కృతజ్ఞతలు చెల్లించుకుందాం..

ABN , First Publish Date - 2022-04-29T05:30:00+05:30 IST

‘ఈద్‌’ ఒక ఆధ్యాత్మిక ఆరాధన. అది పవిత్రమైన రంజాన్‌ మాసంలో నెలవంకను చూసిన తరువాత ప్రారంభమవుతుంది. రంజాన్‌ నెల..

కృతజ్ఞతలు చెల్లించుకుందాం..

‘ఈద్‌’ ఒక ఆధ్యాత్మిక ఆరాధన. అది పవిత్రమైన రంజాన్‌ మాసంలో నెలవంకను చూసిన తరువాత ప్రారంభమవుతుంది. రంజాన్‌ నెల మొత్తం కొనసాగి, షవ్వాల్‌ నెలవంకను చూసిన తరువాత...  పండుగ నమాజ్‌తో ముగుస్తుంది. ‘పండుగ’ అంటే కరుణామయుడైన అల్లాహ్‌కు కృతజ్ఞతలు తెలియజేసుకొనే సందర్భం. ఆయన మనకు ప్రసాదించిన వరాలను గుర్తించడం, ఆయన కరుణానుగ్రహాన్ని తలచుకోవడం, విశ్వాసాన్ని స్థిరపరుచుకోవడం, ధర్మాన్ని బలపరచడం, ఆయనకు విధేయంగా జీవితాన్ని గడపడం. ఉపవాసాలలో జరిగిన పొరపాట్లకు పరిహారంగా ఈద్‌ రోజున నిరుపేదలకు జకాతుల్‌ ఫిత్ర్‌ దానాన్ని ఖచ్చితంగా చెయ్యాలి. ఇది పేదల్లో అమితమైన సంతోషాన్ని నింపుతుంది. పరస్పర దయ, సహకార గుణాలను పెంపొదిస్తుంది. హృదయాలను శుద్ధి చేస్తుంది. 


ఈద్‌... అల్లాహ్‌ తరఫున బహుమతులను అందుకొనే రోజు. పరిపూర్ణ విశ్వాసంతో, పుణ్యఫలాపేక్షతో ఉపవాసాలు చేసిన వారికి ఈ పండుగ గొప్ప కానుక. అలాగే, ఉపవాస సమయంలో పాపకార్యాలు చేసి, అల్లాహ్‌ నిర్దేశించిన పరిధులను అతిక్రమించి, ఆయన ఆజ్ఞలను నిర్లక్ష్యం చేసిన వారు... తమ తప్పులు తెలుసుకొని, పశ్చాత్తాపం చెందవలసిన రోజు కూడా ఇదే.


పండుగ రోజు నమాజ్‌ ముగించుకొని, వెనుతిరిగేవారు రెండు రకాలుగా ఉంటారు. ఒకరు... అల్లాహ్‌ తరఫున బహుమతులు పొంది, ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకొనేవారు. పరమ ప్రభువు, కృపాశీలుడు అయిన అల్లాహ్‌ అటువంటి వారిని ఉద్దేశించి ‘‘వెళ్ళండి. నేను మిమ్మల్ని క్షమించాను’’ అని అంటాడు. ఇక రెండో రకం వారు... రంజాన్‌ మాసపు సర్వ శుభాలనూ పోగొట్టుకున్న నిరాశామూర్తులు. వీరు నష్టాలతో, పరితాపంతో సర్వస్వం కోల్పోయి, అసంతృప్తులై తిరిగి వెళ్తారు.



ఈదుల్‌ ఫిత్ర్‌ రోజున చేయాల్సినవి

పవిత్రమైన ఈదుల్‌ ఫిత్ర్‌ పర్వదినాన... ఉదయాన్నే లేచి, కాలకృత్యాలు తీర్చుకొని, ఫజ్ర్‌ నమాజ్‌ కచ్చితంగా చదవాలి. మంచి దుస్తులు ధరించి, అలంకారాలు చేసుకొని, కళ్ళకు సుర్మా పెట్టుకోవాలి. ఈద్‌ నమాజ్‌ కన్నా ముందే జకాత్‌, ఫిత్రా దానాలు చేయాలి. తీపి పదార్థాలను, బేసి సంఖ్యలో ఖర్జూరాన్నీ తినాలి. ఈద్‌గాహ్‌ మైదానానికి ఒక దారిలో వెళ్ళి, తిరిగి మరో దారిలో రావాలి. ఈద్‌ నమాజ్‌కు వెళుతున్నప్పుడు... దారిలోనూ, ఈద్‌గాహ్‌లో నమాజ్‌కు పూర్వం  తక్బీర్‌ను మెల్లగా చదువుకోవాలి. కాలినడకన వెళ్ళేవారికి ఎంతో పుణ్యం లభిస్తుంది. పండుగ నమాజ్‌ తరువాత పరస్పరం సలామ్‌ చెపుఁకోవాలి. పిల్లలకు ‘ఈదీ’ (బహుమతులు) ఇవ్వాలి. బంధువుల ఇళ్ళకు వెళ్ళి, వారిని పలకరించాలి. ఇరుగు పొరుగువారిని ఇంటికి పిలిచి, తీపి పదార్థాలను అందజేయాలి. ఆర్తులు ఎవరైనా వస్తే, వారికి తప్పనిసరిగా దానం ఇచ్చి పంపాలి. అల్లాహ్‌కు కోటానుకోట్ల కృతజ్ఞతలు చెప్పుకొంటూ, పండుగ రోజును సంతోషంగా గడపాలి. 


పండుగ నమాజ్‌ను ఇరుకైన జనావాసాలలో కాకుండా... విశాలమైన బహిరంగ ప్రదేశాలలో (ఈద్‌గాహ్‌ దగ్గర) చేయడం ఉత్తమం. దైవ ప్రవక్త మహమ్మద్‌ సంప్రదాయం కూడా ఇదే. ఈద్‌గాహ్‌ అందుబాటులో లేనప్పుడు... స్థానికంగా పెద్ద మసీదులలో ఈద్‌ నమాజ్‌ చేయాలి.






- మహమ్మద్‌ వహీదుద్దీన్‌

Updated Date - 2022-04-29T05:30:00+05:30 IST