విద్యావ్యవస్థపై వివక్ష కూడదు

ABN , First Publish Date - 2022-08-16T06:12:12+05:30 IST

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాడ్డాకనైనా విద్యావ్యవస్థ, బాగుపడుతుందని భావించిన తెలంగాణ ప్రజానీకానికి నిరాశే మిగిలింది. మౌలిక వసతులు లేక, హాస్టళ్లలో సరైన భోజనం ఇవ్వక సమస్యల...

విద్యావ్యవస్థపై వివక్ష కూడదు

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాడ్డాకనైనా విద్యావ్యవస్థ, బాగుపడుతుందని భావించిన తెలంగాణ ప్రజానీకానికి నిరాశే మిగిలింది. మౌలిక వసతులు లేక, హాస్టళ్లలో సరైన భోజనం ఇవ్వక సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతోంది. సమసమాజాన్ని నిర్మించవలసిన ప్రభుత్వం దానికి భిన్నంగా వ్యవహరిస్తున్నది. ఎస్సీ, ఎస్టీ, బీసి, మైనారిటీ గురుకులాలంటూ కుల మతాల ప్రాతిపదికన విద్యాసంస్థలను ఏర్పాటు చేయడంతో విద్యార్థులలో సమైక్యతా భావం సన్నగిల్లి, స్వార్థపూరిత కుల భావనలు పెంపొందే అవకాశాలున్నాయి. తెలంగాణ ప్రభుత్వం వీటన్నింటినీ కలిపి తెలంగాణ గురుకులాలుగా ఏర్పాటు చేయడం మంచిది. ఆంగ్ల మాధ్యమ బోధన వలన పేద విద్యార్థులకు మేలు జరుగుతుందనే చెప్పవచ్చు. కానీ ప్రభుత్వం అందుకు ప్రత్యేకంగా బోధనా సిబ్బందిని పూర్తిస్థాయిలో నియమించక, ఉన్న టీచర్లకే శిక్షణనిచ్చి చేతులు దులుపుకుంది. దీంతో విద్యార్థులకు సరైన ఆంగ్ల మాధ్యమ బోధన అందక, నష్టపోయే ప్రమాదం ఉంది.


ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనానికి అవసరమైన నిధులు సకాలంలో అందక మధ్యాహ్న భోజన కార్మికులు, హాస్టళ్లలో వంట చేస్తున్న ఏజెన్సీలు ఇబ్బందులను ఎదుర్కొనవలసి వస్తున్నది. ఏజెన్సీలకు నాలుగయిదు నెలలకొకసారి కూడా బిల్లులు రావడం లేదు. కొన్ని ప్రాంతాలలో రాజకీయ జోక్యం వల్ల పిల్లలకు నాణ్యమైన భోజనం అందడం లేదు. ఎందరో విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దిన ప్రభుత్వ పాఠశాలల్లో నేడు మౌలిక వసతులు లేక, పిల్లలు అవస్థలు పడుతున్నారు. నూతనంగా ఏర్పాటు చేసిన గురుకులాలకు పూర్తి స్థాయి భవనాలు లేక, సరిపడే మూత్రశాలలు లేక, తాగడానికి మంచినీళ్లు రాక పిల్లలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వంలోని అన్నీ శాఖలలో అటెండర్ స్థాయి ఉద్యోగి కూడా, ఆఫీసర్ స్థాయికి ఎదగవచ్చు. కానీ ఒక్క విద్యా శాఖలో మాత్రమే సెకండరీ గ్రేడ్ టీచర్లు, స్కూల్ అసిస్టెంట్ టీచర్లు ముప్పై సంవత్సరాలు ప్రభుత్వానికి సేవలందించి, అదే స్థాయిలో రిటైర్ అవుతున్నారు. ఏకీకృత సర్వీస్ రూల్సని, కోర్టు కేసులని సాకులు చూపించి, అన్ని అర్హతలున్న టీచర్లకు, స్కూల్ అసిస్టెంట్‌లుగా, జూనియర్ లెక్చరర్స్‌గా, డైట్ లెక్చరర్స్‌గా పదోన్నతులు కల్పించకపోవడం బాధాకరం. ఉద్యోగులకు పూర్తి స్థాయి ఉచిత వైద్య సదుపాయాలు కల్పించకపోవడం, సరైన సమయంలో జీతాలివ్వకపోవడంతో ఉపాధ్యాయులు మానసిక వేదనకు గురవుతున్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు, సంఘాల నాయకులతో చర్చించి సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయడానికి, ముఖ్యమంత్రి ఉపక్రమించాలి. కార్పొరేట్‌కు దీటుగా, ప్రభుత్వ విద్యావ్యవస్థను తీర్చిదిద్ది, విద్యా సంస్థలలో పూర్తిస్థాయి మౌలిక సదుపాయాలు కల్పించి, పేద విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడాలి.

దర్శనం దేవేందర్

Updated Date - 2022-08-16T06:12:12+05:30 IST