ఎగ్‌స్ర్టా జాయ్‌

ABN , First Publish Date - 2020-06-27T05:30:00+05:30 IST

ఎగ్‌ ఎప్పుడూ ఎవర్‌గ్రీనే! ఆమ్లెట్‌ ఉంటే చాలు... కర్రీ ఏదైనా సరే లాగించేయవచ్చు. అయితే ఎప్పుడూ బాయిల్డ్‌ ఎగ్‌, ఆమ్లెట్‌ అంటే బోర్‌ కొడుతుంది...

ఎగ్‌స్ర్టా జాయ్‌

ఎగ్‌ ఎప్పుడూ ఎవర్‌గ్రీనే! ఆమ్లెట్‌ ఉంటే చాలు... కర్రీ ఏదైనా సరే లాగించేయవచ్చు. అయితే ఎప్పుడూ బాయిల్డ్‌ ఎగ్‌, ఆమ్లెట్‌ అంటే బోర్‌ కొడుతుంది. అందుకే కాస్త వెరైటీగా ఎగ్‌ 65, ఎగ్‌ ఫింగర్స్‌, కబాబ్స్‌, రోల్‌ ట్రై చేయండి. 


ఎగ్‌ 65


కావలసినవి

కోడిగుడ్లు - రెండు(ఉడికించినవి), ఉడకబెట్టని కోడిగుడ్డు - ఒకటి, పిండి - అర కప్పు, ఉప్పు - తగినంత, అల్లం - కొద్దిగా, వెల్లుల్లి రెబ్బలు - నాలుగైదు, పచ్చిమిర్చి - నాలుగు, నూనె - తగినంత, కారం - ఒక టేబుల్‌స్పూన్‌, గరంమసాలా - ఒక టీస్పూన్‌, బ్రెడ్‌ క్రంబ్స్‌ - కొద్దిగా, కరివేపాకు - ఒక కట్ట, కొత్తిమీర - ఒకకట్ట, పెరుగు - అరకప్పు, పంచదార - చిటికెడు, చిల్లీసాస్‌ - ఒక టేబుల్‌స్పూన్‌. 


తయారీ

  1. ముందుగా ఉడకబెట్టిన కోడిగుడ్లలోని తెలుపు భాగాన్ని చిన్నచిన్న ముక్కలుగా కట్‌ చేయాలి.
  2. వాటిని ఒక పాత్రలోకి తీసుకొని అందులో వెల్లుల్లి రెబ్బలు, కారం, తరిగిన అల్లం ముక్కలు, గరం మసాలా, కొద్దిగా బ్రెడ్‌ క్రంబ్స్‌, పిండి వేసి కలపాలి. ఇందులో ఒక కోడిగుడ్డు కొట్టి ఎగ్‌వైట్‌ మాత్రమే వేయాలి. కొద్దిగా ఉప్పు వేసి అన్నీ బాగా కలిసేలా కలియబెట్టాలి. 
  3. స్టవ్‌పై ఒక పాత్రపెట్టి నూనె వేసి కాస్త వేడి అయ్యాక మిశ్రమాన్ని కొద్దికొద్దిగా చేతుల్లోకి తీసుకుంటూ నూనెలో వేయాలి.
  4. గోధుమరంగులోకి మారే వరకు వేగించి తీసుకోవాలి. 
  5. ఇప్పుడు స్టవ్‌పై పాన్‌పెట్టి కాస్త నూనె వేసి తరిగిన అల్లం ముక్కలు, వెల్లుల్లి, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేగించాలి.
  6. కాసేపు వేగిన తరువాత పెరుగు కొద్దిగా చిల్లీ సాస్‌ కూడా వేయాలి. 
  7. కారం, గరంమసాలా వేసి కలపాలి. చిటికెడు పంచదార వేస్తే రుచి బాగుంటుంది.
  8. ఇప్పుడు కొత్తిమీర వేసి వేగించి పెట్టుకున్న ఎగ్‌ 65 వేసి కలియబెట్టాలి. 
  9. కాసేపు వేగిన తరువాత కాస్త ఉప్పు చల్లి దింపాలి. క్రిస్పీగా రుచికరంగా ఉండే ఎగ్‌ 65ను పిల్లలు ఇష్టంగా తింటారు. 




ఎగ్‌ ఫింగర్స్‌


కావలసినవి 

కోడిగుడ్లు - ఎనిమిది, ఉప్పు - తగినంత, మిరియాల పొడి - అర టీస్పూన్‌, కార్న్‌ఫ్లోర్‌ - పావు కప్పు, నూనె - సరిపడా, ఆల్‌ పర్పస్‌ ఫ్లోర్‌ - పావు కప్పు, చిల్లీ ఫ్లేక్స్‌ - అర టీస్పూన్‌, బ్రెడ్‌ క్రంబ్స్‌ - రెండు టేబుల్‌స్పూన్లు


తయారీ

  1. ఫ ముందుగా ఒక పాత్రలో కోడిగుడ్లు కొట్టి వేసుకోవాలి.
  2. ఫ తరువాత అందులో ఉప్పు, మిరియాలపొడి వేసి బాగా కలియబెట్టాలి.
  3. ఫ వెడల్పాటి పాన్‌ తీసుకుని నూనె రాసి అందులో కోడిగుడ్ల మిశ్రమం పోయాలి. 
  4. ఫ ఒక వెడల్పాటి పాత్రలో కొద్దిగా నీళ్లు తీసుకుని స్టవ్‌పై పెట్టాలి. మధ్యలో చిన్న స్టాండ్‌లాంటిది పెట్టి దానిపై కోడిగుడ్ల మిశ్రమం పోసిన పాన్‌పెట్టి మూత పెట్టాలి. నీళ్లు పోసిన పాత్రపై కూడా మూత పెట్టాలి.
  5. ఫ చిన్నమంటపై అరగంట పాటు ఉడికించాలి.
  6. ఫ తరువాత నెమ్మదిగా బయటకు తీయాలి. ఊతప్పం మాదిరిగా అయిన వెంటనే దీన్ని వేరే ప్లేట్‌లోకి మార్చుకోవాలి.
  7. ఫ కత్తితో ఫింగర్స్‌ మాదిరిగా కట్‌ చేయాలి. 
  8. ఫ మరొక పాత్రలో కార్న్‌ఫ్లోర్‌, ఆల్‌ పర్పస్‌ ఫ్లోర్‌, తగినంత ఉప్పు, చిల్లీ ఫ్లేక్స్‌ వేసి కలపాలి.
  9. ఫ మరొక ప్లేట్‌లో కోడిగుడ్లు కొట్టి వేసి చిటికెడు ఉప్పు వేసి కలియబెట్టాలి.
  10. ఫ ఇప్పుడు కట్‌ చేసి పెట్టుకున్న ఫింగర్స్‌ను పిండి మిశ్రమంలో అద్దుతూ, కోడిగుడ్డు సొనలో ముంచాలి. తరువాత బ్రెడ్‌ క్రంబ్స్‌ అద్దాలి. 
  11. ఫ స్టవ్‌ ఒక పాన్‌ పెట్టి నూనె పోసి వేడి అయ్యాక బ్రెడ్‌ క్రంబ్స్‌ అద్దిన ఫింగర్స్‌ వేసి వేగించాలి. అంతే... ఎగ్‌ ఫింగర్స్‌ రెడీ.




వడ


కావలసినవి

కోడిగుడ్లు - నాలుగు(ఉడికించినవి), కార్న్‌ఫ్లోర్‌ - ఒక కప్పు, సెనగపిండి - రెండు కప్పులు, బియ్యప్పిండి - రెండు కప్పులు, ఉప్పు - రుచికి తగినంత, నూనె - సరిపడా,  వెల్లుల్లి రెబ్బలు - నాలుగు, పచ్చిమిర్చి - నాలుగైదు, ఉల్లిపాయలు - రెండు, అల్లం  - చిన్నముక్క, తోటకూర - ఒక కట్ట.


తయారీ

  1. ఒకపాత్రలో కోడిగుడ్లను కొట్టి వేయాలి. తరువాత అందులో సెనగపిండి, బియ్యప్పిండి వేసి కలపాలి.
  2. తగినంత ఉప్పు, కారం వేయాలి. కార్న్‌ఫ్లోర్‌ వేసి కలపాలి. 
  3. తరిగిన పచ్చిమిర్చి, చిదిమిన వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయలు వేయాలి.
  4. తోటకూరను చిన్నగా కట్‌ చేసి వేయాలి. అన్నీ బాగా కలిసేలా కలపాలి.
  5. ఇప్పుడు మిశ్రమాన్ని కొద్దికొద్దిగా తీసుకుంటూ వడల మాదిరిగా చేయాలి.
  6. పాన్‌పెట్టి నూనె పోసి వేడి అయ్యాక వాటిని వేసి గోధుమరంగులోకి మారే వరకు వేగించితే నోరూరించే ఎగ్‌ వడలు రెడీ.



ఎగ్‌రోల్‌


కావలసినవి

కోడిగుడ్లు - నాలుగు, కారం - ఒక టీస్పూన్‌, క్యారెట్లు - రెండు, ఉప్పు - తగినంత, నూనె - కొద్దిగా, కొత్తిమీర - ఒకకట్ట, ఉల్లిపాయలు - రెండు.


  1. ముందుగా ఒక బౌల్‌లో కోడిగుడ్లు కొట్టి వేయాలి. అందులో ఉప్పు, కారం, ఉల్లిపాయలు, క్యారెట్‌ తురుము, కొత్తిమీర వేసి బాగా కలపాలి.
  2. వెడల్పాటి పాన్‌ను స్టవ్‌పై పెట్టి కొద్దిగా నూనె రాసి కోడి గుడ్లను ఆమ్లెట్‌లా, కాస్త పలుచగా వేయాలి.
  3. ఆమ్లెట్‌ బాగా కాలిన తర్వాత ఒకవైపు నుంచి స్పూన్‌తో నెమ్మదిగా రోల్‌ చేయాలి. పాన్‌పై ఖాళీ అయిన ప్లేస్‌లో మళ్లీ ఆమ్లెట్‌ వేయాలి. 
  4. ఆ ఆమ్లెట్‌ కూడా కాలాక, రోల్‌ చేసిన దీన్ని కూడా ఆమ్లెట్‌తో సహా మళ్లీ రోల్‌ చేయండి.
  5. గరిటెతో వత్తుకుంటూ రెండు వైపులా రోల్‌ను బాగా కాల్చాలి. 
  6. తరువాత కత్తితో రోల్‌ను ముక్కలుగా కట్‌ చేసుకోవాలి. 
  7. ఎగ్‌రోల్‌ను టొమాటో సాస్‌తో పెడితే పిల్లలు ఇష్టంగా తింటారు.




కోడిగుడ్డు పచ్చడి


కావలసినవి

కోడిగుడ్లు - మూడు(ఉడికించినవి), గరంమసాలా - రెండు టేబుల్‌స్పూన్లు, మెంతి పొడి - ఒక టీస్పూన్‌, ఆవ పొడి - ఒక టేబుల్‌స్పూన్‌, అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక స్పూన్‌, ఉప్పు - ఒక టేబుల్‌స్పూన్‌, ఆవాల నూనె - మూడు టేబుల్‌స్పూన్లు, కరివేపాకు - కొద్దిగా, కారం - ఒక టేబుల్‌స్పూన్‌, ఆవాలు - ఒక టీస్పూన్‌, జీలకర్ర - ఒక టీస్పూన్‌, నిమ్మకాయ - ఒకటి, కొత్తిమీర - కొద్దిగా. 


తయారీ

  1. ఉడికించిన గుడ్లను పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి.
  2. స్టవ్‌పై ఒక పాత్ర పెట్టి నూనె వేసి కాస్త వేడి అయ్యాక ఆవాలు, జీలకర్ర వేసి వేగించాలి.
  3. తరువాత ఉడికించిన గుడ్లమీద కత్తితో గాట్లు పెట్టి అందులో వేయాలి. చిన్నమంటపై వేగించాలి.
  4. కోడిగుడ్లు గోధుమరంగులోకి మారే వరకు వేగించాలి. 
  5. ఇప్పుడు అల్లంవెల్లుల్లి పేస్టు వేయాలి. గరంమసాలా, ఉప్పు, కారం వేసి మరి కాసేపు వేగనివ్వాలి.
  6. చివరగా కరివేపాకు వేసి దింపాలి.
  7. మిశ్రమం చల్లారిన తరువాత ఆవాల పొడి, మెంతి పొడి వేయాలి. కొత్తిమీర వేసుకోవాలి.
  8. నిమ్మరసం పిండుకొని కలపాలి. అంతే.. కోడిగుడ్డు పచ్చడి రెడీ. అన్నంలోకి, చపాతీలోకి ఈ పచ్చడి రుచిగా ఉంటుంది.



కబాబ్స్‌



కావలసినవి

కోడిగుడ్లు - మూడు(ఉడికించినవి), బంగాళదుంపలు - రెండు, పచ్చిమిర్చి - రెండు, పసుపు - చిటికెడు, అల్లంవెల్లుల్లి పేస్టు - ఒక టీస్పూన్‌, సెనగపిండి - రెండు టేబుల్‌స్పూన్లు, కార్న్‌ఫ్లోర్‌ - రెండు టేబుల్‌స్పూన్లు, బ్రెడ్‌ క్రంబ్స్‌ - రెండు కప్పులు, మిరియాల పొడి - ఒక టీస్పూన్‌, ఉప్పు - తగినంత, నూనె - సరిపడా.


తయారీ

  1. బంగాళదుంపలను ఉడికించి గుజ్జులా చేసుకోవాలి. తరువాత దాంట్లో పచ్చిమిర్చి, పసుపు, తగినంత ఉప్పు, అల్లంవెల్లుల్లి పేస్టు, రెండు టేబుల్‌స్పూన్ల సెనగపిండి వేసి బాగా కలపాలి.
  2. ఇప్పుడు ఉడికించిన కోడిగుడ్లను పొడవు ముక్కలుగా కట్‌ చేయాలి. 
  3. కోటింగ్‌ కోసం ఒక పాత్రలో బ్రెడ్‌ క్రంబ్స్‌ తీసుకోవాలి. అందులో కొద్దిగా మిరియాల పొడి, ఉప్పు వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి.
  4. మరొక పాత్రలో రెండు టేబుల్‌స్పూన్ల కార్న్‌ఫ్లోర్‌ తీసుకోవాలి. అందులో కొద్దిగా నీళ్లు పోసి పలుచగా అయ్యేలా కలపాలి.
  5. ఇప్పుడు బంగాళదుంప మిశ్రమాన్ని కొద్దికొద్దిగా చేతుల్లోకి తీసుకుంటూ వెడల్పుగా గారెల్లా ఒత్తుకోవాలి. తరువాత మధ్యలో కోడిగుడ్డు ముక్క పెట్టి చుట్టూ ఆలూ మిశ్రమాన్ని దగ్గరకు ఒత్తి కబాబ్స్‌ మాదిరిగా చేయాలి. 
  6. తరువాత వాటిని కార్న్‌ఫ్లోర్‌లో డిప్‌ చేసుకుంటూ, బ్రెడ్‌ క్రంబ్స్‌ని అద్దాలి. 
  7. ఒక పాన్‌ను స్టవ్‌పై పెట్టి నూనె పోసి వేడి అయ్యాక వాటిని డీప్‌ ఫ్రై చేసుకోవాలి.
  8. అంతే.. ఎగ్‌ కబాబ్స్‌ రెడీ. వీటిని చట్నీతో సర్వ్‌ చేసుకుంటే రుచిగా ఉంటాయి.

Updated Date - 2020-06-27T05:30:00+05:30 IST