ఒమైక్రాన్‌ ప్రభావం.. ఢిల్లీలో ఎల్లో అలర్ట్‌

ABN , First Publish Date - 2021-12-29T08:34:08+05:30 IST

ఒమైక్రాన్‌ కరోనా వేరియంట్‌ ప్రభావంతో కొవిడ్‌ కేసులు పెరుగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో పాజిటివిటీ రేటు పెరగడంతో ఎల్లోఅలర్ట్‌ను ప్రకటించారు.

ఒమైక్రాన్‌ ప్రభావం.. ఢిల్లీలో ఎల్లో అలర్ట్‌

  • ప్రకటించిన ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌
  • విద్యాసంస్థలు, సినిమా హాళ్లు, మల్టీప్లెక్స్‌లు బంద్‌
  • 50ు ఉద్యోగులతో ప్రైవేటు కార్యాలయాల నిర్వహణ
  • రాత్రి 10 నుంచి ఉదయం 5 వరకు కర్ఫ్యూ అమలు
  • ‘మహా’ మెడికల్‌ కాలేజీలో 51 మందికి కరోనా
  • ఒమైక్రాన్‌ ప్రభావంతో ఎల్లో అలర్ట్‌.. పెళ్లికైనా, చావుకైనా 20 మందే
  • రాత్రి కర్ఫ్యూ.. దుకాణాలకు సరి-బేసి 


న్యూఢిల్లీ, డిసెంబరు 28: ఒమైక్రాన్‌ కరోనా వేరియంట్‌ ప్రభావంతో కొవిడ్‌ కేసులు పెరుగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో పాజిటివిటీ రేటు పెరగడంతో ఎల్లోఅలర్ట్‌ను ప్రకటించారు. ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ మంగళవారం విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. ఎల్లోఅలర్ట్‌ ఆంక్షలన్నీ తక్షణమే అమల్లోకి వస్తాయన్నారు. ‘‘కొన్ని రోజులుగా ఢిల్లీలో పాజిటివిటీ రేటు 0.5ు కంటే ఎక్కువగా ఉంటోంది. 165 ఒమైక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. ఒమైక్రాన్‌ పాజిటివిటీ రేటు 2-3ు నుంచి 25-30శాతానికి పెరిగింది. దీంతో గ్రేడెడ్‌ రెస్పాన్స్‌ యాక్షన్‌ ప్లాన్‌ లెవల్‌-1(ఎల్లో అలర్ట్‌)ను ప్రకటించాం. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’’ అని ఆయన వివరించారు. కాగా.. ఢిల్లీలో మంగళవారం ఉదయానికి గడిచిన 24 గంటల్లో 331 కొత్త కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. మొత్తంగా ఒమైక్రాన్‌ కేసుల్లో మహారాష్ట్ర టాప్‌లో ఉంది. దేశవ్యాప్తంగా మంగళవారం ఉదయానికి మొత్తం 653 ఒమైక్రాన్‌ కేసులు నమోదవ్వగా.. వాటిల్లో మహారాష్ట్ర వాటా 167. ఢిల్లీలో 165, కేరళలో 57, తెలంగాణలో 55, గుజరాత్‌లో 49, రాజస్థాన్‌లో 46 కేసులున్నాయి. మంగళవారం ఉదయానికి గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 6,358 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. 293 మంది కొవిడ్‌తో మృతిచెందారు.


భారత్‌లో ఉత్థాన స్థాయికి కేసులు:కేంబ్రిడ్జ్‌

భారత్‌లో ఒమైక్రాన్‌ ప్రభావంతో కేసుల సంఖ్య మరికొన్ని రోజుల్లో ఉత్థాన స్థాయికి చేరే అవకాశాలున్నాయని కేంబ్రిడ్జ్‌ విశ్వవిద్యాలయానికి చెందిన జడ్జ్‌ బిజినెస్‌ స్కూల్‌ పరిశోధకులు తెలిపారు. అయితే.. ఈ తీవ్రత అతి తక్కువ కాలానికే పరిమితమవుతుందని వర్సిటీ ప్రొఫెసర్‌ కట్టుమాన్‌ వెల్లడించారు. పశ్చిమబెంగాల్‌లో టీఎంఎసీ నేత ఓబ్రియాన్‌కు కూడా కరోనా పాజిటివ్‌గా తేలింది. కాగా.. మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లా మిరాజ్‌లోని వైద్య విద్య కళాశాలలో 49 మంది ఎంబీబీఎస్‌ విద్యార్థినులు, ఇద్దరు సిబ్బందికి కొవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. కాగా, ఒమైక్రాన్‌ ప్రభావం ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తోంది. శుక్రవారం నుంచి మంగళవారం వరకు మొ త్తం 12 వేల విమానాలు రద్దవ్వగా.. అమెరికాకు చెందిన ఓ విమానాన్ని చైనా యంత్రాంగం షాంఘై విమానాశ్రయంలో తిప్పిపంపింది. కొవిడ్‌ కొత్త నిబంధనల మేరకు ఈ చర్య తీసుకున్నట్లు పేర్కొంది. ఐరోపా దేశాలు మళ్లీ ఆంక్షల దిశలో పయనిస్తున్నాయి. మంగళవారం నుంచి ఆంక్షలను విధిస్తూ జర్మనీ ఆదేశాలిచ్చింది.


సర్టిఫికెట్‌ లేకున్నా వృద్ధులకు బూస్టర్‌  

అరవై ఏళ్లు పైబడిన దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు కొవిడ్‌ టీకా బూస్టర్‌ డోసును తీసుకునేందుకు వైద్యుడి సర్టిఫికెట్‌ సమర్పించాల్సిన అవసరం లేదని కేంద్రం తెలిపింది. అయితే వ్యాక్సిన్‌ తీసుకునేముందు వారు తప్పకుండా తమ సమీప వైద్యుణ్ని తప్పనిసరిగా సం ప్రదించాలని సూచించింది. ఈమేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ లేఖ రాశారు. కాగా, కొవ్యాక్సిన్‌ రెండు డోసులు తీసుకున్న వారికి బూస్టర్‌ డోసుగా ముక్కు(ఇంట్రానేసల్‌) టీకాను అందుబాటులోకి తేవాలని భారత్‌ బయోటెక్‌ యోచిస్తోంది. 2022 సంవత్సరం చివరికల్లా 100 కోట్ల డోసులను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు  తెలుస్తోంది. బెంగళూరు, హైదరాబాద్‌, పుణెలలోని కంపెనీ ప్లాంట్లలో దీని ఉత్పత్తి జరగనుందని సమాచారం. 


ఎల్లో అలర్ట్‌ ఆంక్షలివే..

సినిమా హాళ్లు, మల్టిప్లెక్స్‌లు, జిమ్‌లు, ఇన్‌డోర్‌ యోగా కేంద్రాలు, స్టేడియాలు, స్విమ్మింగ్‌ పూల్స్‌, స్కూళ్లు, విద్యాసంస్థలు, కోచింగ్‌ సంస్థలను పూర్తిగా మూసివేయాలి. అవుట్‌డోర్‌ యోగా, సెలూన్లు, బ్యూటీపార్లర్లు, పార్కులకు అనుమతి 

రాజకీయ, మతపరమైన, సామాజిక పరమైన సామూహిక కార్యక్రమాలు, సభలపై నిషేధం

హోటళ్లు, బార్‌ అండ్‌ రెస్టారెంట్లలో 50ు సీటింగ్‌ సామర్థ్యంతో అనుమతి. బాంకెట్‌ హాళ్లు, కాన్ఫరెన్స్‌ హాళ్లకు అనుమతి లేదు

ఢిల్లీ మెట్రోరైల్‌లో 50ు ప్రయాణికులకే అనుమతి. నిల్చొని ప్రయాణించకూడదు. బస్సులను 50ు సామర్థ్యంతో నడుపుతారు

ఆటోరిక్షాలు, ట్యాక్సీలు, ఈ-రిక్షాల్లో ఇద్దరు ప్రయాణికులకే అనుమతి ఉంటుంది

ప్రైవేటు కార్యాలయాల్లో 50ు సిబ్బంది

ఉదయం 10 నుంచి రాత్రి 8 గంటల వరకు సరి-బేసి పద్ధతిలో మాల్స్‌, దుకాణాలు

రాత్రి 10 నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. 

పెళ్లిళ్లు, అంత్యక్రియలు వంటి చోట్ల 20 మందికి మాత్రమే అనుమతి.

Updated Date - 2021-12-29T08:34:08+05:30 IST