ఆ మీటర్లతో ఉచిత విద్యుత్తుకు మంగళమే!

ABN , First Publish Date - 2022-05-17T06:17:12+05:30 IST

శ్రీకాకుళం జిల్లాలో చేపట్టిన వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించే పైలెట్‌ ప్రాజెక్టు విజయవంతం కావడంతో, దీనిని రాష్ట్రమంతా అమలు చేయాలని జగన్‌రెడ్డి ఆదేశించారు....

ఆ మీటర్లతో ఉచిత విద్యుత్తుకు మంగళమే!

శ్రీకాకుళం జిల్లాలో చేపట్టిన వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించే పైలెట్‌ ప్రాజెక్టు విజయవంతం కావడంతో, దీనిని రాష్ట్రమంతా అమలు చేయాలని జగన్‌రెడ్డి ఆదేశించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు అమర్చి ఉచిత విద్యుత్తుకు మంగళం పాడి, రైతుల మెడకు ఉరి బిగించబోతున్నారని అర్థమవుతోంది. అదనపు అప్పుల కోసం కేంద్రం ఆడమన్నట్లు ఆడుతూ రైతు ప్రయోజనాలు పణంగా పెడుతున్నారు.


వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు రైతుల హక్కుగా సాధించుకున్నది. వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగింపు చర్య వ్యవసాయ రంగాన్ని మరింత సంక్షోభంలోకి నెట్టడమే. 18 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించి వారి మెడకు ఉరితాడు బిగించబోతున్నారు. అదనపు రుణాల కోసం కేంద్రం ఆడమన్నట్లు ఆడుతూ రైతులపై మరో భారం మోపుతున్నారు. 20 ఏళ్లుగా సాఫీగా సాగుతున్న ఉచిత విద్యుత్తు పథకానికి కొర్రీలు వేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇప్పటివరకు వ్యవసాయం కోసం ఇస్తున్న ఉచిత విద్యుత్తుకు ఎలాంటి బిల్లులు వసూలు చెయ్యడం లేదు. ఇకపై మాత్రం రైతులు వ్యవసాయ విద్యుత్తు బిల్లులు చెల్లించాల్సిన పరిస్థితి రాబోతుంది. ఆ బిల్లుల మొత్తాన్ని రైతుల బ్యాంక్ ఖాతాలో జమ చేస్తామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, మున్ముందు ఈ పథకానికి ప్రభుత్వం నుంచి ముప్పు ఉండదని చెప్పే పరిస్థితి లేదు. భవిష్యత్‌లో ప్రభుత్వ విధానాలు, ప్రభుత్వాలు మారితే, డిస్కంల ప్రయివేటీకరణ జరిగితే డబ్బు చెల్లించలేదని వ్యవసాయానికి విద్యుత్తు సరఫరా నిలిపివేస్తారు. అయినా వ్యవసాయ విద్యుత్తుకు అయ్యే ఖర్చు అంతా ప్రభుత్వమే భరిస్తుందని చెబుతున్నప్పుడు విద్యుత్తు మీటర్ల బిగింపు ఎందుకు చేపట్టినట్లు?


మీటర్లు బిగింపుతో పాటు బిల్లుల చెల్లింపును మొదట రైతులే భరించాలని, ఆ తర్వాత వ్యవసాయ విద్యుత్తు బిల్లుల మొత్తాన్ని నగదు బదిలీ పథకం కింద రైతుల బ్యాంకు ఖాతాలో జమ చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. ప్రస్తుతం బిల్లులు చెల్లించాల్సిన అవసరం లేకపోయినా భవిష్యత్‌లో నగదు బదిలీ పథకం ఆగిపోయే అవకాశం ఉంది. విద్యుత్తు పంపిణీ సంస్థలకే సబ్సిడీ డబ్బులు సకాలంలో చెల్లించలేని ప్రభుత్వం భవిష్యత్‌లో నగదు బదిలీ రూపంలో రైతుల ఖాతాల్లో వేస్తుందనే గ్యారంటీ ఏమిటి? ఒకసారి మీటరు బిగించి యూనిట్ల ప్రకారం బిల్లులు చెల్లించడం మొదలుపెడితే అది రైతుల మెడకు గుదిబండ కానుంది. ఇదంతా ఉచిత విద్యుత్తు నుంచి ప్రభుత్వం దశల వారీగా తప్పుకొనేందుకే అని రైతులు గుర్తించాలి. దీనిని రైతులు వ్యతిరేకించని, ప్రభుత్వాన్ని ప్రశ్నించని పక్షంలో రానున్న రోజుల్లో రైతులు మూల్యం చెల్లించాల్సి వస్తుంది. ఒక పక్క తండ్రి వైఎస్ ఆశయాలు నెరవేరుస్తానని గొప్పలు చెప్పుకొంటూ మరో పక్క తండ్రి ప్రారంభించిన ఉచిత విద్యుత్తు పథకానికి మంగళం పాడేందుకు జగన్ సిద్ధపడటం వంచన కాక మరేమిటి? కేంద్ర ప్రభుత్వ షరతులకు తలొగ్గకుండా తెలంగాణ, తమిళనాడు ప్రభుత్వాలు వ్యవసాయ పంపుసెట్లకు మీటర్ల బిగింపును వ్యతిరేకించి రైతుల పక్షాన నిలబడ్డాయి. నగదు బదిలీ ముసుగులో స్వప్రయోజనమే ధ్యేయంగా రైతు ప్రయోజనాలు పణంగా పెట్టటం సమర్థనీయం కాదు. దివంగత ఎన్టీఆర్ సీఎంగా ఉండగా, రూ.50కే ఒక హార్స్ పవర్ విద్యుత్తు పథకాన్ని అమలు చేశారు. తెలుగుదేశం, కాంగ్రెస్ ప్రభుత్వాలు కూడా ఉచిత విద్యుత్తు పథకాన్ని కొనసాగించాయి. జగన్ ఈ పథకానికి తూట్లు పొడవడానికి సిద్ధపడ్డారు. మోటార్లకు మీటర్లు బిగించాలనే కేంద్ర ప్రభుత్వ నిబంధనలు అమలు దేశంలో మొట్టమొదట జగన్ ప్రభుత్వమే తలకెత్తుకొన్నది. ప్రతి నెలా జీతాలు ఇచ్చే పరిస్థితి లేని ప్రభుత్వం, సకాలంలో రైతుల విద్యుత్తు బిల్లులు చెల్లిస్తుందన్న నమ్మకం ఏముంది? విద్యుత్తు బిల్లులు చెల్లించకపోతే పంపుసెట్లకు విద్యుత్తు సరఫరా ఆగిపోయే ప్రమాదముంది. ఉచిత విద్యుత్తు పథకానికి పంగనామాలు పెట్టేవిధంగా నగదు బదిలీ కార్యక్రమాన్ని చేపడుతున్నారు? నిత్యం తమది రైతు ప్రభుత్వంగా ప్రచారం చేసుకొంటున్న జగన్ ప్రభుత్వం... వ్యవసాయ పంపుసెట్లకు మీటర్ల బిగింపును ఎలా సమర్థించుకుంటారు?

నీరుకొండ ప్రసాద్

Updated Date - 2022-05-17T06:17:12+05:30 IST