకుమలతో అర్చించారు. విశ్వక్సేనుడికి తొలి పూజతో సుదర్శన నారసింహ హోమం, నిత్యతిరుకల్యాణోత్సవాన్ని ఆగమ శాస్త్రరీతిలో నిర్వహించారు. బాలాలయంలో సువర్ణ పుష్పార్చన, అష్టోత్తరాలు, కొండకింద పాత గోశాలలోని వ్రతమండపంలో సత్యనారాయణస్వామి వ్రత పూజలు కొనసాగాయి. కొండపైన శివాలయంలో రామలింగేశ్వరుడికి, దర్శన క్యూకాంప్లెక్స్‌లోని చరమూర్తులకు శైవాగమ పద్ధతిలో పూజలు నిర్వహించారు. సాయంత్రం వేళ బాలాలయంలో కొలువుదీరిన ఆండాల్‌ అమ్మవారిని దివ్యమనోహరంగా అలంకరించిన అర్చకులు ఊంజల్‌ సేవ నిర్వహించారు. అనంతరం వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ బాలాలయ మండపంలో ఊరేగించారు. మహిళా భక్తులు మంగళ నీరాజనాలు పలికారు. అనుబంధ పాతగుట్ట ఆలయంలో సైతం స్వామి వారికి సువర్ణ పుష్పార్చనలు, ఆండాల్‌ అమ్మవారి ఊంజల్‌ సేవోత్సవం నిర్వహించారు. కాగా, ఆలయ ఖజానాకు పలు విభాగాల ద్వారా రూ.11,68,033 ఆదాయం సమకూరింది.


యాదాద్రీశుడి సేవలో యూపీఎ్‌ససీ సభ్యుడు

యాదాద్రీశుడిని యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ సభ్యుడు ఎఎస్‌ భోంస్లే దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. క్షేత్ర సందర్శనకు వచ్చిన ఆయనకు అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. బాలాలయ కవచమూర్తుల దర్శనం అనంతరం అర్చకులు ఆశీర్వచనం చేయగా, దేవస్థాన అధికారులు అభిషేకం లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు.


కొనసాగిన రిలే దీక్షలు 

యాదాద్రికొండపైన దుకాణాలు నిర్మించి ఇవ్వాలనే డిమాండ్‌తో వర్తక వెల్ఫేర్‌ సంఘం చేపట్టిన రిలే నిరాహార దీక్షలు శుక్రవారానికి 31వ రోజుకు చేరాయి. దీక్షల్లో నల్ల వాసుదేవ్‌రెడ్డి, కె.నర్సింగ్‌, ఎం.శ్రీనివాస్‌, పూర్ణచందర్‌, జేడీ.కిష్టయ్య, ఎం.రాజు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-29T06:12:56+05:30 IST