శిథిలాల కింద విద్యాభ్యాసం

ABN , First Publish Date - 2021-12-03T06:55:31+05:30 IST

రెండు వారాలుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వసతి గృహ భవనం పాఠశాల భవనం కూలేపరిస్థితి ఉందని విద్యార్థులు అందోళన చెందుతున్నారు.

శిథిలాల కింద విద్యాభ్యాసం
ఉలవపాడు వసతిగృహంలో పెచ్చులూడిన శ్లాబు

ఉలవపాడు, డిసెంబరు 2 : రెండు వారాలుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వసతి గృహ భవనం పాఠశాల భవనం కూలేపరిస్థితి ఉందని విద్యార్థులు అందోళన చెందుతున్నారు. మండల కేంద్రం ఉలవపాడులోని ఎస్సీ బాలుర వసతి గృహం అధ్వానంగా ఉంది. ఈ భవనం నిర్మంచి సుమారు 40 ఏళ్లవుతుంది. పదేళ్ల క్రితం నుంచి శ్లాబు పెచ్చులూడుతోంది. నాటి నుంచి ఎలాగోలా నెట్టుకుంటూ వచ్చినప్పటికీ, ప్రస్తుత వర్షాలకు విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. బయట వరండా అంతా పూర్తిగా దెబ్బతిని ఇనుప చువ్వలు బయటకొచ్చాయి. లోపలి గదులు కూడా చెమ్మగిల్లుతున్నాయి.  దీంతో ఏదైనా ప్రమాదం జరిగితే బాధ్యులెవరని విద్యార్ధుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భవనం పరిస్థితి అధ్వానంగా ఉండడంతో గతంలో 120 మంది ఉన్న విద్యార్థులు నేడు 60కి చేరుకున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే వసతిగృహానికి విద్యార్థులు వచ్చే పరిస్థితి ఉండదని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. నాడు - నేడు పాఠశాలల అభివృద్ధి పథకంలోనైనా శిఽథిలావస్థలో ఉన్న బాలుర వసతిగృహం స్థానంలో  నూతన భవనాన్ని నిర్మించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.  

ఉన్నతాధికారులు తెలియజేశా : రమణయ్య, వార్డెన్‌

వసతి గృహపరిస్థితిని ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు తెలియజేస్తూ వచ్చా. ఇప్పటికే పలుమార్లు నూతన భవనం కోసం సాంఘీక సంక్షేమశాఖ అధికారులకు వినతులు పంపించాను. 

ప్రమాదకర స్థితిలో పాఠశాల భవనం

పీసీపల్లి : మండలంలోని పడమటిపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల భవనం ప్రమాదకర స్థితిలో ఉంది. భవనం స్లాబ్‌ పెచ్చులు ఊడి చువ్వలు బయటపడ్డాయి. దీంతో పాఠశాల శ్లాబ్‌ ఎప్పుడు కూలుతుందో ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు.  ఈ పాఠశాలలో 1 నుంచి 5వ తరగతి వరకు 17 మంది  విద్యార్థులున్నారు. .పాఠశాలలో రెండే తరగతి గదులుండగా, ఒక గది రెండేళ్ల క్రితమే శిథిలమైంది. దీంతో ఆ గదికి తాళాలు వేశారు. మిగిలిన ఒకగదిలో 5వ తరగతి వరకు విద్యార్థులు చదువుకోవాల్సి వస్తోంది. ప్రస్తుతం తరగతులు నిర్వహించే గది,  వరండా రెండూ కూడా పెచ్చులు ఊడడంతో పాటు ఇనుప చువ్వలు బయటపడి ప్రమాదభరితంగా ఉంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి నూతన భవనాన్ని నిర్మించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

Updated Date - 2021-12-03T06:55:31+05:30 IST