నాటుసారా నిర్మూలనకు కృషి చేయాలి

ABN , First Publish Date - 2022-06-29T06:24:00+05:30 IST

నేరనియంత్రణకు, నాటుసారా నిర్మూలనకు పోలీసులు నిరంతరం కృషి చేయాలని జిల్లా ఎస్పీ మలికగర్గ్‌ అన్నారు.

నాటుసారా నిర్మూలనకు కృషి చేయాలి
రికార్డులు పరిశీలిస్తున్న ఎస్పీ మలికగర్గ్‌

గిద్దలూరు టౌన్‌, జూన్‌ 28 : నేరనియంత్రణకు, నాటుసారా నిర్మూలనకు పోలీసులు నిరంతరం కృషి చేయాలని జిల్లా ఎస్పీ మలికగర్గ్‌ అన్నారు. మంగళవారం వార్షిక తనిఖీలో భాగంగా ఆమె గిద్దలూరు పోలీసుస్టేషన్‌ను తనిఖీ చేశారు. తొలుత పోలీసుస్టేషన్‌ పరిసరాలను పరిశీలించారు. అనంతరం రికార్డులను, కేసు డైరీలను, రిజిస్టర్‌లను పరిశీలించారు.  పోలీసుస్టేషన్‌లో సిబ్బంది పనితీరును సీఐ ఫిరోజ్‌ను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమైన కేసుల దర్యాప్తు, స్పందనలో వచ్చిన ఫిర్యాదులు, వాటి పరిష్కారం, పిటిషన్‌ మేనేజ్‌మెంట్‌, దిశ, డయల్‌ 100 కాల్స్‌పై పోలీసులు సత్వరం స్పందించడంపై ఆరా తీశారు. విచారణలో ఉన్న కేసుల దర్యాప్తు విధానం, కేసుల పురోగతి గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. కేసుల పరిష్కారంలో వేగం పెంచాలని, కేసులు త్వరితగతిన పరిష్కరించి ఫిర్యాదుదారులకు న్యాయం చేయాలని సూచించారు. నాటుసారా అరికట్టడానికి సమగ్ర కార్యాచరణతో గట్టి చర్యలు తీసుకోవాలని, నిఘా వ్యవస్థను పటిష్ఠం చేసుకోవాలని పేర్కొన్నారు. నాటుసారా కేసులలో నిందితులను బైండవర్‌ చేయాలన్నారు. తరచూ పట్టుబడుతుంటే పీడీ యాక్ట్‌ అమలుజేసేందుకు వారిజాబితాను ఉన్నతాధికారులకు పంపించాలని ఆదేశించారు. స్టేషన్‌ పరిధిలో క్రమం తప్పకుండా అధికారులు పర్యటిస్తూ సమస్యలను పరిష్కరించి శాంతిభద్రతలకు విఘాతం కలుగకుండా చూడాల న్నారు. నల్లమల ఘాట్‌రోడ్డు, ముఖ్య కూడళ్ల వద్ద ట్రాఫిక్‌ సమస్యలు లేకుండా చూడాలని, రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. దొంగతనాలు, గొడవల నివారణ కొరకు పాత నేరస్థులు, రౌడీషీటర్ల కదలికలపై ప్రత్యేక నిఘా పెట్టాలని, ప్రతిరోజు విజిబుల్‌ ఫ్రెండ్లీ పోలీసు నిర్వహించాలన్నారు. ఈ  సందర్భంగా సచివాలయ మహిళ పోలీసులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమర్ధవంతంగా విధులు నిర్వహించేందుకు వారికి దిశ, నిర్ధేశం చేశారు. మిస్సింగ్‌ కేసులు, గుర్తు తెలియని శవాల గురించి, మహిళలు, చిన్నపిల్లల పట్ల జరిగే నేరాలు, సైబర్‌ నేరాలు, అక్రమ నాటుసారా తయారీ, విక్రయాలపై ఎప్పటికప్పుడు మహిళ పోలీసులు అధికారులకు తెలియజేయాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మలికాగర్గ్‌ పోలీసుస్టేషన్‌ ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో మార్కాపురం డీఎస్పీ కిశోర్‌కుమార్‌, ఎస్‌బీడీఎస్పీ మరియదాసు, సీఐ ఫిరోజ్‌, ఎస్‌ఐ బ్రహ్మనాయుడు, ఐటికోర్‌ ఎస్‌ఐ అజయ్‌కుమార్‌, ఎస్పీసీపీ నారాయణ, రాచర్ల, కొమరోలు, బేస్తవారపేట ఎస్సైలు మహేష్‌, సాంబయ్య, మాధవరావు పాల్గొన్నారు.

Updated Date - 2022-06-29T06:24:00+05:30 IST