విద్యావ్యవస్థ కాషాయమయం!

ABN , First Publish Date - 2022-10-08T09:04:35+05:30 IST

ఎన్డీయే ప్రభుత్వం తీసుకువచ్చిన ఎన్‌ఈపీ (నేషనల్‌ ఎడ్యుకేషన్‌ పాలసీ) నాగ్‌పూర్‌ ఎడ్యుకేషన్‌ పాలసీని తలపిస్తోందని పలువురు విద్యావేత్తలు వ్యాఖ్యానించారు.

విద్యావ్యవస్థ కాషాయమయం!

పసిపిల్లల మనసుల్లో విద్వేషం 

జోడో యాత్రలో విద్యావేత్తల ఆవేదన 

బెంగళూరు, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): ఎన్డీయే ప్రభుత్వం తీసుకువచ్చిన ఎన్‌ఈపీ (నేషనల్‌ ఎడ్యుకేషన్‌ పాలసీ) నాగ్‌పూర్‌ ఎడ్యుకేషన్‌ పాలసీని తలపిస్తోందని పలువురు విద్యావేత్తలు వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ భారత్‌జోడో యాత్ర శుక్రవారం మండ్య జిల్లాలో సాగింది. విద్యావేత్తలు, ఉపాధ్యాయులతో రాహుల్‌గాంధీ ప్రత్యేకంగా ఇష్టాగోష్టి నిర్వహించారు. నేషనల్‌ లా స్కూల్‌ అధ్యాపకులు మాట్లాడుతూ, ఎన్‌ఈపీ అమలులోకి వచ్చాక మూడు సమస్యలు తీవ్రరూపం దాల్చాయన్నారు. విద్య కాషాయీకరణ, వ్యాపారీకరణ, కేంద్రీకరణ ఊపందుకుందని ఆరోపించారు. ప్రభుత్వ నిర్వహణలోని పాఠశాలల అభివృద్ధి అంతంతమాత్రంగా ఉందన్నారు. హిజాబ్‌ వివాదం కారణంగా 22 వేల మంది బాలికలు పాఠశాలలకు దూరమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు.  

రాహుల్‌ను కలిసిన గౌరీ లంకేశ్‌ తల్లి

దివంగత జర్నలిస్టు గౌరీలంకేశ్‌ తల్లి ఇందిర, సోదరి కవిత శుక్రవారం జోడో యాత్రలో రాహుల్‌తో కలిసి పాదయాత్ర చేశారు. ‘‘గౌరి సత్యం కోసం నిలబడింది. ధైర్యం కోసం నిలబడింది. గౌరి స్వాతంత్య్రం కోసం నిలబడింది. నేను.. గౌరీ లంకేశ్‌తోపాటు, ఆమెవంటి అసంఖ్యాకమైన భారతదేశ నిజమైన స్ఫూర్తి కోసం ప్రాతినిధ్యం వహిస్తున్నవారి కోసం నిలబడతాను. భారత్‌ జోడో యాత్ర వారి స్వరం. దాన్ని ఎప్పటికీ ఆపలేం’’ అని రాహుల్‌ ట్వీట్‌ చేశారు. కాగా, సీనియర్‌ జర్నలిస్ట్‌ గౌరీ లంకేశ్‌ 2017లో బెంగళూరు రాజరాజేశ్వరి పేటలోని తన ఇంటి వద్ద  దారుణ హత్యకు గురైన విషయం విదితమే. 

Updated Date - 2022-10-08T09:04:35+05:30 IST