కుయ్యో.. రొయ్యో

ABN , First Publish Date - 2020-08-03T09:49:57+05:30 IST

రొయ్యల సాగుపై వైరస్‌ల ప్రభావం పడుతోంది. దీంతో ఆక్వా రంగం కుదేలవుతోంది.

కుయ్యో.. రొయ్యో

దాడి చేస్తున్న వైరస్‌లు

తగ్గిన దిగుబడి.. పెరిగిన సీడ్‌ రేట్లు

పతనమవుతున్న ధరలు

హేచరీల్లో కానరాని వెనామీ పిల్లల ఉత్పతి

సాగుకు దూరమవుతున్న రైతులు


(ఇచ్ఛాపురం రూరల్‌): రొయ్యల సాగుపై వైరస్‌ల ప్రభావం పడుతోంది. దీంతో ఆక్వా రంగం కుదేలవుతోంది. గత మూడేళ్ల నుంచి వరుసగా వైరస్‌ దాడి చేయడంతో ఆక్వా రైతులు నష్టాల భారిన పడుతున్నారు. వైట్‌ గట్‌(రొయ్య పేగు తెల్లగా మారడం), వైట్‌ పీసెస్‌ (తెల్లరెట్ట వ్యాధి) వంటి వైరస్‌ల విజృంభణతో జిల్లాలోని వెనామీ రైతులు కోలుకోలేని దెబ్బ తింటున్నారు. వైరస్‌ల ధాటికి పంట దిగుబడి తగ్గడంతో పాటు ధరలు పతనమవడంతో లబోదిబోమంటున్నారు. ఆ నష్టాల నుంచి గట్టెక్కెందుకు ఈ ఏడాది సాగుకు సిద్ధమవుతున్నా రొయ్య పిల్లలు దొరకని పరిస్థితి నెలకొంది. మరోపక్క  హేచరీల్లో రొయ్య పిల్లల ఉత్పత్తి తగ్గిపోవడంతో సీడ్‌ ధరలు పెరిగాయి. దీంతో చాలా మంది రైతులు సాగుకు దూరమవుతున్నారు.


జిల్లాలో ఇచ్ఛాపురం, కవిటి, సోంపేట, వజ్రపుకొత్తూరు, సంతబొమ్మాళి, పోలాకి, గార, ఎచ్చెర్ల, శ్రీకాకుళం మండలాల్లో సుమారు 958 హెక్టార్లలో రొయ్యల చెరువులు ఉన్నాయి. సుమారు 780 మంది రైతులు రొయ్యలను సాగు చేస్తున్నారు. అందులో 95 శాతం వెనామీ ఉంటుంది. మూడేళ్ల కిందటి వరకూ ఆక్వా సాగుకు వాతావరణం పూర్తిగా అనుకూలించడంతో రైతులు లాభాలు పొందారు. ఆ తరువాత పరిస్థితి మారిపోయింది. రొయ్యలకు వైరస్‌ సోకి నష్టాలు మూటగట్టుకుంటున్నారు. దీంతో సాగుకు విరామం  ఇవ్వడంతో ఏడాది నుంచి చెరువులు ఖాళీగా ఉంటున్నాయి. మళ్లీ ఇప్పుడిప్పుడే చెరువుల్లో రొయ్య పిల్లలను వదిలేందుకు సిద్ధమవుతున్నారు. అయితే, సీడ్‌ ధరలను రెట్టింపు చేయడంతో వారికి దిక్కుతోచని పరిస్థితి ఎదురైంది. రెండు నెలల కిందట 20 పైసలు ఉన్న సీడ్‌ ధర ప్రస్తుతం 45 పైసలకు చేరింది. దీనివల్ల ఎకరాకి రైతులపై రూ.37 వేలు అదనపు భారం పడుతోంది. ఒకపక్క కరోనా వల్ల ఎగుమతులు నిలిచిపోవడం, మరోపక్క రొయ్యల్లో నిషేధిత అవశేషాలు, యాంటీ బయాటిక్స్‌ ఉన్నాయని కంటైనర్లు యూరప్‌ దేశాల నుంచి వెనక్కి రావడంతో రైతులు నష్టపోయారు. 


ధరలు పతనం

రొయ్య ధరలు పతనమవుతున్నాయి. నెల వ్యవధిలో టన్నుకు రూ.40 వేలు తగ్గింది. నెల రోజుల  కిందట 100 కౌంట్‌ రొయ్య ధర రూ.250 పలకగా ప్రస్తుతం రూ.210కి పడిపోయింది. టన్నుకు రూ.40 వేలు తగ్గడంతో పంట చేతికొచ్చిన రైతులు లబోదిబోమంటున్నారు. జిల్లాలో హేచరీలు లేవు. రొయ్య పిల్లలను విజయనగరం, విశాఖపట్నం వంటి ప్రాంతాల నుంచి కొనుగోలు చేస్తున్నారు. హేచరీల్లో సీడ్‌ ఉత్పత్తి చేయాలంటే సముద్రపు నీటితోపాటు ఎర్రలు కీలకం. రొయ్య పిల్లల ఉత్పత్తికి సముద్రపు నీటిలో లవణ శాతం 30 శాతానికిపైగా ఉండాలి. ప్రస్తుతం 25 శాతానికి పడిపోయింది. దీంతో పిల్లల ఉత్పత్తికి ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. వర్షాకాలం వల్ల సముద్రం నీటిలో ఉప్పు శాతం తగ్గడంతో ఆ ప్రభావం హేచరీల మీద పడింది.  


సాగుకు సహకరిస్తాం ..పీవీ శ్రీనివాసరావు, జేడీ, మత్స్యశాఖ

ఆక్వా రైతులకు ప్రభుత్వం తరఫున సహకారం అందిస్తాం. రొయ్య పిల్లను రూ.35కి మించి విక్రయిస్తే చర్యలు తీసుకుంటాం.  అధిక ధరలకు విక్రయిస్తున్న హేచరీలపై ఆక్వా రైతులు ఫిర్యాదు చేస్తే చట్టప్రకారం ఆ సంస్థలపై చర్యలు తీసుకుంటాం. ఇటీవల వర్షాకాలం కావడంతో ఆక్వా సాగు ఆశాజనకంగా ఉంది. రైతులు తమ వివరాలను ఈ-పంట కింద నమోదు చేయించుకోవాలి.

Updated Date - 2020-08-03T09:49:57+05:30 IST