జగన్ సర్కార్ మొండి వైఖరి.. 2 లక్షల మంది పిల్లలకు కష్టం!

ABN , First Publish Date - 2022-07-09T16:14:17+05:30 IST

ప్రభుత్వ మొండి వైఖరి 2 లక్షల మందికి పైగా చిన్నారులకు కష్టం తెచ్చి పెట్టింది. ఇంటి దగ్గర్లో ఉండే బడికి ఆడుతూ పాడుతూ వెళ్లొచ్చే విద్యార్థులు.. ఇప్పుడు కిలోమీటరు దూరంలో ఉన్న బడికి వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది. అసలే వర్షాకాలం.. అందులోనూ

జగన్ సర్కార్ మొండి వైఖరి.. 2 లక్షల మంది పిల్లలకు కష్టం!

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులపై విలీనం ఎఫెక్ట్‌ 

5250 పాఠశాలల్లో 3, 4, 5 తరగతులు బంద్‌

పిల్లలను దూరం పంపలేమంటున్న తల్లిదండ్రులు

టీసీలు ఇవ్వాలని డిమాండ్‌.. 


(అమరావతి-ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ మొండి వైఖరి 2 లక్షల మందికి పైగా చిన్నారులకు కష్టం తెచ్చి పెట్టింది. ఇంటి దగ్గర్లో ఉండే బడికి ఆడుతూ పాడుతూ వెళ్లొచ్చే విద్యార్థులు.. ఇప్పుడు కిలోమీటరు దూరంలో ఉన్న బడికి వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది. అసలే వర్షాకాలం.. అందులోనూ అధ్వానపు రోడ్లు.. ఈ పరిస్థితుల్లో చిన్నపిల్లలను అంత దూరం ఎలా పంపాలని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా తల్లిదండ్రుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. మరోవైపు సర్కారు తీరు మారదని భావిస్తున్నవారు తమ పిల్లలకు టీసీలు ఇవ్వాలని ఉపాధ్యాయులను డిమాండ్‌ చేస్తున్నారు. ఓపిక పట్టాలని ఉపాధ్యాయులు సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నా తల్లిదండ్రులు వినడం లేదు. గందరగోళం మధ్య పిల్లలను ప్రభుత్వ బడులకు పంపలేమని, టీసీలు ఇస్తే దగ్గర్లో ఉన్న ప్రైవేటు స్కూళ్లలో చేర్పిస్తామని కోరుతున్నారు.


తల్లిదండ్రుల ఒత్తిడితో చాలా చోట్ల టీసీలు ఇచ్చేస్తున్నారు. ప్రతి ఏటా తక్కువ సంఖ్యలో 2, 3, 4 తరగతులకు టీసీలు ఇచ్చేవారు. కానీ ఈ ఏడాది భారీగా టీసీలు ఇవ్వాల్సి వస్తోందని, ఇది ఎక్కడి వరకూ వెళ్తుందోనని ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రాథమిక పాఠశాలల్లో 5వ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులు టీసీలు తీసుకుని ఎక్కువగా ప్రైవేటు బాట పడుతున్నారు. ప్రభుత్వ ప్రీ హైస్కూల్‌లో 98 మంది విద్యార్థులు లేకపోతే సబ్జెక్టు టీచర్లు ఉండరు. దీంతో సబ్జెక్టు టీచర్లతో చదువు చెప్పించుకోవాలనే ఉద్దేశంతో ప్రైవేటుకు మొగ్గు చూపుతున్నారు. 


విలీనంతో అగచాట్లు 

5250 ప్రాథమిక పాఠశాలలను ప్రీ హైస్కూళ్లు, ఉన్నత పాఠశాలలకు మ్యాపింగ్‌ చేశారు. ఆ పాఠశాలల్లోని 3, 4, 5 తరగతులను కిలోమీటరు దూరంలో ఉన్న పాఠశాలల్లో విలీనం చేస్తున్నారు. ఒక్కో తరగతికి తక్కువలో తక్కువగా 15 మంది విద్యార్థులున్నా, రాష్ట్రవ్యాప్తంగా 2 లక్షల మందికి పైగా పక్క గ్రామాలకు, ఇతర పాఠశాలలకు తరలిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలాగే ప్రాథమికోన్నత పాఠశాలల నుంచి 6, 7, 8 తరగతులను 3 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ఉన్నత పాఠశాలల్లో విలీనం చేస్తున్నారు. ఆ విద్యార్థులు కూడా దూరంగా ఉండే బడికి వెళ్లక తప్పదు. విలీన ప్రక్రియను తల్లిదండ్రులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో తమ పిల్లలను వేరే బడులకు పంపబోమని, ఇక్కడే కొనసాగించాలని డిమాండ్‌ చేస్తున్నారు. కావాలంటే అమ్మఒడి నగదు ఆపేసయి నా ఉన్నచోటే కొనసాగించాలంటున్నారు. 


ఈ ఏడాది తగ్గిన హాజరు 

బడులు తెరిచి నాలుగు రోజులైనా విద్యార్థుల హాజరు పెరగడం లేదు. మొత్తంగా చూస్తే ప్రభుత్వ అధీనంలోని పాఠశాలల్లో హాజరు 72 శాతం దాటడం లేదు. అంటే ప్రతి నలుగురు విద్యార్థుల్లో ఒకరు ఇంకా బడికి వెళ్లలేదు. ఇంతకుముందు బడి తెరిచిన రోజే తల్లిదండ్రులు పిల్లలను పంపేవారు. ఈ ఏడాది 4 రోజులైనా హాజరు పెరగలేదు. శుక్రవారం నాటికి ఎయిడెడ్‌లో 67%, ప్రభుత్వ పాఠశాలల్లో 64%, కేజీబీవీల్లో 33%, మోడల్‌ స్కూళ్లల్లో 69%, ఎంపీ-జడ్పీ పాఠశాలల్లో 74%, మున్సిపల్‌ స్కూళ్లలో 69% మాత్రమే హాజరు నమోదైంది. అదే సమయంలో ప్రైవేటు పాఠశాలల్లో 79% హాజరు ఉండటం గమనార్హం. ఈ ఏడాది 47 లక్షల మంది ప్రభుత్వ బడులకు వస్తారని అంచనా ఉండగా,  22 లక్షల మంది మాత్రమే వచ్చారు. 


అమ్మఒడితో ప్రైవేటు బాట! 

ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులను తప్పించుకోవడానికి ఈ ఏడాది అమ్మఒడిని జనవరి నుంచి జూలైకి మార్చింది. ప్రభుత్వం ఏ ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నా.. ఇప్పుడు అదే సర్కారు బడుల్లో ఎన్‌రోల్‌మెంట్‌ కొంప ముంచుతోంది. సరిగ్గా పాఠశాలల ప్రారంభ సమయంలో అమ్మఒడి నగదు వేయడం.. ఇప్పుడే విలీన ప్రక్రియ మొదలు కావడంతో.. ఆ నగదుతో ప్రైవేటు స్కూ ళ్లలో పిల్లలను చేర్పించాలని తల్లిదండ్రులు భావిస్తున్నారు. సర్కారు బడులు యథాతథంగా కొనసాగి ఉంటే చాలా వరకు అక్కడే చదువుకునేవారు. విలీన ప్రక్రియతో గందరగోళం నెలకొనడం తో టీసీలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. 

Updated Date - 2022-07-09T16:14:17+05:30 IST