అరికాళ్లలో రక్తం స్రవిస్తోంది..పాత చెప్పులుంటే ఇవ్వండి

ABN , First Publish Date - 2020-05-18T17:21:45+05:30 IST

‘‘మా గ్రామానికి వెళ్లేందుకు రోడ్డుపై నడచి నడచి అరికాళ్లలో నుంచి రక్తం స్రవిస్తోంది, పాత చెప్పులుంటే దానంగా ఇవ్వండి ప్లీజ్’’ అంటూ

అరికాళ్లలో రక్తం స్రవిస్తోంది..పాత చెప్పులుంటే ఇవ్వండి

కాలినడకన వస్తున్న వలసకార్మికుడి వేడుకోలు

లక్నో (ఉత్తరప్రదేశ్ ): లాక్ డౌన్ వల్ల వలసకార్మికుల ఇక్కట్లు వర్ణనాతీతంగా మారాయి. ‘‘మా గ్రామానికి వెళ్లేందుకు రోడ్డుపై నడచి నడచి అరికాళ్లలో నుంచి రక్తం స్రవిస్తోంది, పాత చెప్పులుంటే దానంగా  ఇవ్వండి ప్లీజ్’’ అంటూ గోరఖ్‌పూర్ జిల్లాలోని పిప్‌రైచ్ గ్రామానికి చెందిన తిలోకి కుమార్ అనే వలస కార్మికుడు కనిపించిన వారినల్లా వేడుకోవడం అందరినీ కలిచి వేస్తోంది. తిలోకి కుమార్ అనే వలస కార్మికుడు గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ నగరంలోని వస్త్ర పరిశ్రమలో పనిచేస్తూ దేశమంతా లాక్‌డౌన్ విధించడం వల్ల అక్కడే చిక్కుకుపోవడంతో విధిలేక కాలినడకన తన తోటి 1000 మంది వలసకార్మికులతో కలిసి స్వగ్రామానికి బయలుదేరారు. శ్రామిక్ రైలులో తన పేర్లు నమోదు చేసుకొని వారం రోజులు గడిచినా ఎవరూ పిలవక పోవడంతో తాము కాలినడకన బయలుదేరామని తిలోకి కుమార్ చెప్పారు. 300 కిలోమీటర్ల దూరం నడిచాక తన కాళ్లకు ఉన్న స్లిప్పర్లు అరిగిపోయి తెగిపోయాయని, దీంతో అరికాళ్ల నుంచి రక్తం స్రవిస్తుందని, తినడానికి దాతలు అన్నం పెడుతున్నారని, తనకు పాత చెప్పులుంటే దానంగా ఇవ్వాలని తిలోకి కుమార్ కనిపించినవారినల్లా అభ్యర్థిస్తుండటం కన్నీళ్లు తెప్పిస్తోంది. కాళ్లకు చెప్పులు లేకుండా ఎర్రటి ఎండలో కాళ్లు కాలుతున్నా నడవడం వల్ల అరికాళ్ల నుంచి రక్తం స్రవిస్తుందని తిలోకి కుమార్ ఆవేదనగా చెప్పారు. దారిమధ్యలో నడిచి వస్తున్న తమకు దాతులు అన్నం, నీళ్లు అందిస్తున్నారని, కాని కాళ్లకు చెప్పులు లేవని, పాత చెప్పులైనా ఇవ్వండంటూ  తిలోకి వేడుకుంటున్నారు. కొందరు దాతలు వారికి డబ్బులివ్వబోగా తీసుకునేందుకు నిరాకరిస్తూ, తాము ఈ డబ్బుతో లాక్ డౌన్ సమయంలో చెప్పులు ఎక్కడ కొనుక్కోవాలని ప్రశ్నిస్తున్నారు. దీంతో స్పందించిన ఓ సీనియర్ సిటిజన్ లక్నో నగర శివారులో ఓ షాపు నుంచి స్లిప్పర్లు కొని వలసకార్మికులకు అందించారు. లక్నో -ఫైజాబాద్ జాతీయ రహదారిపై నవీన్ తివారీ అనే వ్యాపారి భోజనంతో పాటు స్లిప్పర్లను కొని వారికి పంపిణీ చేశారు.

Updated Date - 2020-05-18T17:21:45+05:30 IST