చదువుకొన్నా.. సౌకర్యాలు సున్నా!

ABN , First Publish Date - 2022-06-30T05:48:07+05:30 IST

మెరుగైన ప్రమాణాలతో కూడిన విద్యను అందరికీ సమానంగా అందించాలనే ప్రభుత్వ లక్ష్యం నీరుగారుతోంది. ఎంతో సమున్నత లక్ష్యంతో రూపొందించిన జీవోలు ఆచరణలో కార్యాచరణకు నోచుకోకపోవడమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది.

చదువుకొన్నా.. సౌకర్యాలు సున్నా!

- ప్రైవేట్‌ విద్యాసంస్థల్లో నిబంధనలకు వక్రభాష్యం

- అమలుకు నోచుకోని ప్రభుత్వ ఉత్తర్వులు

- కాగితాలకే పరిమితం అవుతున్న జీవోలు

- ఎక్కడా కనిపించని క్రీడా ప్రాంగణాలు

- పొంతన ఉండని ఉపాధ్యాయ, విద్యార్థుల నిష్పత్తి

- పట్టించుకోని అధికారులు.. ప్రమాదంలో విద్యార్థుల భవితవ్యం


కామారెడ్డి టౌన్‌, జూన్‌ 29: మెరుగైన ప్రమాణాలతో కూడిన విద్యను అందరికీ సమానంగా అందించాలనే ప్రభుత్వ లక్ష్యం నీరుగారుతోంది. ఎంతో సమున్నత లక్ష్యంతో రూపొందించిన జీవోలు ఆచరణలో కార్యాచరణకు నోచుకోకపోవడమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. ప్రభుత్వం జారీ చేసే ఉత్తర్వులను అమలు చేయడంలో విద్యాశాఖధికారులు, ప్రజాప్రతినిధుల్లో చిత్తశుద్ధి లోపించడంతో విద్య అంగడి వస్తువుగా మారింది. అడ్మిషన్‌ ఫీజు, పాఠశాల ఫీజు, పుస్తకాలు, నోట్‌బుక్స్‌, ఏకరూప దుస్తులంటూ ప్రైవేట్‌ విద్యాసంస్థలు తల్లిదండ్రుల నుంచి అందినకాడికి దోపిడీ చేస్తున్నాయి. తల్లిదండ్రులు కూడా పిల్లలకు మంచి విద్యవస్తుందని, అన్ని అంశాల్లో రాణిస్తారనే ఆశతో ఎంతైనా చెల్లించడానికి వెనుకాడటం లేదు. దీంతో ప్రైవేట్‌ విద్యాసంస్థలు తల్లిదండ్రుల ఆశలను తమ ఆదాయవనరుగా మార్చుకుంటున్నాయి.

కాగితాలకే పరిమితం అవుతున్న జీవోలు

పాఠశాలల నిర్వహణకు అనుసరించాల్సిన నిబంధనలతో ప్రభుత్వాలు ఎన్నో జీవోలు విడుదల చేశాయి. ఈ జీవోలకు అనుగుణంగా నడుచుకోవాల్సిన ప్రైవేట్‌ విద్యాసంస్థలు దాన్ని తుంగలో తొక్కుతూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. నియంత్రించాల్సిన విద్యాశాఖ, ప్రభుత్వ యంత్రాంగం ప్రేక్షక పాత్ర వహించడమే కాకుండా విద్యార్థి సంఘాలు ప్రైవేట్‌ పాఠశాలల్లో పుస్తకాల అమ్మకాలు జరుపుతున్నారంటే మమ్మల్ని ఏం చేయమంటారు అనే స్థాయికి దిగజారారంటే ఏ స్థాయిలో దందాకు సహకరిస్తున్నారో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. కొన్ని పాఠశాలలు వేసవి సెలవులు ముగియకముందు నుంచే ప్రవేశాల సందడి మొదలుపెట్టింది. నర్సరీ నుంచి ప్రవేశపరీక్షలు నిర్వహించి మూడు నెలల ముందే సంవత్సరం ఫీజును కట్టించుకున్న పాఠశాలలు అనేకం ఉన్నాయి. ఇక అధిక ఫీజుల వసూలు చేస్తున్నా అసలు అటువైపు కన్నెత్తి చూసిన సంఘటన ఎక్కడా లేకుండా పోయింది. పిల్లలకు కల్పిస్తున్న సదుపాయాలు, నైపుణ్యం కలిగిన ఉపాధ్యాయులు వివిధ అంశాల్లో పిల్లలకు ఇస్తున్న తర్పీదును బట్టి ఫీజులు వసూలు చేస్తున్నామని చెబుతున్న వాళ్లు చెప్పేమాటలకు అక్కడున్న వసతులకు పొంతనే ఉండడం లేదు.

ఉత్తర్వులు.. ఆచరణలు

జీవో నెంబర్‌ 1 2(2) ప్రకారం తరగతి గదులు ఆహ్లాదంగా నడిచేందుకు ఒక్కో విద్యార్థికి 6 నుంచి 8 చదరపు అడుగుల స్థలం ఉండాలి. ఆ స్థలాన్ని లెక్కగట్టి ఎంత మంది పిల్లలు ఉన్నారో దాని ప్రకారం సెక్షన్లు చేయాలి. ఆచరణలో మాత్రం దీనికి విరుద్ధంగా విద్యార్థుల సంఖ్యను బట్టి సెక్షన్లను విభజిస్తున్నారు. ఒక్కో తరగతి గదిలో 50 నుంచి 60 మంది విద్యార్థులు ఉంటున్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను బట్టి క్రీడా ప్రాంగణాలు ఉండాలి. ప్రాథమిక పాఠశాలకు 200లోపు విద్యార్థులుంటే 500 చదరపు మీటర్లు, 300లోపు విద్యార్థులుంటే 600 చదరపు మీటర్లు, 400లోపు ఉంటే 800 చదరపు మీటర్లు, 500లోపు ఉంటే 1000 చ.మీ, 600 నుంచి వెయ్యిలోపు ఉంటే 1200 చ.మీ నుంచి 2వేల చ.మీ క్రీడా ప్రదేశం ఉండాలి. ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాలలకు 200లోపు విద్యార్థులుంటే 700చ.మీ, 300లోపు విద్యార్థులుంటే 800 చదరపు మీటర్లు, 400లోపు ఉంటే 1000 చదరపు మీటర్లు, 500లోపు ఉంటే 1200 చ.మీ, 600నుంచి 1000లోపు ఉంటే 2,200 చ.మీ క్రీడా ప్రదేశం ఉండాలి. కానీ కామారెడ్డి జిల్లా కేంద్రంతో పాటు ఇతర ప్రాంతాల్లో క్రీడా ప్రాంగణాలు ఉన్న పాఠశాలలను వేళ్లమీద లెక్కపెట్టవచ్చు.  క్రీడాప్రాంగణాలు లేకపోవడంతో విద్యార్థులు నాలుగు గోడల మధ్య కేవలం చదువుకే పరిమితమవుతూ శారీరక, మానసిక ఉల్లాసానికి దూరమవుతున్నారు. ఇక పాఠశాల భవనాలు ఒక అంతస్తు కన్నా ఎక్కువ ఉన్నవి జాతీయ భవన నిర్మాణ నిబంధనలు, భారత ప్రమాణాల నిబంధనల ప్రకారం ఉండాలి. కారిడార్లు, విశాలమైన మెట్ల మార్గం, పిట్ల గోడలు, బయటకు వెళ్లే మార్గాలు, ర్యాంపులు, అగ్ని నిరోధకశాఖ జాగ్రత్తలు ఉండాలి. జిల్లా కేంద్రంలోని నిజాంసాగర్‌ రోడ్డు నుంచి దేవునిపల్లికి వెళ్లే ప్రాంతంలో ఉన్న పలు పాఠశాలలు అపార్ట్‌మెంట్‌లలో, బారీ బిల్డింగ్‌లలో కొనసాగుతున్నాయి. ఇక విద్యానగర్‌లోని ఓ పాఠశాల నిర్వాహకులైతే క్రీడా ప్రాంగణాన్ని భవనంపైన చూపించిన సంఘటనలు ఉండడం హాస్యాస్పదమైన విషయం. గృహ అవసరాల కోసం అనుమతి ఇస్తే పాఠశాలకు ఎందుకు ఇస్తున్నారని అటు స్థానిక సంస్థల అధికారులు అడగటం లేదు.  విద్యాశాఖధికారులు పట్టించుకోవడం లేదు.

పొంతన ఉండని ఉపాధ్యాయ, విద్యార్థుల నిష్పతి

ప్రైవేట్‌ పాఠశాలల్లో ఉపాధ్యాయ, విద్యార్థుల నిష్పత్తికి అసలు పొంతన అనేదే లేకుండా పోయింది. ప్రాథమిక పాఠశాలల్లో 1:20, ఇతర పాఠశాలలో 1:40గా ఉండాలి. కానీ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు అనే తే డా లేకుండా ప్రతీ సెక్షన్‌లోనూ లెక్కకు మించిన విద్యార్థులను కూర్చోబెట్టి చదివిస్తున్నారు. ముందు కూర్చున్న విద్యార్థులకు ఉపాధ్యాయులు చెప్పేది స్పష్టంగా వినిపిస్తోంది. అర్థమవుతుంది. కానీ వెనుక కూర్చున్న విద్యార్థులు బోర్డుమీద చూసి రాసుకోవాల్సిందే. కొన్ని సందర్భాల్లో అది కూడా కష్టతరమే అవుతోంది. విద్యావంతులైన తల్లిదండ్రులతో కలిసి ఒక కమిటీని ఏర్పాటు చేయాలి. ఈ కమిటీ పాఠశాల ప్రారంభానికి ముందు సమావేశమై వివిధ తరగతులకు వసూలు చేయాల్సిన ఫీజులను నిర్ణయించడం, ఉపాధ్యాయులు, ఉపాఽఽధ్యాయేతర సిబ్బందికి చెల్లించాల్సిన జీతాలు, విద్యార్థుల ప్రవేశాలు, సంస్థ ఆర్థిక పరిస్థితి, పరిపాలన, అకాడమిక్‌ అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోవాలి. కానీ ఎక్కడా కమిటీలు కనిపించవు. కొన్నిచోట్ల ఉన్నా అవి పేరుకే పని చేస్తున్నాయి. నిర్ణయాలన్నీ యాజమాన్యమే తీసుకుంటుంది. పాఠశాలల్లో కల్పిస్తున్న సదుపాయాలు, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయేతర సిబ్బంది జీతాలు, అద్దెలు, విద్యుత్‌ బిల్లులు, ఇతర ఖర్చులు అన్ని పరిగణలోకి తీసుకుని దానికనుగుణంగా తరగతుల వారిగా ఫీజులు నిర్ణయించాలి. అయితే పాఠశాలలు మాత్రం వాటిని పరిగణలోకి తీసుకోకుండా తమ ఇష్టారాజ్యంగా ఫీజులు పెంచేస్తున్నారు. ఫీజుల నియంత్రణకు కమిటీ లేకపోవడం అసలు విద్యాశాఖపేరుకే ఉన్నట్లుగా వ్యవహరించడంతో ప్రైవేట్‌ విద్యాసంస్థలకు అయిన ఖర్చులకంటే ఆదాయమే ఎక్కువగా వస్తోంది. ఇప్పటికైనా విద్యాశాఖ, ఉన ్నతాధికారులు ప్రభుత్వ నిర్ణయాలను అమలు చేస్తే పేద, మధ్య తరగతి తల్లిదండ్రులకు ఆర్థిక కష్టాలు తప్పనున్నాయి.

Updated Date - 2022-06-30T05:48:07+05:30 IST