ఎన్నికల బరిలో ఎనిమిది మంది మాజీ సీఎంల వారసులు

ABN , First Publish Date - 2022-08-08T10:15:11+05:30 IST

వచ్చే ఎన్నికలు హాట్‌ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. అధికార వైసీపీ మరోసారి అధికారం నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తుంటే..

ఎన్నికల బరిలో ఎనిమిది మంది మాజీ సీఎంల వారసులు

  • వారసత్వం నిలుపుకొనేలా రాజకీయ పోరు
  • అత్యధికంగా టీడీపీలో నలుగురు  నేతలు.. వైసీపీలో సీఎం సహా ముగ్గురు పోటీ


(అమరావతి-ఆంధ్రజ్యోతి): వచ్చే ఎన్నికలు హాట్‌ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. అధికార వైసీపీ మరోసారి అధికారం నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తుంటే.. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ వచ్చే ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే. అయితే.. ఈద ఫా ఎన్నికల బరిలో ఎనిమిది మంది మాజీ ముఖ్యమంత్రుల వారసులు పోటీ చేయనుండడం ఆసక్తిగా మారింది. తమ కుటుంబాల రాజకీయ వారసత్వాన్ని నిలుపుకోవడానికి వారు ప్రయత్నిస్తున్నారు. వీరిలో అత్యధికంగా 4 కుటుంబాలకు చెందిన వా రు ప్రధాన ప్రతిపక్షం టీడీపీలో ఉండటం విశేషం. మూడు కుటుంబాలకు చెందిన వారు అధికార పక్షం వైసీపీలో ఉన్నారు. మరో కుటుంబానికి చెందిన వారు జనసేనలో ఉన్నారు. ఇంకో కుటుంబం బీజేపీలో ఉన్నా ఎన్నికల బరిలోకి వస్తారా లేదా అన్నది స్పష్టత లేదు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రి. ఆయన రాజకీయంగా క్రియాశీలంగా ఉండి పార్టీని నడిపిస్తున్నారు. ఆయన కుమారుడు లోకేశ్‌ రాజకీయాల్లోకి చురుగ్గా పనిచేస్తున్నారు.


 వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు తన సొంత నియోజకవర్గం కుప్పం నుంచి.. ఆయన కుమారుడు లోకేశ్‌ మంగళగిరి నుంచి పోటీ చేయడం ఖాయమైంది. ఇక, టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు కుమారుడు బాలకృష్ణ ప్రస్తుతం హిందూపురం ఎమ్మెల్యేగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా ఆయన అక్కడ నుంచే పోటీ చేయనున్నారు. మరో మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయ భాస్కరరెడ్డి కుటుంబం ఇప్పుడు టీడీపీలోనే ఉంది. ఆయన కుమారుడు సూర్యప్రకాశ్‌ రెడ్డి గత ఎన్నికల్లో టీడీపీ తరఫున కర్నూలు ఎంపీ అభ్యర్థిగా, ఆయన సతీమణి సుజాతమ్మ ఆలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. వీరిద్దరూ వచ్చే ఎన్నికల్లో అవే నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తారని టీడీపీలో ప్రచారం జరుగుతోంది. వీరిలో సూర్య ప్రకాశ్‌రెడ్డి బయట అంతగా కనిపించకపోయినా సుజాతమ్మ మాత్రం తన నియోజకవర్గం ఆలూరులో చురుగ్గా తిరుగుతున్నారు. మరో మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌ కుమార్‌ రెడ్డి సోదరుడు కిశోర్‌ కుమార్‌ రెడ్డి కూడా టీడీపీలో చురుగ్గా ఉన్నారు. కిరణ్‌ క్రియాశీల రాజకీయాలకు దూరంగా హైదరాబాద్‌లో ఉంటున్నారు. ఆయన సొంత నియోజకవర్గం పీలేరులో తమ్ముడు కిశోర్‌ టీడీపీ ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్నారు. పార్టీ వ్యవహారాల్లో ఆయన కీలకంగా ఉంటూ వైసీపీతో ఢీ అంటే ఢీ అంటున్నారు. 


వైసీపీ విషయానికి వస్తే..

మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ తనయుడు జగన్మోహన్‌రెడ్డి ఇప్పుడు సీఎంగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా పులివెందుల నియోజకవర్గం నుంచే పోటీ చేయనున్నారు. మరో మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి కుటుంబానికి చెందిన కాసు మహేశ్‌ రెడ్డి ఇప్పుడు గురజాల నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. కాసు కుటుంబానికి మొదటి నుంచి నర్సరావుపేట కేంద్ర స్థానం అయినా అక్కడ ఖాళీ లేకపోవడంతో మహేశ్‌ రెడ్డి గురజాల నుంచి పోటీచేసి నెగ్గారు. ఈసారి కూడా ఆయన అక్కడే పోటీ చేయబోతున్నారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి కుటుంబం కూడా వైసీపీలోనే ఉంది. గత ఎన్నికల్లో ఆ కుటుంబం నుంచి ఎవరూ పోటీ చేయలేదు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జనార్దన్‌ రెడ్డి కుమారుడు రామ్‌ కుమార్‌ రెడ్డి వైసీపీలో క్రియాశీలం అయ్యారు. 


ఆయనకు ఒక నామినేటెడ్‌ పదవి కూడా ఇచ్చారు. ఆ కుటుంబం సొంత నియోజకవర్గం వెంకటగిరి నుంచి ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యేగా ఆనం రామనారాయణ రెడ్డి ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో రామనారాయణ రెడ్డి పోటీ చేయకపోతే ఆ సీటును నేదురుమల్లి రామ్‌ కుమార్‌ రెడ్డికి ఇవ్వవచ్చని అంటున్నారు. ఇక, మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు కుమారుడు నాదెండ్ల మనోహర్‌ జనసేన పార్టీలో క్రియాశీలంగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన తెనాలి నుంచి అసెంబ్లీకి  పోటీ చేయవచ్చని తెలుస్తోంది. మరోవైపు ఎన్టీఆర్‌ కుమార్తె పురందేశ్వరి ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు. పార్టీలో జాతీయ స్థాయి పదవిలో ఉన్న ఆమె వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో పోటీ చేస్తారా? లేదా? అన్నది ఇంకా స్పష్టత లేదు. బీజేపీకి ఏ పార్టీతో అయినా పొత్తు ఉంటే ఆమె ఎన్నికల బరిలోకి వచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఆమె భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. వారి కుమారుడు ఈసారి అసెంబ్లీ ఎన్నికల బరిలోకి రావచ్చునని ఊహాగానాలు వినవస్తున్నా అందులో కూడా స్పష్టత లేదు. ఇదిలావుంటే, మరికొందరు మాజీ ముఖ్యమంత్రుల కుటుంబాల నుంచి ప్రస్తుతం ఎవరూ రాజకీయాల్లో లేరు. నీలం సంజీవ రెడ్డి, దామోదరం సంజీవయ్య, టంగుటూరి ప్రకాశం, భవనం వెంకట్రామ్‌ కుటుంబాల వారు ఎవరూ క్రియాశీల రాజకీయాల్లో లేకపోవడం గమనార్హం.

Updated Date - 2022-08-08T10:15:11+05:30 IST