ఎడ్‌సెట్‌, లాసెట్‌ ఫలితాలు విడుదల

ABN , First Publish Date - 2022-08-06T08:57:01+05:30 IST

ఎడ్‌సెట్‌, లాసెట్‌ ఫలితాలు విడుదల

ఎడ్‌సెట్‌, లాసెట్‌ ఫలితాలు విడుదల

ఎడ్‌సెట్‌లో 96.43శాతం.. లాసెట్‌లో 89శాతం మంది అర్హత

అమరావతి, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): బీఈడీ, లా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఎడ్‌సెట్‌, లాసెట్‌ ఫలితాలను ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. పద్మావతి మహిళా యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఈ సెట్‌లు నిర్వహించారు. శుక్రవారం మంగళగిరిలో ఈ ఫలితాలను విడుదల చేసిన ఉన్నత విద్యామండలి చైర్మన్‌ కె.హేమచంద్రారెడ్డి మాట్లాడుతూ... బీఈడీ, బీఈడీ స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ కోర్సుల్లో ప్రవేశాలకు మొత్తం 13978 మంది దరఖాస్తు చేసుకోగా 11384 మంది పరీక్షలు రాశారని, వారిలో 10978 (96.43శాతం) మంది అర్హత సాధించారని వివరించారు. లా కోర్సుల్లో... మూడేళ్ల కోర్సుకు 11592 మంది దరఖాస్తు చేసుకుని 9645 మంది పరీక్ష రాశారని, వారిలో 8759 మంది అర్హత సాధించారని తెలిపారు. ఐదేళ్ల కోర్సుకు 3092 మంది దరఖాస్తు చేసుకోగా 2630 మంది పరీక్షకు హాజరయ్యారని, 2091 మంది అర్హత సాధించారని చెప్పారు. రెండేళ్ల పీజీ కోర్సుకు 1025 మంది దరఖాస్తు చేసుకోగా 905 మంది పరీక్ష రాశారని, వారిలో 880 మంది అర్హత సాధించారని వివరించారు. మొత్తం లా కోర్సుల్లో 13180 మంది పరీక్షలు రాస్తే 11730(89శాతం) అర్హత సాధించారని తెలిపారు. పరీక్షల్లో కేవలం నాలుగు ప్రశ్నలపైనే అభ్యంతరాలు వచ్చాయన్నారు. కార్యక్రమంలో ఉన్నత విద్యా మండలి వైస్‌ చైర్మన్‌ రామ్మోహనరావు పాల్గొన్నారు.


సచివాలయ ఎస్‌వోకు లా ద్వితీయ ర్యాంకు
సచివాలయంలోని ఆర్థిక శాఖలో సెక్షన్‌ ఆఫీసర్‌గా పనిచేస్తూ సస్పెండైన కసిరెడ్డి వరప్రసాద్‌ మూడేళ్ల లా కోర్సులో రాష్ట్రస్థాయిలో రెండో ర్యాంకు సాధించారు. సమాచారం లీక్‌ చేస్తున్నారనే అభియోగంతో ప్రభుత్వం గతేడాది ఆగస్టులో సచివాలయంలో నలుగురు ఉద్యోగులను సస్పెండ్‌ చేసింది. దానిపై ఎటూ తేల్చని ప్రభుత్వం తిరిగి పోస్టింగ్‌ కూడా ఇవ్వలేదు. ఈ మధ్యలో ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకున్న వరప్రసాద్‌ లా కోర్సు చేసేందుకు సన్నద్ధమయ్యారు. లాసెట్‌కు దరఖాస్తు చేసి పరీక్షలు రాయగా రెండో ర్యాంకు దక్కింది. జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ)లో డిప్యుటేషన్‌పై సెక్షన్‌ ఆఫీసర్‌ పోస్టుకు కూడా గతంలో ఎంపికయ్యారు. కాగా ఉత్తరప్రదేశ్‌కు చెందిన ప్రతీక్‌ సింగ్‌  మూడేళ్ల లా కోర్సులో ప్రథమ ర్యాంకు సాధించారు. 

Updated Date - 2022-08-06T08:57:01+05:30 IST