Abn logo
Sep 16 2020 @ 04:07AM

అర్బన్‌ పార్కుల అభివృద్ధికి కృషి

కేసీఆర్‌ గొప్ప హరిత ప్రేమికుడు: మంత్రి కేటీఆర్‌ 


హైదరాబాద్‌, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో అర్బన్‌ పార్కుల అభివృద్థికి కృషి చేస్తున్నామని, త్వరలో మరో 1,799 పార్కులను అభివృద్థి చేయాలని ప్రతిపాదించామని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా అర్బన్‌ పార్కుల అభివృద్థిపై ఎమ్మెల్యేలు బాల్క సుమన్‌, కేపీ వివేకానంద, భేతి సుభాష్‌రెడ్డి, గువ్వల బాలరాజు, సంజయ్‌, కౌసర్‌ మొహియుద్దీన్‌లు అడిగిన ప్రశ్నలకు కేటీఆర్‌ సమాధానం ఇచ్చారు. ఇప్పటికే తెలంగాణలో 1,893 అభివృద్థి చెందిన అర్బన్‌ పార్కులున్నాయని, వీటికి అదనంగా మరో 1,799 పార్కులను అభివృద్థి చేయాలని ప్రతిపాదించామన్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే 797 పార్కులను అభివృద్థి చేశామన్నారు.


ఈ పార్కుల్లో కొన్నింటిని ట్రీ పార్కులుగా, మరికొన్నింటిని ల్యాండ్‌ ేస్కప్‌, అర్బన్‌, పంచతత్వ పార్కులుగా అభివృద్థి చేయాలని ప్రతిపాదించామన్నారు. సీఎం కేసీఆర్‌ను మించిన హరిత ప్రేమికుడు ప్రపంచంలో ఎక్కడా లేరని కొనియాడారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మున్సిపాలిటీ బడ్జెట్‌లో 10 శాతం గ్రీన్‌ బడ్జెట్‌ను పెట్టామన్నారు. మొక్కల సంరక్షణకు కఠిన చర్యలు తీసుకుంటున్నామని, 85 శాతం మొక్కలు బతికకపోతే ఉద్యోగం పోతుందనే భయాన్ని అధికారుల్లో కలిగించామన్నారు. రాష్ట్రంలో గ్రీన్‌ కవర్‌ 24 శాతం నుండి 29 శాతానికి పెరిగిందని, ఈ ఘనత కేసీఆర్‌ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు.  


పాడి రైతులు పరేషాన్‌ కావొద్దు: తలసాని

పాడి రైతులు విజయ డెయిరీకే నిత్యం పాలు  పోయాలని, లీటరుకు రూ.4 చొప్పున ప్రభుత్వం ఇచ్చే ఇన్సెంటివ్‌ రాకపోతే ఆందోళన చెందాల్సిన అవసరంలేదని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. ‘మేం ఇచ్చుడు బంద్‌ చేస్తే.. ప్రైవేటు డెయిరీలు ఎవ్వరూ ఒక్క రూపాయి కూడా ఇవ్వరనే విషయాన్ని రైతులు గుర్తుపెట్టుకోవాలి’ అని వ్యాఖ్యానించారు. బిల్లు కోసం కాస్త ఓపిక పట్టాలని సూచించారు. శాసనసభలో మంగళవారం ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు సుంకె రవిశంకర్‌, జైపాల్‌ యాదవ్‌, ఎ.జీవన్‌రెడ్డి, చిరుమర్తి లింగయ్య, కృష్ణమోహన్‌రెడ్డి అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు.


కరోనా సంక్షోభంతో ఆర్థికంగా సమస్యలు ఎదురయ్యాయని, అయినా.. సీఎం కేసీఆర్‌ ఒకసారి హామీ ఇచ్చారంటే నెరవేర్చటం ఖాయమని అన్నారు. పాడి రైతులకు ఇప్పటివరకు రూ.248 కోట్ల ఇన్సెంటివ్‌ పంపిణీ చేశామని, ఇంకా రూ.109 కోట్ల బకాయిలు ఉన్నాయని వెల్లడించారు. గత పాలకులు విజయ డెయిరీని మూసేయాలని ప్రయత్నాలు చేశారని, తాము కష్టపడి లాభాల బాటలోకి తెచ్చామని తెలిపారు. 


అందుబాటులో ఉండేలా తరగతులు: సబిత

ఎక్కువ మంది విద్యార్థులకు పాఠాలు అందుబాటులో ఉంచేందుకు, అందరికీ చేరేలా టీ-శాట్‌, దూరదర్శన్‌ ద్వారా తరగతులు ప్రసారం చేస్తున్నామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయం తర్వాతే తరగతులను ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. మంగళవారం శాసన మండలిలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఎమ్మెల్సీలు కసిరెడ్డి నారాయణరెడ్డి, నర్సిరెడ్డిల ప్రశ్నకు సబిత సమాధానమిచ్చారు. వివిధ డిజిటల్‌ ప్లాట్‌ఫారంల ద్వారా ఈ-లెర్నింగ్‌ను చేపడుతున్నామని చెప్పారు.


వారికి ఆరోగ్య భద్రత లేదు: ఎర్రబెల్లి

స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లకు ఆరోగ్య భద్రత కల్పించే అవకాశం ప్రభుత్వం వద్ద లేదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు స్పష్టం చేశారు. కొత్త పంచాయతీరాజ్‌ చట్టం తీసుకొచ్చామని, వాళ్లకు అధికారాలు పెంచే ఆలోచనలో సీఎం కేసీఆర్‌ ఉన్నారని తెలిపారు. ఇప్పటికే వాళ్లకు జీతాలు భారీగా పెంచామని దయాకర్‌రావు గుర్తు చేశారు. శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్సీ పోచంపల్లి మాట్లాడుతూ.. కరోనా వైరస్‌ వ్యాపిస్తున్న నేపథ్యంలో జడ్పీటీసీలు, ఎంపీటీసీలను వాళ్ల ఇళ్ల వద్ద ప్రజలు కలవలేకపోతున్నారని తెలిపారు. ఎంపీటీసీలకు పంచాయతీ, జడ్పీటీసీలకు మండల పరిషత్‌ కార్యాలయాల్లో ప్రత్యేక కార్యాలయాల ఏర్పాటు అంశాన్ని పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. 


గ్రామ పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం నిధులు

పంచాయతీరాజ్‌ సంస్థలకు 15వ ఆర్థిక సంఘం రూ.1847 కోట్లు కేటాయించిందని, బడ్జెట్‌లో రాష్ట్ర ప్రభుత్వం కూడా అంతే మొత్తాన్ని కేటాయించిందని ఎర్రబెల్లి వెల్లడించారు. ప్రభుత్వం రూ.924 కోట్లు విడుదల చేసిందని ఎమ్మెల్సీ వీ.గంగాధర్‌గౌడ్‌ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. 


రైతు వడ్డీ బకాయిలు ఉన్నాయి: నిరంజన్‌రెడ్డి

రైతులకు ఇచ్చే వడ్డీ రాయితీ బకాయిలు ఉన్న మాట వాస్తవమే అని, అవి 2014-15 నాటివని మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. పీఏసీఎ్‌సలలో పట్టా పాస్‌ పుస్తకం పెట్టుకోకుండానే రైతులకు రుణాలివ్వాలని ఆదేశాలు జారీ చేస్తామన్నారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు నిరంజన్‌ బదులిచ్చారు. వడ్డీ రాయితీని ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉన్నామన్నారు. 


11 జిల్లాల్లో ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్లు లేవు

రాష్ట్రంలో 11 కొత్త జిల్లాల్లో ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్లు లేవని హోం మంత్రి మహమూద్‌ అలీ వెల్లడించారు. రాష్ట్రంలోని 9 పోలీస్‌ కమిషనరేట్లలోనూ ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్లు ఉన్నాయని తెలిపారు. ఎమ్మెల్సీ శేరి సుభా్‌షరెడ్డి అడిగిన ప్రశ్నకు మహమూద్‌ అలీ సమాధానమిచ్చారు. లా అండ్‌ ఆర్డర్‌ పోలీస్‌ స్టేషన్లలోని సిబ్బందిని ట్రాఫిక్‌ విధులు నిర్వహించేందుకు నియమిస్తున్నామని తెలిపారు.


ఎనిమిది బిల్లులకు మండలి ఆమోదం

ఎనిమిది బిల్లులకు తెలంగాణ శాసన మండలి మంగళవారం ఆమోదించింది. తెలంగాణ జీఎస్టీ చట్టం-2017 సవరణ బిల్లు, తెలంగాణ స్టేట్‌ ప్రైవేటు యూనివర్సిటీల చట్ట సవరణ ఆర్డినెన్స్‌-2020, తెలంగాణ డిజాస్టర్‌ అండ్‌ పబ్లిక్‌ హెల్త్‌ ఎమర్జెన్సీ ఆర్డినెన్స్‌-2020, తెలంగాణ ఫిస్కల్‌ రెస్పాన్సిబిలిటీ అండ్‌ బడ్జెట్‌ మేనేజ్‌మెంట్‌ బిల్‌-2002, ఆయుష్‌ మెడికల్‌ కాలేజీల్లో అధ్యాపకుల పదవీ విరమణ వయో పరిమితిని పెంచుతూ ఆర్డినెన్స్‌, టీఎస్‌ బీ-పాస్‌ బిల్లు, తెలంగాణ కోర్టు ఫీజ్‌ అండ్‌ సూట్స్‌ వాల్యుయేషన్‌ చట్టం-1956 సవరణ బిల్లు, సివిల్‌ కోర్టుల చట్టం-1972 సవరణ బిల్లులకు మండలి ఆమోదం తెలిపింది. ప్రైవేటు యూనివర్సిటీల బిల్లుకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, టీచర్స్‌ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి ఓటు వేశారు.

Advertisement
Advertisement
Advertisement