ఈటల రాజీనామా

ABN , First Publish Date - 2021-06-13T05:43:43+05:30 IST

మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను స్పీకర్‌ ఆమోదించారు.

ఈటల రాజీనామా

- ఆమోదించిన స్పీకర్‌ 

- రేపు బీజేపీలో చేరిక 

- హుజూరాబాద్‌ ఉప ఎన్నిక అనివార్యం


(ఆంధ్రజ్యోతిప్రతినిధి, కరీంనగర్‌)

మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను స్పీకర్‌ ఆమోదించారు. ఈటల రాజీనామాను ఆమోదిస్తూ గెజిట్‌ విడుదల చేయడమే కాకుండా కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా స్పీకర్‌ సమాచారం పంపించారు. దీంతో హుజూరాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో ఆరునెలల్లోగా ఎన్నికలు జరగడం అనివార్యంగా మారింది.  టీఆర్‌ఎస్‌ పార్టీకి, శాసనసభ్యత్వానికి రాజీనామా చేసిన ఈటల రాజేందర్‌ సోమవారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఆ పార్టీలో చేరబోతున్నారు. ఆయనతోపాటు జిల్లా పరిషత్‌ మాజీ చైర్‌పర్సన్‌ తుల ఉమ,  గండ్ర నళిని, మరికొందరు బీజేపీలో చేరనున్నారు. ఆయన వెంట మాజీ ఎంపీ రమేశ్‌రాథోడ్‌, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి మరి కొందరు నేతలు కూడా బీజేపీలో చేరాలని నిర్ణయించుకోవడంతో వారందరూ ఢిల్లీకి వెళ్లేందుకు రెండు చార్టర్‌ విమానాలను ఏర్పాటు చేసుకున్నారు. శనివారం ఈటల రాజేందర్‌ తన ఇంటి నుంచి బయలు దేరి గన్‌పార్కుకు వెళ్ళి అమరవీరుల స్థూపానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం ఆయన స్పీకర్‌ కార్యాలయానికి వెళ్లి అసెంబ్లీ కార్యదర్శికి రాజీనామా చేశారు. ఈటల రాజీనామా చేసి రెండు గంటలు గడువక ముందే ఆయన రాజీనామాను ఆమోదించినట్లు గెజిట్‌ విడుదలైంది. 


మూడోసారి ఉప ఎన్నిక


ఈటల రాజేందర్‌ శాసనసభ్యత్వానికి రాజీనామా చేయడం ఇది మూడోసారి. 2008, 2010 సంవత్సరాల్లో శాసనసభ్యుడిగా ఉంటూ తెలంగాణ ఉద్యమ అవసరాల కోసం రాజీనామా చేశారు. రాజకీయాల్లో ప్రవేశించిన నాటి నుంచి ఆయన కమలాపూర్‌, హుజూరాబాద్‌ నియోజకవర్గాల నుంచి ఆరుసార్లు శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. అందులో రెండు ఉప ఎన్నికలు కాగా, నాలుగు సాధారణ ఎన్నికలు.  ఇప్పుడు మూడోసారి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ పైనే యుుద్ధాన్ని ప్రకటించారు. రాజీనామా సందర్భంగా హుజూరాబాద్‌లో కౌరవులకు, పాండవులకు మధ్య కురుక్షేత్ర యుద్ధం జరుగబోతుందని ఇది తెలంగాణ ప్రజలకు కేసీఆర్‌ కుటుంబానికి మధ్య జరిగే ఎన్నిక అంటూ నేరుగా టీఆర్‌ఎస్‌ అధినేతపై యుద్ధం ప్రకటించారు. హుజూరాబాద్‌ నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తానని కూడా ఆయన వెల్లడించారు.


ఎత్తులకు పైఎత్తులు


 ఈటల బీజేపీలో చేరిన తర్వాత హుజూరాబాద్‌ నియోజకవర్గంలో చేపట్టే పాదయ్రాత ఇక్కడ రాజకీయ వేడిని రగులుస్తుందని భావిస్తున్నారు. టీఆర్‌ఎస్‌ అధినేతపైనే యుద్ధాన్ని ప్రకటించడంతో ఆ పార్టీ నాయకత్వం హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో గెలువడాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నది. ఇప్పటికే మంత్రులు హరీష్‌రావు, గంగుల కమలాకర్‌, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బి వినోద్‌కుమార్‌ నియోజకవర్గ సమన్వయబాధ్యతలను చేపట్టి పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ అనుసరించాల్సిన వ్యూహాలను రచిస్తున్నారు. వీరితోపాటు మంత్రులు కొప్పుల ఈశ్వర్‌, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, నారదాసు లక్ష్మణ్‌రావు, ఎమ్మెల్యేలు వొడితెల సతీష్‌బాబు, సుంకె రవిశంకర్‌, ఆరూరి రమేశ్‌, పెద్ది సుదర్శన్‌రెడ్డి, చల్లా ధర్మారెడ్డి, మేయర్‌ సునీల్‌రావు, సుడా చైర్మన్‌ జీవీ రామకృష్ణారావు, జడ్పీ చైర్‌పర్సన్‌ కె.విజయ, సీనియర్‌ నాయకుడు పెర్యాల రవీందర్‌రావును వివిధ మండలాల్లో ఇన్‌చార్జీలుగా పర్యటిస్తున్నారు. ఇప్పటికే గ్రామాలవారీగా సమావేశాలు ఏర్పాటు చేసి టీఆర్‌ఎస్‌ నేతలు, కార్యకర్తలతో అక్కడి పరిస్థితులను సమీక్షిస్తున్నారు. ఈటల రాజేందర్‌ మంత్రిగా ఉన్న కాలంలో ఆయన మాత్రమే పార్టీ వ్యవహారాలన్నీ చూసుకునేవారు. ద్వితీయ శ్రేణి నాయకుల్లో ఎవరూ కూడా ఇప్పుడు నియోజకవర్గ పరిస్థితిని నిర్వహించే గలిగే పరిస్థితి లేక పోవడంతో అధినాయకత్వం మండలాలవారిగా మంత్రులు, ఎమ్మెల్యేలను ఇన్‌చార్జీలుగా ప్రకటించింది. 


ప్రతి వంద ఓటర్లకు ఓ ఇన్‌చార్జి


నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికల తరహాలో వ్యూహాన్ని అమలు చేసి ప్రతి 100 ఓటర్లకు ఒక ఇన్‌చార్జీని నియమించాలని పార్టీ భావిస్తున్నది. అందుకే గ్రామస్థాయిలో బూత్‌ కమిటీలను కూడా నియమించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. బూత్‌స్థాయిలో ఉన్న ఓటర్లకు ఇన్‌చార్జీలను నియమించి వారందరిని పోలింగ్‌ బూత్‌కు తీసుకువచ్చి ఓటు వేయించే విధంగా చర్యలు తీసుకోవాలని, ప్రతి ఒక్కరి పలుమార్లు కలుస్తూ టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా ఓటు వేయించాలని వ్యూహాన్ని రూపొందిస్తున్నారు. మరోవైపు ఈటల రాజేందర్‌ ఇప్పటికే కమలాపూర్‌, ఇల్లందకుంట మండలాల్లో పర్యటించి ర్యాలీలు తీశారు. ఆత్మగౌరవ నినాదాన్ని ఇస్తూ తాను నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిని వివరిస్తూ తనను మంత్రి వర్గం నుంచి తప్పించిన తీరును ప్రజలకు తెలియజేస్తూ వారి సానుభూతి పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. బీజేపీలో చేరిన తర్వాత ఆయన హుజూరాబాద్‌కు వచ్చి ఉప ఎన్నిక ముగిసేంతవరకు నియోజకవర్గంలోనే పర్యటించే విధంగా కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం. అటు టీఆర్‌ఎస్‌, ఇటు ఈటల రాజేందర్‌ పోటాపోటీగా చేపట్టే రాజకీయ కార్యక్రమాలతో హుజురాబాద్‌లో రాజకీయం వేడెక్కింది.

Updated Date - 2021-06-13T05:43:43+05:30 IST