గడువులోగా విద్యా కానుక ‘కిట్లు’

ABN , First Publish Date - 2021-05-06T09:41:08+05:30 IST

‘జగనన్న విద్యా కానుక కిట్లు’ గడువులోగా పాఠశాలలకు చేర్చాలని సరఫరాదారులను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ ఆదేశించారు. విద్యాకానుక కిట్ల పంపిణీపై మంత్రి వీడియోకాన్ఫరెన్స్‌

గడువులోగా విద్యా కానుక ‘కిట్లు’

సరఫరాదారులకు మంత్రి సురేశ్‌ ఆదేశం

సమయానికి ఇవ్వకపోతే.. జరిమానా తప్పదు


అమరావతి, మే 5(ఆంధ్రజ్యోతి), శ్రీకాళహస్తి: ‘జగనన్న విద్యా కానుక కిట్లు’ గడువులోగా పాఠశాలలకు చేర్చాలని సరఫరాదారులను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ ఆదేశించారు. విద్యాకానుక కిట్ల పంపిణీపై మంత్రి వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా సరఫరాదారులతో బుధవారం మాట్లాడారు. ఈ సమీక్షలో సమగ్ర శిక్ష ఎస్‌పీడీ వెట్రిసెల్వి తదితరులు పాల్గొన్నారు. మంత్రి సురేశ్‌ మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమం నిర్దేశిత సమయానికి పూర్తి కావాలన్నారు. అవినీతికి తావులేకుండా, దళారుల ప్రమేయం లేకుండా నేరుగా సరఫరాదారుల ఖాతాలకు బిల్లులు చెల్లిస్తూ పారదర్శకంగా పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. 2021-22 విద్యా సంవత్సరానికి 1 నుంచి 10వ తరగతి వరకు 47,32,064 మందికి విద్యాకానుక కిట్లు అందించాల్సి ఉందన్నారు. అన్ని వస్తువులు జూన్‌ నాటికి సరఫరా చేయాలన్నారు. నిర్దేశిత సమయానికి సరఫరాదారులు విద్యా కిట్లు సరఫరా చేయకపోతే ఒప్పందం ప్రకారం జరిమానా విధిస్తామని మంత్రి హెచ్చరించారు. 


‘కిట్లు’ వాయిదా వేయాలి: హెచ్‌ఎంల సంఘం 

జగనన్న విద్యా కానుక కిట్లు ఇప్పట్లో తీసుకోరాదని ప్రధానోపాధ్యాయుల(హెచ్‌ఎం) సంఘం చిత్తూరు జిల్లా అఽధ్యక్షుడు చెంగల్‌రాజు పిలుపునిచ్చారు. ఆ మేరకు బుధవారం ఆయన జిల్లాలోని ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు సమాచారం పంపారు. కరోనా విజృంభిస్తున్న వేళ హెచ్‌ఎంలు కిట్లు తీసుకోవాలని విద్యాశాఖ ఉత్తర్వులివ్వడం బాధాకరమన్నారు. సంఘం రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు ప్రధానోపాధ్యాయులు కిట్స్‌ తీసుకోకుండా బహిష్కరించాలని నిర్ణయించినట్టు పేర్కొన్నారు. కరోనా బారిన పడి రాష్ట్రంలో ఇప్పటికే సుమారు 170 మంది ఉపాధ్యాయులు ప్రాణాలు కోల్పోయారని... ఇలాంటి పరిస్థితుల్లో కిట్స్‌ పాఠశాలల్లో నిల్వ చేయాలని ప్రధానోపాధ్యాయులను ఆదేశించడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. వేసవి సెలవులు అయినందున పాఠశాలల్లో సిబ్బంది ఎవరూ అందుబాటులో లేరని.. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే పాఠశాలలు తిరిగి ఎప్పుడు ప్రారంభం అవుతాయో చెప్పలేమని.. అలాంటప్పుడు కిట్స్‌కు ఎవరు కాపలా ఉంటారని అన్నారు. కిట్ల పంపిణీని తాత్కాలికంగా వాయిదా వేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

Updated Date - 2021-05-06T09:41:08+05:30 IST