Abn logo
May 23 2020 @ 05:50AM

మరో ఎదురుదెబ్బ

ఆంధ్రప్రదేశ్‌లో జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం తీసుకుంటున్న విధాన నిర్ణయాలనూ, జీవోలను న్యాయస్థానాలు తప్పుబట్టడం, రద్దుచేయడమూ వరుసగా కొనసాగుతోంది. శుక్రవారం హైకోర్టు వేర్వేరు అంశాలకు సంబంధించి చేసిన నిర్ణయాలు, ఇచ్చిన ఆదేశాలు రాష్ట్ర పాలకులకు పెద్ద ఎదురుదెబ్బ. పంచాయతీ కార్యాలయాలకు వైసీపీ రంగులు అద్దే ప్రక్రియకు మరోమారు అడ్డుతగులుతూ సంబంధిత 623 జీవోను కోర్టు రద్దుచేసింది. నర్సీపట్నం వైద్యుడు సుధాకర్‌ అరెస్టు వ్యవహారాన్ని నేరుగా సీబీఐకి అప్పగించింది. ఆయనపట్ల అమానుషంగా ప్రవర్తించిన విశాఖ పోలీసులపై కేసు నమోదు చేసి, విచారణ చేపట్టి, ఎనిమిది వారాల్లోగా నివేదిక ఇవ్వాలని సీబీఐని హైకోర్టు ఆదేశించింది. ఇక, వలస కార్మికుల తరలింపు విషయంలో ప్రభుత్వ పనితీరుపై అసంతృప్తి వెలిబుచ్చుతూ, ఇప్పటికే పలువిడతల్లో జారీ చేసిన మార్గదర్శకాలకు అదనంగా మరిన్ని చేర్చి, వాటిని నేటినుంచే అమల్లోకి తేవాలని ఆదేశించింది. 


ఏడాదికాలంలో అరవైకి పైగా సందర్భాల్లో న్యాయస్థానాలు జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వాన్ని తప్పుబట్టిన విషయాన్ని విపక్ష నాయకులు ఈ సందర్భంగా గుర్తుచేస్తున్నారు. మందబలం ఉన్నందునో, స్వప్రయోజనాల రీత్యానో పాలకులు అధికార దుర్వినియోగానికి పాల్పడితే, కనీసం కోర్టులు తప్పుబట్టాకైనా సదరు నిర్ణయాలను ఉపసంహరించుకోవడం ఉత్తమం. కానీ, అదే ప్రయత్నాన్ని దొడ్డిదారిన కొనసాగించి తీర్పు లక్ష్యానికి తూట్లు పొడవడం ఇక్కడ జరుగుతున్నది. పంచాయతీ కార్యాలయాలకు వైసీపీ రంగులు పులుముతున్న ప్రక్రియకు హైకోర్టు గతంలో అడ్డుపడి, పాతరంగుల స్థానంలో కొత్తగా ఏమి వేయాలో ఆలోచించమన్నది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే సర్వోన్నత న్యాయస్థానం సైతం హైకోర్టు ఆదేశాలనే విధిగా పాటించాలని తేల్చింది. అయినా హైకోర్టు తీర్పు అమలుకాలేదు. పిటిషనర్‌ మళ్ళీ కోర్టును ఆశ్రయించినప్పుడు లాక్‌డౌన్‌ ఎత్తివేసిన మూడువారాల్లో ఆ రంగులు మార్చాలనీ, అప్పటివరకూ స్థానిక ఎన్నికలు వద్దని కోర్టు గట్టిగా చెప్పింది. దీనితో అవే రంగులకు ఏవో కొత్త నిర్వచనాలు ఇచ్చి, అదనంగా మట్టిరంగు బార్డర్‌ని మాత్రమే చేర్చుతూ ఈ జీవో 623 పుట్టుకొచ్చింది. ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులు పూసే విషయంలో పాలకులు ఇలా కోర్టు ఆదేశాలను సైతం బేఖాతరు చేయడంతో సదరు జీవోను కొట్టివేయడంతో పాటు, కోర్టు ధిక్కరణ ప్రక్రియ గురించి కూడా న్యాయస్థానం మాట్లాడవలసి వచ్చింది. కోర్టులు తప్పుబడతాయని తెలిసినా వందలకోట్ల ప్రజాధనం వెచ్చించి రంగులు వేయడానికి పూనుకోవడం, అవి చెప్పిన తరువాత కూడా పాలకులు తమ పంథా మార్చుకోకపోవడం విచిత్రం. 


నర్సీపట్నం ప్రభుత్వ వైద్యుడు సుధాకర్‌ విషయంలో పాలకులు ఆదినుంచీ కక్షపూరితంగానే వ్యవహరిస్తూ వచ్చారు. కరోనా కాలంలో ఆస్పత్రి ఎదుర్కొంటున్న మాస్కులు, గ్లౌజుల కొరతను ఎత్తిచూపడం ఆయన చేసిన పాపం. తక్షణమే ఉద్యోగం నుంచి పీకేసిన ప్రభుత్వం చివరకు ఆయనను ఓ మానసికరోగిగా చిత్రీకరించేందుకు ప్రయత్నించింది. విశాఖపట్నం జాతీయరహదారిపై పోలీసులు ఆయనను లాఠీలతో కొట్టడం, చేతులు వెనక్కువిరిచికట్టి కేజీహెచ్‌కు తరలించడం, అక్కడ అతనికి మానసికస్థితి సరిగాలేదని నిర్థారించడం, చివరకు మెంటల్‌ ఆసుపత్రిలో గత వారం రోజులుగా ఆయన ఉండాల్సిరావడం విషాదకరమైన పరిణామాలు. సుధాకర్‌ శరీరంపై గాయాలున్నట్టు మేజిస్ట్రేట్‌ నివేదిక పేర్కొంటే, ప్రభుత్వ నివేదికలో ఆ ఊసులేకపోవడం వంటి అంశాలు న్యాయస్థానం అనుమానాలను పెంచాయి. ప్రభుత్వాన్ని నమ్మేది లేదని ఒకటికి రెండుసార్లు నొక్కివక్కాణించి, సుధాకర్‌ వ్యవహారంలో ఓ భారీ కుట్రను అనుమానించిన న్యాయస్థానం సీబీఐ విచారణకు ఆదేశించింది. ఇక, వలసకార్మికుల రిజిస్ట్రేషన్‌ నుంచి ప్రభుత్వ విభాగాల మధ్య సమన్వయం, స్వచ్ఛంద సంస్థల సహకారం వరకూ అడుగడుగునూ నిర్దేశించడం ద్వారా వారి విషయంలో ప్రభుత్వం మరింత మానవత్వంతో వ్యవహరించాల్సిన అవసరాన్ని కోర్టు గుర్తుచేయాల్సి వచ్చింది. 

Advertisement
Advertisement
Advertisement