జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి

ABN , First Publish Date - 2022-01-27T06:57:28+05:30 IST

జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్నామని అన్ని వర్గాల అభిద్ధే లక్ష్యంగా సంక్షేమ పథకాలను అమలు పరుస్తున్నామని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి అన్నారు.

జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి

అట్టడుగు వర్గాలకు రాజ్యాంగ ఫలాలు 

గణతంత్ర వేడుకల్లో కలెక్టర్‌ నారాయణరెడ్డి 

కొవిడ్‌ నేపథ్యంలో సాదాసీదాగా ఉత్సవాలు

నిజామాబాద్‌, జనవరి 26 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్నామని అన్ని వర్గాల అభిద్ధే లక్ష్యంగా సంక్షేమ పథకాలను అమలు పరుస్తున్నామని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి అన్నారు. బుధవారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్‌లో ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అంతకు ముందు పోలీసుల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. భారత రాజ్యాంగం ఏ స్ఫూర్తితో అమలు చేశారో.. అదే స్ఫూర్తితో ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తుందన్నారు. ప్రతీ కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందించే దిశగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా అభివృద్ధి పథకాలు అమలు చేస్తున్నామన్నారు. రాజ్యాంగ ఫలాలు అట్టడుగుస్థాయి వారికి అందేవిధంగా కృషి చేస్తున్నామన్నారు. కరోనా తీవ్రత, ఒమైక్రాన్‌ వైరస్‌ వ్యాప్తి దృష్ట్యా ఉత్సవాలను ఆర్భాటాలకు తావులేకుండా కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ చైర్మన్‌ దాదన్నగారి విఠల్‌రావు, ఎమ్మెల్సీ గంగాధర్‌గౌడ్‌, మేయర్‌ దండు నీతూకిరణ్‌, పోలీసు కమిషనర్‌ కేఆర్‌.నాగరాజు, అదనపు కలెక్టర్‌లు చంద్రశేఖర్‌, చిత్రమిశ్రా, ట్రైనీ కలెక్టర్‌ మకరంద్‌, అదనపు డీసీపీ లా అండ్‌ ఆర్డర్‌ డాక్టర్‌ వినీత్‌, డీసీపీ అర్వింద్‌బాబుతో పాటు పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కరోనా తీవ్రత ఉండడంతో పరేడ్‌గ్రౌండ్‌లో ఉత్సవాలను నిలిపివేసి కలెక్టరేట్‌లో సాదాసీదాగా నిర్వహించారు. కొద్దిమంది ఆహ్వానితుల మధ్య కార్యక్రమాన్ని పూర్తిచేశారు. 

పోలీసు కమిషనరేట్‌లో..

ఖిల్లా: పోలీసు కమిషనరేట్‌లో సీపీ కేఆర్‌.నాగరాజు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో.. గత అక్టోబరు 21 అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన వివిధ పోటీల్లో గెలుపొందిన సిబ్బందికి, సిబ్బంది కుటుంబ సభ్యులకు, పిల్లలకు బహుమతులను ప్రదానం చేశారు. ఇందులో అదనపు డీసీపీలు ఉషా విశ్వనాథ్‌, బి.గిరిరాజ్‌, నిజామాబాద్‌ ఏసీపీ, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2022-01-27T06:57:28+05:30 IST