ధరాభారం!

ABN , First Publish Date - 2020-06-03T11:04:02+05:30 IST

క్రీస్తు పూర్వం.. క్రీస్తు శకం అన్నట్టు భవిష్యత్తులో కరోనా ముందు.. తరువాత అనే పరిస్థితి

ధరాభారం!

కరోనా తర్వాత ప్రభావం

వ్యవసాయ పనులకు కూలీల కొరత

ఉన్న వారే దిక్కు.. రెట్టింపు కూలి

ఎకరాలో వరి నాట్లకు రూ.6వేలు

ఖరీఫ్‌ భారం రూ.150 కోట్లు

నిత్యావసర ధరలకూ రెక్కలు

ప్రజలపై నెలకు రూ.90 కోట్ల అదనపు భారం


నెల్లూరు, జూన్‌ 1 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) :క్రీస్తు పూర్వం.. క్రీస్తు శకం అన్నట్టు భవిష్యత్తులో కరోనా ముందు.. తరువాత అనే పరిస్థితి ఏర్పడుతోంది. ప్రతి రంగంపై కరోనా ప్రభావం స్పష్టంగా ఉండబోతోంది. రెండు నెలలు గడవక ముందే.. లాక్‌డౌన్‌ నిబంధనలు సడలీ సడలక ముందే ఆ విషయం అవగతం అవుతోంది. ఎవరి ప్రమేయం లేకుండానే అన్ని రకాల ధరలకు రెక్కలొచ్చాయి. కూలీల అవసరం ఎక్కువగా ఉండే వ్యవసాయ రంగం భారీ ఒడిదుడుకులకు లోనవుతోంది.


పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలతో ప్రతి కుటుంబ నెలసరి వ్యయం పెరిగిపోయింది.  కేవలం రెండు నెలల విరామం తరువాత పనిలోకి దిగే శ్రామికులు పెంచిన కూలి రేట్లు గమనించి రైతులకు దిగులు పట్టుకుంది. కూరగాయలు, సరుకుల ధరలు చూసి సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు. కరోనాకు ముందు, తరువాత పెరిగిన వ్యవసాయ కూలీల రేట్ల ఆధారంగా లెక్కకడితే వరి సాగుకు అయ్యే ఖర్చు రూ.150 కోట్లకు పెరుగుతోంది. నిత్యావసర వస్తువులపై నెలకు కనిష్ఠంగా రూ. 100 కోట్ల భారం ప్రజలపై పడుతోంది. 


ఖరీఫ్‌పై రూ. 150 కోట్ల అదనపు భారం: 

కరోనా కారణమో... మద్యం ధరల ప్రభావమో వ్యవసాయ కూలీల రేట్లు గణనీయంగా పెరిగిపోయాయి. గతంలో అంటే కరోనాకు ముందు జలదంకి మండలంలో మగవారి కూలి రోజుకు రూ.400 ఇప్పుడు 500కు పెంచేశారు. పత్తి తీసేందుకు మహిళలకు గతంలో రూ.150 ఉండగా ఇప్పుడు 200 అయ్యింది. చిల్లకూరు, ముత్తుకూరు, అల్లూరు, పొదలకూరు, సంగం, సైదాపురం, బుచ్చిరెడ్డిపాళెం, తడ, కోట, వెంకటగిరి, చేజర్ల ఇలా అన్ని మండలాల్లో వ్యవసాయ కూలీలు డిమాండ్‌ను బట్టి  50 నుంచి 150 రూపాయల వరకు పెరిగాయి. ఈ ఖరీఫ్‌ సీజన్‌లో వరి సాగులో నారేతల పనికి మాత్రం రైతులపై పడిన అదనపు భారం సుమారు రూ.30 కోట్లు. మొన్నటి రబీలో నారు పెరగడం, మోత, నాట్లు వేయడానికి ఎకరానికి రూ.4వేలు ఖర్చు అయ్యింది. ఇప్పుడు 7వేలకు పెరిగింది.


ఖరీఫ్‌లో జిల్లాలో 3లక్షల ఎకరాల్లో వరి సాగు కానుంది. పెరిగిన ధరల ప్రకారం లెక్కిస్తే ఎకరాకు 3వేలు చొప్పున 3లక్షల ఎకరాలకు రైతులపై అదనంగా పడే కూలి భారం 90 కోట్లు. ఖరీఫ్‌ సీజన్‌ ఇప్పుడే ఆరంభం అవుతోంది. ఆరంభంలోనే ఈ రేటు ఉంటే పీక్‌ సీజన్‌లో రేట్లు మరింత పెరిగే అవకాశం ఉంది. ఇదొక్కటే కాదు పాలకంకి వచ్చినప్పుడు పిట్టలు తోలేందుకు నెల రోజులపాటు కూలీలను పెట్టుకోవాలి. గతంలో రోజు కూలీ 200తో నెల రోజులకు 6వేలు అయ్యేది. ఇప్పుడు పెరిగిన కూలీల రేట్ల ప్రకారం పిట్టలు తోలే ఖర్చు పెరుగుతుంది. కలుపుతీయడం, కోతలు ఇలా పంట నూర్పిడి జరిగే వరకు ఎకరాకు కనిష్ఠంగా మరో 2వేలు అదనంగా ఖర్చు అవుతుంది. 3లక్షల ఎకరాలకు రూ.60 కోట్ల రూపాయలు. వెరసి అర్లీ ఖరీ్‌ఫ (ఎడగారు)లో సాగయ్యే మూడు లక్షల వరి సాగుపై మాత్రం రైతులపై పడే అదనపు భారం కనిష్ఠంగా రూ.150 కోట్లు. 


తిండి భారం రూ. 90 కోట్లు: 

గడచిన రెండు నెలల కాలంలో పోల్చితే నిత్యావసర వస్తువుల ధరలు గణనీయంగా పెరిగాయి. రెండు నెలల క్రితం జిలకర మసూర 25 కిలోల బస్తా ధర 1050. ఇప్పుడు రూ.1200. సన్నాలు గతంలో (25 కేజీలు) 1300. ఇప్పుడు 1600.  నలుగురు కుటుంబ సభ్యులు ఉన్న ఇంటిపై కేవలం ఒక్క బియ్యం రూపంలోనే నెలకు 250 నుంచి 300 రూపాయల అదనపు భారం పడుతోంది. ఇక కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. అధికారులు చెప్పిన ధరలకు వ్యాపారులు అమ్మడం లేదు.


అధికారికంగా ప్రకటించిన ధరలకు అదనంగా కిలోపై రూ.10 వసూలు చేస్తున్నారు. పప్పు దినుసులు, వంట నూనెలు ఇలా అన్నింటిపై రిటైల్‌ వ్యాపారులు చెప్పిందే రేటు. నిత్యావసర సరుకుల ధరల రూపంలో ప్రతి కుటుంబంపై రమారమి రూ. 1000 అదనపు భారం పడుతోంది. రేషన్‌ కార్డుల ఆధారంగా లెక్కిస్తే జిల్లాలో 9లక్షల కుటుంబాలు ఉన్నాయి. ఒక్కో కుటుంబంపై సగటున రూ.1000  లెక్కిస్తే నెల రోజుల కాలానికి ఇంటి ఖర్చులపై పడే అదనపు భారం రమారమి 90 కోట్లు.  


వినియోగదారులకు హెచ్చరిక

కరోనా నేపథ్యంలో రెండు నెలల విరామం తరువాత దుకాణాలు తెరుచుకున్న క్రమంలో వినియోగదారులు కొనుగోళ్లలో జాగ్రత్త వహించాలి. కొంతమంది వ్యాపారులు తయారీ కాలపరిమితి ముగిసిన వస్తువులను విక్రయిస్తున్నారు. సోమవారం నెల్లూరులో తూనికలు కొలతల శాఖ అధికారులు చేసిన దాడుల్లో ఈ విషయం బట్టబయలు అయ్యింది. కరోనా నేపథ్యంలో ప్రధాన వ్యాపార కూడళ్లు కంటైన్మెంట్‌ జోన్ల పరిధిలో ఉన్నాయి. దీంతో ఏదో కనిపించిన దుకాణంలో ఇచ్చిన సరుకులను కొనుగోలు చేసే పరిస్థితి నెలకొంది.


వైరస్‌ వ్యాప్తి భయంతో దుకాణాల వద్ద నింపాదిగా నిలబడి సరుకు నాణ్యతను గమనించే పరిస్థితి కూడా లేకపోయింది. కొంత మంది వ్యాపారులు దీనిని అవకాశంగా మలుచుకొని గడువు ముగిసిన సరుకులను వినియోగదారులకు అంటగడుతున్నారు. సోమవారం జరిగిన అధికారుల దాడుల్లో గడువు మీరిన వంటనూనెలు, బిస్కెట్లు తదితరాలను ధ్వంసం చేసి వ్యాపారులపై కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వినియోగదారులు అప్రమత్తంగా వ్యవహరించాలి. సరుకుల కొనుగోలు సమయంలో తయారీ కాలపరిమితిని విధిగా పరిశీలించాలి. 



రైతు కూలీలు పెరిగిపోయాయి!

- వేమయ్య, గొల్లకందుకూరు, నెల్లూరు రూల్‌ 

కరోనా ప్రభావం వల్ల బయట ప్రాంతాల నుంచి వ్యవసాయ కూలీలు వచ్చే అవకాశం లేకపోవడంతో స్థానికంగా ఉన్నవారినే వినియోగించాల్సి వస్తోంది. దీంతో కూలీ రేట్లు ఎక్కువగా ఇవ్వాల్సి వస్తోంది.  వ్యవసాయ ఖర్చు కూడా బాగా పెరిగిపోయింది. 


ధరలు పెరిగిపోయాయి.

ఇంట్లోకి అవసరమైన నిత్యావసరాల ధరలు చూస్తుంటే గుండెలు బాదుకోవాల్సి వస్తోంది. ధరలు అమాంతం పెంచేశారు. కొరత పేరిట వ్యాపారులు ఇలా చేస్తున్నారు.

- షేక్‌ ఉమెరా, ధనలక్ష్మీపురం, నెల్లూరు


ఎకరాకు రూ. 6000

కూలీల కొరతతో ఎకరాలో వరి నాట్లకు రూ.6000 డిమాండ్‌ చేస్తున్నారు. గత రబీలో 4000 ఖర్చు అయింది. కరోనాతో ఉత్తర ప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌, రాజమండ్రి, తూర్పు గోదావరి  ప్రాంతాల నుంచి వచ్చే వలస కూలీలు రాలేదు. దీంతో డిమాండ్‌ పెరిగిపోయింది. స్థానిక కూలీలే దిక్కుగా మారారు.  

- కోటారెడ్డి, తరుణవాయి, సంగం



భారమైన వ్యవసాయం

బయటి ప్రాంతాల నుంచి కూలీలు రాకపోవడంతో గ్రామంలో ఉన్న కొద్దిమంది కూలీలకు డిమాండ్‌ పెరిగింది. దీనికితోడు 3 నెలలుగా పనులు లేకపోవడం, మద్యం ధరలు పెరగడంతో వాటి ప్రభావం ధరలపై పడింది. గతంలో వరి నాట్లకు మహిళలకు ఒకరికి రూ.250 ఉండగా 400లకు పెంచారు. పురుషులకు రూ350 ఉండగా 600లకు పెంచారు. ఎకరాలో నాట్లకు రూ.4,000 నుంచి 6,500కు పెంచారు. 

- మల్లిఖార్జున నార్తుమోపూరు, అల్లూరు 



ఇప్పుడే ధరలు పెరుగుతున్నాయి

లాక్‌డౌన్‌లో నిత్యావసరాలు, కూరగాయల ధరలు తక్కువగా ఉన్నాయి. బోర్డులు పెట్టి కూరగాయలు అమ్మారు. కానీ ఇప్పుడు  బాగా పెరిగిపోయాయి. సంపాదన లేదు. ఇలా రేట్లు పెంచితే మాలాంటి వారికి కొనడం కష్టమే.

- జేమ్స్‌ , వాచ్‌మన్‌, నెల్లూరు

Updated Date - 2020-06-03T11:04:02+05:30 IST