సంక్షేమంతోపాటు పారిశ్రామికాభివృద్ధికీ కృషి

ABN , First Publish Date - 2022-05-19T09:06:46+05:30 IST

సంక్షేమ కార్యక్రమాల అమలుతోపాటు పారిశ్రామికంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని పరిశ్రమలు, ఐటీ శాఖా మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ అన్నారు. నగరంలోని సర్క్యూట్‌ హౌస్‌లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.

సంక్షేమంతోపాటు పారిశ్రామికాభివృద్ధికీ కృషి

24 నుంచి దావోస్‌లో వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం సదస్సు

ఏపీలో పెట్టుబడులకు అనుకూలతలపై ప్రత్యేక పెవిలియన్‌

విశాఖలో ఐటీ అభివృద్ధికి ‘బీచ్‌ ఐటీ’ నినాదాన్ని వినిపిస్తాం

రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌


విశాఖపట్నం, మే 18 (ఆంధ్రజ్యోతి): సంక్షేమ కార్యక్రమాల అమలుతోపాటు పారిశ్రామికంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని పరిశ్రమలు, ఐటీ శాఖా మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ అన్నారు. నగరంలోని సర్క్యూట్‌ హౌస్‌లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. దావోస్‌లో ఈ నెల 24 నుంచి 26 వరకూ జరగనున్న వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం సదస్సుకు ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డితోపాటు తాను కూడా హాజరవుతున్నట్టు తెలిపారు. ఈ సదస్సులో రాష్ట్రంలో పెట్టుబడులకు గల అనుకూలతలు, అందుబాటులో ఉన్న వనరులు, ఇతర స్థితిగతులపై చర్చ మాత్రమే జరుగుతుందన్నారు. చర్చల సందర్భంగా ఆసక్తి చూపే వారిని గుర్తించి రాష్ట్రానికి ఆహ్వానించి, పెట్టుబడులు పెట్టేలా వారిని ఒప్పించాల్సి ఉంటుందన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూలతలు, అందుబాటులో ఉన్న వనరులను వివరించేందుకు ఈ సదస్సులో ప్రత్యేకంగా ఒక పెవిలియన్‌ ఏర్పాటు చేస్తున్నామన్నారు. సదస్సులో 18 అంశాలపై చర్చ జరిగితే వాటిలో పది అంశాల్లో ఏపీ పాల్గొంటుందని మంత్రి తెలిపారు.


విశాఖ-చెన్నై ఇండస్ట్రియల్‌ కారిడార్‌ అభివృద్ధిలో భాగంగా నక్కపల్లి మండలం రాంబిల్లిలో 6,500 ఎకరాల భూమిని సేకరించనున్నట్టు మంత్రి అమర్‌నాథ్‌ తెలిపారు. విశాఖలో ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు నగరానికి ప్రధాన ఆకర్షణగా ఉన్న బీచ్‌ను హైలైట్‌ చేసేలా ‘బీచ్‌ ఐటీ’ నినాదాన్ని సదస్సులో ప్రధానంగా వినిపించబోతున్నట్టు మంత్రి అమర్‌నాథ్‌ వెల్లడించారు. ఐటీని ప్రోత్సహించేందుకు అన్ని ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ఫెస్ట్‌లు నిర్వహించి, ఉత్సాహవంతులు, వినూత్న ఆలోచనలు కలిగినవారు స్టార్టప్‌లు ప్రారంభించేలా ప్రోత్సాహం ఇస్తామన్నారు. చంద్రబాబు హయాంలో దావోస్‌ పర్యటనను పెట్టుబడుల ఆకర్షణకు కాకుండా నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకునేందుకే వినియోగించుకునేవారని మంత్రి విమర్శించారు. ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమం అద్భుతంగా జరుగుతోందని, ప్రజల్లో 90 శాతం మంది ప్రభుత్వ పథకాలు పొందినందుకు సంతోషంగా ఉన్నారని చెప్పారు.

Updated Date - 2022-05-19T09:06:46+05:30 IST