టెక్స్‌టైల్‌ పార్కు సమస్యల పరిష్కారానికి కృషి

ABN , First Publish Date - 2022-10-01T05:41:45+05:30 IST

సిరిసిల్ల టెక్స్‌టైల్‌ పార్కు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పవర్‌లూం, టెక్స్‌టైల్‌ అభివృద్ధి కార్పొరేషన్‌ చైర్మన్‌ గూడూరి ప్రవీణ్‌ అన్నారు.

టెక్స్‌టైల్‌ పార్కు సమస్యల పరిష్కారానికి కృషి
గూడూరి ప్రవీణ్‌ను సన్మానిస్తున్న టెక్స్‌టైల్‌ పార్కు అసోసియేషన్‌అధ్యక్షుడు, ప్రతినిధులు

 సిరిసిల్ల, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): సిరిసిల్ల టెక్స్‌టైల్‌ పార్కు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పవర్‌లూం, టెక్స్‌టైల్‌ అభివృద్ధి కార్పొరేషన్‌ చైర్మన్‌ గూడూరి ప్రవీణ్‌ అన్నారు. శుక్రవారం సిరిసిల్ల టెక్స్‌టైల్‌ పార్కును పరిశీలించారు. ఈ సందర్భంగా  టెక్స్‌టైల్‌ పార్కు ప్రతినిధులు ఆయనను ఘనంగా   సన్మానించారు. పార్కులో ఎదుర్కొంటున్న సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా చైర్మన్‌ మాట్లాడుతూ పార్కు సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకవెళ్లి పరిష్కరిస్తామన్నారు. పార్కులో వస్త్రోత్పత్తి రంగంలో అనేక మార్పులు రావాల్సి ఉందన్నారు. ఆధునిక వస్త్రోత్పత్తిపై దృష్టి పెట్టి తిర్పూర్‌ తరహాలో ఎగుమతులను పెంచుకోవాలన్నారు. టెక్స్‌టైల్‌ పార్కు క్లాత్‌ మ్యానుఫాశ్చరర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు అన్నల్‌దాస్‌ అనిల్‌ పార్కు సమస్యలపై వినతిపత్రాన్ని అందించారు. విద్యుత్‌ యూనిట్‌ రేట్ల తగ్గింపు, రాయితీలు,  ఎన్‌వోసీల సమస్యలతోపాటు మౌలికసదుపాయాల సమస్యలను చైర్మన్‌ దృష్టికి తీసుకెళ్లారు. టెక్స్‌టైల్‌ రంగంలో ప్రధానంగా భీవండి, షోలాపూర్‌, తారాపూర్‌, ఇచ్ఛల్‌కరంజ్‌, తిర్పూర్‌లలో విద్యుత్‌ రేట్లు రూ.4.50 మించి లేవని సిరిసిల్ల పార్కులో మాత్రం రూ.7.70 ఉందని అన్నారు. విద్యుత్‌ భారం కూడా ప్రధానంగా ఉన్నట్లు పేర్కొన్నారు. పార్కులో ఎన్‌వోసీ లేకపోవడంతో అభివృద్ధి కుంటుపడుతోందన్నారు. దీనికి చైర్మన్‌ సానుకూలంగా స్పందించారు.  సమావేశంలో చేనేత జౌళి శాఖ డీడీ అశోక్‌రావు, ఏడీ సాగర్‌, పార్కు ప్రతినిధులు వేముల శ్రీనివాస్‌, కళ్యాడపు సుభాష్‌, బొద్దుల సుదర్శన్‌, వాసం శ్రీనివాస్‌, గాజుల రాజేశం, అంకారఫు కిరణ్‌, దుబాల మొండయ్య, యెల్లె లక్ష్మీనారాయణ, బొద్దుల వేణు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-10-01T05:41:45+05:30 IST