ప్రతికూలతలకు కుంగిపోకూడదు

ABN , First Publish Date - 2021-03-04T06:34:12+05:30 IST

జీవితంలో ఎదురయ్యే ప్రతికూల పరిస్థితులకు కుంగిపోకుండా ముందుకు సాగినపుడే విజయాలు సొంతమవుతాయని జీజీహెచ్‌ సైకియాట్రి విభాగం అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ ఆరోగ్యనాథ్‌ పేర్కొన్నారు.

ప్రతికూలతలకు కుంగిపోకూడదు
సదస్సులో మాట్లాడుతున్న డాక్టర్‌ ఆరోగ్యనాథ్‌

మానసిక వైద్యనిపుణుడు డాక్టర్‌ ఆరోగ్యనాథ్‌

గుంటూరు (తూర్పు), మార్చి 3: జీవితంలో ఎదురయ్యే ప్రతికూల పరిస్థితులకు కుంగిపోకుండా ముందుకు సాగినపుడే విజయాలు సొంతమవుతాయని జీజీహెచ్‌ సైకియాట్రి విభాగం అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ ఆరోగ్యనాథ్‌ పేర్కొన్నారు. బుడంపాడులోని సెయింట్‌ మేరిస్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో స్పందనా ఈదా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ‘జీవితం అపురూపం- విలువ ఇవ్వండి’ అనే అంశంపై బుధవారం జరిగిన అవగాహన సదస్సులో ఆయన ప్రసంగించారు. లక్ష్యసాధనలో విఫలమైనపుడు ప్రయత్నం సరైనది కాదు అనుకోవాలే తప్ప ఓటమిగా భావించకూడదన్నారు. యుక్తవయస్సులోనే ప్రతి ఒక్కరూ సరైన మార్గాన్ని ఎంచుకోవాలని సూచించారు. ఆలిండియా సైకాలాజికల్‌ అధ్యక్షుడు బి.కృష్ణభరత్‌ మాట్లాడుతూ జీవితంలో ప్రతి ఒక్కరికీ తల్లిదండ్రులే తొలి మార్గదర్శకులని, వారి మాటలను అర్థం చేసుకోవాలని సూచించారు. స్పందనా ఈదా ఫౌండేషన్‌ చైర్మన్‌ ఈదా శామ్యూల్‌రెడ్డి మాట్లాడుతూ తమ ఇంట్లో జరిగిన విషాదం మరొక ఇంట్లో జరగకూడదన్న ఉద్దేశంతో రాష్ట్రవ్యాప్తంగా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. సదస్సులో కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ బుల్లిబాబు, క్యాంపస్‌ ఇన్‌చార్జి బి.నారాయణ, ఈదా ఫౌండేషన్‌ డైరెక్టర్‌ అంజిరెడ్డి, అధ్యక్షుడు శ్రీనివాసమూర్తి, కార్యదర్శి మీరావలి, ఉపాధ్యక్షుడు జి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2021-03-04T06:34:12+05:30 IST