Abn logo
May 15 2021 @ 00:24AM

వారికి టీకా ఎట్లా?

మొత్తం సమాజానికి సంబంధించి ఏదైనా పెద్ద సమస్య వచ్చినప్పుడు, దాని మీద సంప్రదింపులు బహుముఖంగా జరగాలి. ఎక్కువ మంది జనంతో, ఎక్కువ స్థలాలతో, ఎక్కువ సాధన సంపత్తితో ముడిపడిన సమస్యలైనప్పుడు ఎన్ని తలకాయలు కలసి ఆలోచిస్తే అంత మంచి పరిష్కారం దొరుకుతుంది. సమగ్ర పరిష్కారం అన్నది దాని సంపూర్ణార్థంలో సాధించాలంటే, సమ్మిశ్రితమైన ఆలోచనావిధానం కావాలి. ప్రస్తుతం దేశంలో నెలకొన్న కొవిడ్-–19 సంక్షోభాన్ని ఎదుర్కొనడానికి ప్రభుత్వాలు తమ వంతు వ్యూహరచన తాము చేశాయి. కానీ, స్థూలంగా రచించే కార్యాచరణ ప్రణాళికలో అనేక సూక్ష్మమైన అంశాలు మరుగున పడతాయి. అట్లాగే, ఒకే తీవ్రమైన కోణం మీద దృష్టి పెట్టినప్పుడు, అనేక ఇతర కోణాలు విస్మృతమవుతాయి. సమస్య వర్తమానానిది మాత్రమే అనే భ్రమలో ఉన్నప్పుడు, రేపటి కోసం ఆలోచించడం మరచిపోతాము. కొవిడ్ రెండో దఫా విజృంభిస్తుందని సూత్రప్రాయంగా అందరికీ తెలుసును. కానీ విధానకర్తలు దాన్ని తీసుకోవలసినంత వాస్తవంగా తీసుకోకపోవడం వల్ల ఇప్పుడు ఇంత కష్టం ఏర్పడింది. అట్లాగే, ప్రభుత్వం, దానిలోని రాజకీయ నేతలు, బ్యూరోక్రాట్లు, నిపుణులు అందరూ కలసి ఆలోచించినా కొన్ని ప్రాధాన్యాలు మరుగునపడిపోతాయి. అందుకే, ప్రజాస్వామికమయిన భాగస్వామ్యం అన్ని శ్రేణులకు ఉండాలి. సమస్యకు ఉన్న ప్రతి కోణమూ చర్చలోకి రావాలి. 


మొదటి దఫా కొవిడ్ వచ్చినప్పుడు, అది వయోధికులను ఎక్కువగా బాధిస్తుందని భావించాము. నిజంగానే అప్పుడు అది వృద్ధులను, నడివయసు దాటుతున్నవారిని ఎక్కువగా పొట్టనపెట్టుకుంది. ఉన్న జనంలో ఎవరిని వ్యాధికి బలి ఇవ్వాలి, ఎవరిని కాపాడుకోవాలి అన్న విచికిత్సను ఎదుర్కొనడం ఏ సమాజానికైనా విషాదకరం. గత ఏడాది అనేక యూరోపియన్ దేశాలలో, ఆస్పత్రులలో పడకలు సరిపోక, వయోధికులను కాక యువకులకు మాత్రమే చికిత్స ఇవ్వడాన్ని ఎంచుకున్నారు. కానీ, సమాజాలకు వయోధికులు, వృద్ధులు అందరూ కావాలి. వైద్య ఆరోగ్య వ్యవస్థలు బలంగా ఉన్న చోట ఆయుః ప్రమాణాలు పెరిగి పెద్ద వయసువారి సంఖ్య అధికంగా ఉంటున్నది. అమెరికా ఎదుర్కొంటున్న సమస్య అదే. తమ జనాభాలోని సీనియర్లను కాపాడుకోవడానికి ఆ దేశం ఎంతో ప్రయత్నం చేసింది. టీకా అందుబాటులోకి వచ్చిన కొద్ది కాలానికే సగం జనాభాకు అందించింది. కానీ, మన దేశంలో, టీకా అందుబాటులోకి వచ్చిన తరువాత మొదట అరవయ్యేళ్లు పై బడిన వారికి అందించాలని సరిగానే నిర్ణయించారు.


వ్యాధి వల్ల ఎక్కువ నష్టపోయేవారికి ఇవ్వాలనుకోవడంతో పాటు, వ్యాధిని ఎక్కువ వ్యాపించేవారికి మొదటి వరుసలో టీకాను వడ్డించాలని అనుకోలేదు. మొదటి వరుసలో కోవిడ్‌ను ఎదుర్కొంటున్న వైద్యసిబ్బందికి, ఇతరులకు అందించారు కానీ, రహదారుల వెంట వ్యాధిని మోసుకు వెళ్లగలిగే ట్రక్కు డ్రైవర్లకు, కిక్కిరిసిన జనంలో సంచరించే బస్ కండక్టర్లకు, ఇల్లిల్లూ తిరిగే పోస్టల్ సిబ్బందికి, ఈకామర్స్ ఉద్యోగులకు అందించాలని అనుకోలేదు. ఆలోచనలు అంత దాకా పోలేదు. కొందరు ఈ విషయాలను ప్రస్తావించినా విధానకర్తలు చెవిన పెట్టలేదు. ఇక ఇళ్లులేనివారికి, సంచారజీవులకు, సాధుసన్యాసులకు, ఫకీర్లకు, ఆధార్ అన్నదే లేని నిరాధారులకు కరోనా నుంచి రక్షణ కల్పించడం దాకా ఆలోచించిందెవరని?


వృద్ధులు అధికంగా బాధితులు అవుతున్నప్పుడు, వృద్ధాశ్రమంలో ఉన్నవారికి టీకాలు వేయాలి కదా? అందరు వృద్ధులూ స్వయంగా టీకా కేంద్రాలకు రాలేరు కదా? మంచాన పడి కదలలేని వారుంటారు, కదలగలిగినా దూరాలు రాలేని వారుంటారు. టీకా కేంద్రాలే వ్యాధికేంద్రాలుగా మారిన సందర్భంలో భయంతో వారు సంకోచిస్తారు. మంచాన పడిన ముసలివారే కాదు, కాలూ చేయీ ప్రమాదాల్లో దెబ్బతిని కోలుకుంటున్న ఇతర వయస్కుల వారు కూడా టీకా కేంద్రాలకు రాలేరు. ఇక మానసిక, శారీరక వైకల్యం కలిగినవారి సంగతి చెప్పనే అక్కరలేదు. జన్యు సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నవారు, కేన్సర్ వంటి వాటికి చికిత్సలు పొందుతున్నవారు కిక్కిరిసిన కేంద్రాలలో వరుసలో నిలబడి టీకాలు పొందాలని ఆశిస్తున్నారా? వీరందరి దగ్గరకూ టీకా యే వెళ్లాలి. ఇళ్లకు వెళ్లి, వారి ఆశ్రమాలకు వెళ్లి టీకాలు వేయాలి. ఈ అంశం మొదట మహారాష్ట్రలో ప్రస్తావనకు వచ్చింది. ప్రత్యేక సమస్యలున్నవారికి ఇంటింటికి వెళ్లి టీకాలు వేయడానికి అనుమతించాలని ఆ రాష్ట్రప్రభుత్వం కేంద్రాన్ని అభ్యర్థించింది.


‘‘ఈ అంశం మీద ఒక విధానమేదీ లేదు కాబట్టి, అనుమతించలేకపోతున్నాము’’ అని కేంద్ర ఆరోగ్యశాఖ నుంచి సమాధానం వచ్చింది. తరువాత ముంబై హైకోర్టులో ఈ అంశం విచారణకు వచ్చింది. ఇళ్లకు వెళ్లి వేయాలంటే, టీకా విషమించే పరిస్థితి వస్తే కష్టం అవుతుందనీ, నిర్ణీత ఉష్ణోగ్రతలు నిర్వహించడం సాధ్యం కాదని కేంద్రం వాదించింది. ఒక వైద్యుడితో సహా కొందరు వైద్య సిబ్బందితో ప్రత్యేక వాహనాలు ఇళ్లకు వెళ్లి టీకాలు వేయడం నిజంగా అసాధ్యమా? ఎందుకు ఈ విషయం ఆలోచించలేకపోయారు? పండు ముదుసళ్ల మీద, వికలాంగుల మీద, రోగగ్రస్తుల మీద ప్రభుత్వాలకు పట్టింపు ఎందుకు లేకపోయింది?ఎందరెందరు అశక్త వృద్ధులు ఈ మధ్యకాలంలో కరోనా బారిన పడ్డారో? ఇంటింటికి వెళ్లి వేయాలన్న సున్నితత్వం కలిగిన మహారాష్ట్రప్రభుత్వం కేంద్రాన్ని అనుమతి అడగవలసిన అవసరం ఏమిటి? మొత్తం కొవిడ్ నిర్వహణను అంతా తన గుప్పిట్లో పెట్టుకుని రాష్ట్రాల చొరవను కేంద్రం చంపేస్తున్నదా? రాష్ట్రప్రభుత్వాలు కూడా ఇటువంటి మానవీయ అవసరాల విషయంలో స్వతంత్రించి, సృజనాత్మక కార్యక్రమాలు చేపట్టవచ్చు. ఎందుకు చేయవు? 


పెద్దలను, వృద్ధులను, అసహాయులను వారి మానాన వారిని వదిలేశామనే భావన ఆయా శ్రేణులకు కలిగితే, అది సభ్య సమాజానికి ఏమి గౌరవం?

Advertisement
Advertisement
Advertisement