అభివృద్ధికి కృషి

ABN , First Publish Date - 2022-01-27T06:11:43+05:30 IST

ప్రభు త్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను నిర్వహిస్తూ జిల్లాను అన్ని రంగాల్లోనూ అగ్రగామిగా నిలిపేందుకు ప్రభుత్వ యంత్రాంగం కృషి చేస్తుందని కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌ అన్నారు. జిల్లా అభివృద్ధి కోసం జిల్లా యంత్రాంగం అంకిత భావంతో పని చేసి రాష్ట్రంలోనే జిల్లాకు మంచి గుర్తిం పు తేవాలని కలెక్టర్‌ కోరారు. బుధవారం 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ప్రభుత్వ ఆదేశాల మేరకు

అభివృద్ధికి కృషి
జాతీయ జెండాకు వందనం చేస్తున్న కలెక్టర్‌, ఎస్పీ, అధికారులు

జిల్లాను  అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలుపుదాం
అభివృద్ధి కోసం అధికారులు అంకిత భావంతో పని చేయాలి
కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌
నిరాడంబరంగా 73వ గణతంత్ర నోత్సవ వేడుకలు
కలెక్టరేట్‌లో జాతీయ పతాకావిష్కరణ
పాల్గొన్న అధికారులు, సిబ్బంది

ఆదిలాబాద్‌ టౌన్‌, జనవరి 26: ప్రభు త్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను నిర్వహిస్తూ జిల్లాను అన్ని రంగాల్లోనూ అగ్రగామిగా నిలిపేందుకు ప్రభుత్వ యంత్రాంగం కృషి చేస్తుందని కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌ అన్నారు. జిల్లా అభివృద్ధి కోసం జిల్లా యంత్రాంగం అంకిత భావంతో పని చేసి రాష్ట్రంలోనే జిల్లాకు మంచి గుర్తిం పు తేవాలని కలెక్టర్‌ కోరారు. బుధవారం 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ప్రభుత్వ ఆదేశాల మేరకు కరోనా నిబంధనలకు లోబడి నిరాడంబరంగా నిర్వహించారు. ముందుగా గణతంత్ర వేడుకలను పురస్కరించుకుని జెండా ఆవిష్కరణ కోసం కలెక్టర్‌కు ప్రత్యేక పోలీసులు సాదర స్వాగతం పలికారు. అనంతరం కలెక్టరేట్‌ ఆవరణలో ఏర్పాటు చేసిన జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొని త్రివర్ణ పతాకాన్ని ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి, అదనపు కలెక్టర్‌(పరిపాలన) నటరాజన్‌, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ రిజ్వాన్‌భాషా షేక్‌, ఓఎస్డీ ఆపరేషన్‌ ఎం.రాజేశ్‌చంద్ర, ఇతర జిల్లా అధికారులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ సమావేశ మందిరంలో ఆమె మాట్లాడుతూ గత రెండేళ్లుగా కరోనా వైరస్‌ ప్రజాజీవనాన్ని అతలాకుతలం చేసిందన్నారు. ఈ క్రమంలో సెకండవ్‌ వేవ్‌లో జిల్లాలో వైరస్‌ భారీన పడి ప్రజలు మరణించడం బాధాకరమన్నారు. ఇలాంటి సందర్భంలో గత యేడాది జనవరి 16 నుంచి కొవిడ్‌ వ్యాక్సిన్‌ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. జిల్లాలో 5లక్షల 48వేల 94 వ్యాక్సిన్‌ పంపిణీ నిర్దేశించగా వందశాతం మొదటి డోసు, 85 శాతం రెండో డోసు పూర్తి చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఇంకా 15 నుంచి 18 ఏళ్ల వయస్సు గల పిల్లలకు 62శాతం, 60ఏళ్లు పైబడిన వారు, ఫ్రంట్‌లైన్‌ వర్కర్స్‌ 70 శాతం టీకాలు అందించామన్నారు. ఇదిలా ఉంటే ప్రబుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో ఇంటింటి ఆరోగ్యం సర్వేను శుక్రవారం నుంచి ప్రారంభించామని, గ్రామీణ ప్రాంతంలో 891 టీమ్‌లు, పట్టణ ప్రాంతంలో 114 టీమ్‌లలో 1306 మంది ఆశా, ఏఎన్‌ఎం, రిసోర్సు పర్సన్‌లతో నిర్వహిస్తున్నామన్నారు. ప్రజల ఆరోగ్యం దృష్టా రాజీవ్‌గాంధీ ఇనిస్టూట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్స్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిలో 200 అత్యాధునిక పడకలతో సిటీ స్కాన్‌, మమోగ్రఫి, లేసర్స్‌, ఆపరేటింగ్‌ మైక్రోస్కోప్‌, క్యాథ్‌లాగ్‌, ఇకో మిషన్‌ వంటి ఎనిమిది ప్రత్యేక విభాగాల్లో 54 మంది వైద్య నిపుణులను మంజూరు చేయడం జరిగిందన్నారు.
వ్యవసాయానికి భరోసా
జిల్లాలో ప్రభుత్వం వ్యవసాయ రంగానికి ఇస్తున్న ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని జిల్లా యంత్రాంగం రైతాంగానికి బాసటగా నిలుస్తోందని పేర్కొన్నారు. రైతుబంధు పథకం కింద యాసంగి కాలంలో జిల్లాలోని లక్షా 34వేల 566 మంది రైతులకు రూ.219.68 కోట్లు రైతుల ఖాతాలో జమ చేశామన్నారు. వారి ప్రయోజనాల కోసం పంట దిగుబడి, తదితర అంశాలను చర్చించుకునేందుకు జిల్లాలో రూ.22.22 కోట్లతో 101 క్లస్టర్లలో రైతు వేదికలు నిర్మించామన్నారు. అంతేకాకుండా  వివిధ కారణాల వల్ల మరణించి 263 మంది రైతులలో 199 మందికి ఒక్కొక్కరికి రూ.5లక్షల చొప్పున రైతుబీమా పథకం ద్వారా రూ.9.95 కోట్లు జమ చేశామన్నారు. అలాగే, ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి కింద జిల్లాలో 81వేల 393 మంది రైతులను గుర్తించి ఇప్పటి వరకు 50వేల 120 మంది రైతులకు రూ.10కోట్లు వారి ఖాతాల్లో జమ చేశామన్నారు. జిల్లా ఉద్యానవన శాఖలో 594 మంది రైతులకు రూ.213.18 లక్షలతో సమగ్ర ఉద్యానవనఅభివృద్ధి మిషన్‌ సూక్ష్మ సేద్యం కింద ప్రతిపాదించడం జరిగిందని వివరించారు.
సంక్షేమాలకు పెద్దపీట
జిల్లాలో ప్రభుత్వం ప్రజల ఆర్థికాభివృద్ధి కోసం సంక్షేమ ఫలాలకు పెద్దపీట వేస్తోందన్నారు. అంతేకాకుండా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, పల్లె ప్రగతి వంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజా సమస్యలను దూరం చేస్తోందని పేర్కొన్నారు. రోడ్లు, కల్వర్టులు నిర్మిస్తునే ఉపాధి హామీ పథకానికి ప్రాధాన్యతనిస్తూ కూలీ కల్పిస్తోందని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 65.28 లక్షల పని దినాలు కల్పించాలని లక్ష్యం కాగా ఇప్పటి వరకు 50.27లక్షల పని దినాలు 92వేల 54 కుటుంబాలు, లక్షా 73వేల418 మంది కూలీలకు రూ.100.76 కోట్ల కూలీ చెల్లించామని పేర్కొన్నారు.
కొవిడ్‌ కట్టడికి కృషి
గత రెండేళ్లుగా ప్రజలను పట్టి పీడిస్తున్న కొవిడ్‌ను జిల్లాలో అరికట్టేందుకు అన్ని శాఖల అధికార యంత్రాంగం కృషి చేస్తోందని కలెక్టర్‌ పేర్కొన్నారు. ముఖ్యంగా  జిల్లా పోలీసు యంత్రాంగం ప్రజలకు రక్షణ కల్పిస్తూనే.. మరోపక్క కొవిడ్‌ నిబంధనలు పాటించాలని జాగ్రత్తలు సూచించడం అభినందనీయమన్నారు. ఇందులో జిల్లా అధికారులు సుదర్శన్‌, ఆర్డీవో జాడి రాజేశ్వర్‌, డీఆర్డీఏ పీడీ కిషన్‌, కలెక్టరేట్‌ పరిపాలన అధికారి అరవింద్‌, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-27T06:11:43+05:30 IST