ఎంసెట్‌ చివరి దశ కౌన్సెలింగ్‌.. ఎప్పటినుంచి అంటే..

ABN , First Publish Date - 2021-11-03T14:17:23+05:30 IST

ఎంసెట్‌ చివరి దశ కౌన్సెలింగ్‌ను..

ఎంసెట్‌ చివరి దశ కౌన్సెలింగ్‌.. ఎప్పటినుంచి అంటే..

హైదరాబాద్‌(ఆంధ్రజ్యోతి): ఎంసెట్‌ చివరి దశ కౌన్సెలింగ్‌ను ఈనెల 6 నుంచి నిర్వహించనున్నారు. ఈ మేరకు అధికారులు మంగళవారం షెడ్యూలును ప్రకటించారు. మొదటి దశ కౌన్సెలింగ్‌ తర్వాత మిగిలిపోయిన సీట్లతోపాటు, కొత్తగా అందుబాటులోకి వచ్చిన సీట్ల భర్తీ కోసం ఈ కౌన్సెలింగ్‌ను నిర్వహిస్తారు. అలాగే ఈనెల 20 నుంచి స్పెషల్‌ రౌండ్‌ కౌన్సెలింగ్‌ చేపట్టనున్నారు. దీనికోసం  కొత్తగా ఆన్‌లైన్‌ స్లాట్‌ బుకింగ్‌, ప్రాసెసింగ్‌ ఫీజులు వంటివి ఉండవు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ కూడా ఉండదు. గతంలో ఈ ప్రక్రియలన్నీ పూర్తిచేసిన విద్యార్థులు మాత్రమే స్పెషల్‌ రౌండ్‌లో వెబ్‌ ఆప్షన్లు ఎంచుకొని సీట్లు పొందవచ్చు. కాగా, ఎంసెట్‌ మొదటి విడతలో సీట్లు పొందిన విద్యార్థులు వాటిని రద్దు చేసుకోవడానికి ఇచ్చిన గడువును అధికారులు పొడిగించారు. ఈ నెల 5వ తేదీలోగా ఆన్‌లైన్‌ ద్వారా సీట్లను రద్దుచేసుకునే అవకాశం కల్పించారు. రెండు విడతల కౌన్సెలింగ్‌, స్పెషల్‌ రౌండ్‌ కౌన్సెలింగ్‌ కూడా పూర్తయ్యాక మిగిలే సీట్లను కాలేజీలే స్వయంగా భర్తీ చేసుకోవచ్చు.


నవంబరు 25న స్పాట్‌ అడ్మిషన్ల ద్వారా ఈ సీట్ల భర్తీకి కాలేజీలకు అవకాశం కల్పించారు. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను ఎంసెట్‌ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. చివరి దశ కౌన్సెలింగ్‌లో కాషన్‌ డిపాజిట్‌ విధానం అమలుచేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ. 5వేలు, మిగతా విద్యార్థులు రూ. 10వేలు చెల్లించాలి. విద్యార్థి సీటు వచ్చిన కాలేజీలో రిపోర్ట్‌ చేసి టీసీ సమర్పించినా, లేదా ఆన్‌లైన్‌లో సీటును రద్దుచేసుకున్నా కాషన్‌ డిపాజిట్‌ను వెనక్కి ఇచ్చేస్తారు. సీటును రద్దు చేసుకోకపోయినా, కాలేజీల్లో చేరకున్నా ఈ ఫీజును తిరిగి ఇవ్వరు. కాగా, ఇంజనీరింగ్‌ కాలేజీల్లో కొత్తగా 5,700 సీట్లు అందుబాటులోకి వచ్చాయి. 


నేటి నుంచి ఐసెట్‌ కౌన్సెలింగ్‌

ఈ నెల 3 నుంచి ఐసెట్‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా నవంబరు 3న విద్యార్థులు స్లాట్‌ నమోదు చేసుకుని ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లించాలి. అనంతరం 6 నుంచి 10వ తేదీ వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ ఉంటుంది. అలాగే 6 నుంచి 11వ తేదీ వరకు సీట్ల కోసం వెబ్‌ ఆప్షన్లను నమోదు చేసుకోవచ్చు. ఈ నెల 14వ తేదీన సీట్లను కేటాయించనున్నారు.

Updated Date - 2021-11-03T14:17:23+05:30 IST