ఇదేం బాదుడు!

ABN , First Publish Date - 2022-07-03T05:20:52+05:30 IST

నిత్యావసరాలు కొనలేక పోతున్నాం. పెట్రోలు, డీజిల్‌ ధరలు భగ్గుమంటున్నాయ్‌. చెత్త, ఇంటి ఇలా రకరకాల పన్నులతో పీల్చి పిప్పి చేస్తున్నారు.

ఇదేం బాదుడు!
నెల్లూరు ప్రధాన బస్టాండు వద్ద టీడీపీ నాయకుల ప్రదర్శన

ఆర్టీసీ చార్జీల పెంపుపై ఆగ్రహం

జిల్లావ్యాప్తంగా టీడీపీ నిరసన

నెల్లూరులో జనసేన, సీపీఎం ఆందోళన


‘‘నిత్యావసరాలు కొనలేక పోతున్నాం. పెట్రోలు, డీజిల్‌ ధరలు భగ్గుమంటున్నాయ్‌. చెత్త, ఇంటి ఇలా రకరకాల పన్నులతో పీల్చి పిప్పి చేస్తున్నారు. కరెంటు బిల్లులు చేస్తే స్విచ వేయాలంటేనే భయమేస్తోంది. ఇవన్నీ చాలదన్నట్టు ఆర్టీసీ చార్జీలు ఈ ఏడాదిలో రెండోసారి పెంచి ప్రజలను బాదేస్తున్నారు.’’ అంటే తెలుగుదేశం పార్టీ నాయకులు భగ్గుమన్నారు. ఆర్టీసీ చార్జీల పెంపును నిరసిస్తూ జిల్లావ్యాప్తంగా టీడీపీ శ్రేణులు నిరసన ప్రదర్శనలు, ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించాయి. అన్ని రకాల ధరల మోతతో ప్రజలు అల్లాడిపోతుంటే ఇది చాలదన్నట్టు బస్సు చార్జీల పెంచడం దుర్మార్గమని రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. చార్జీలు పెంచడాన్ని ఏమాత్రం సహించబోమని, ప్రజల సహకారంతో ఉద్యమాన్ని ఉధతం చేస్తామని నేతలు హెచ్చరించారు. నెల్లూరులో నగర టీడీపీ ఇనచార్జి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ఆధ్వర్యంలో ఆత్మకూరు బస్టాండు వద్ద బస్సుల రాకపోకలకు అడ్డంగా బైఠాయించి నినాదాలు చేశారు. నెల్లూరు రూరల్‌ టీడీపీ ఇనచార్జి అబ్దుల్‌ అజీజ్‌ సూచనల మేరకు నాయకులు, కార్యకర్తలు ప్రధాన ఆర్టీసీ బస్టాండు వద్ద నిరసన వ్యక్తం చేశారు. కందుకూరు బస్టాండు వద్ద నియోజకవర్గ టీడీపీ ఇనచార్జి ఇంటూరి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఉదయగిరి, వరికుంటపాడు, సీతారామపురం బస్టాండ్ల వద్ద, వెంకటాచలం తహసీల్దారు కార్యాలయం తదితర ప్రాంతాల్లోనూ  టీడీపీ నాయకులు, కార్యకర్తలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అలాగే సీపీఎం, జనసేన పార్టీల నాయకులు కూడా నెల్లూరులో నిరసన వ్యక్తం చేశారు.

- నెల్లూరు (ఆంధ్రజ్యోతి)


ప్రజాగ్రహం

ఆర్టీసీ చార్జీల పెంపుపై జనాగ్రహం పెల్లుబికుతోంది. సరిగ్గా చార్జీలను పెంచి మూడు నెలలు గడవక ముందే ప్రభుత్వం మళ్లీ చార్జీల బాంబు పేల్చింది. పల్లె వెలుగు నుంచి ఏసీ బస్సుల వరకు మోత మోగించింది. బస్సులో టికెట్టు కొన్న ప్రయాణికులు కొత్త చార్జీలను చూసి హడలిపోయారు. రాష్ట్ర ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఆంధ్రజ్యోతి’తో తమ అభిప్రాయాలు పంచుకున్నారు.

- నెల్లూరు (స్టోనహౌస్‌పేట)


ఇంతలా పెంచడం ఘోరం

ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణమంటేనే భయపడేలా చార్జీలు పెంచేశారు. ఇంతలా గతంలో ఎప్పుడూ పెంచలేదు. గతంలో నెల్లూరు నుంచి విజయవాడకు సూపర్‌ లగ్జరీ బస్సులో ప్రయాణిస్తుంటే రూ.430 టికెట్టు ధర ఉండేది ఇప్పుడు రూ.490 తీసుకున్నారు. రాను, పోను నేను రూ.120 అదనంగా పెట్టాల్సి వచ్చింది. మా జీతాలు మాత్రం ఇంతలా పెరగడం లేదు.

- శివ, నెల్లూరు


సామాన్యులు దూరం చేసేలా!

- నరేష్‌, నెల్లూరు

ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయలేమనే విధంగా  చార్జీలను పెంచేశారు. నేను గతంలో రాజంపేటకు వెళ్లాలంటే రూ.145 చార్జీ ఉండేది ఇప్పుడు రూ.160  అయ్యింది. మా కుటుంబసభ్యులం ఐదుగురు వెళ్లి రావాలంటే పెరిగిన చార్జీలతో ఇంకో టికెట్టు తీసుకోవచ్చు. సామాన్యులను బస్సులకు దూరం చేసే ప్రయత్నం తప్ప మరోకటి లేదు.


సామాన్యులను విడిచి పెట్టలేదు

 అశోక్‌, ప్రయాణికుడు

ఏసీ, సూపర్‌ లగ్జరీ బస్సుల్లో చార్జీలు పెంచినా పర్వాలేదు కానీ సామాన్యులు ప్రయాణించే పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్‌ సర్వీసుల్లో సైతం చార్జీలు పెంచడం ఎంతవరకు న్యాయం. నెల్లూరు నుంచి సూళ్లూరుపేటకు ఎక్స్‌ప్రెస్‌ బస్సులో రూ.125 ఉండేది. ఇప్పుడు రూ.140 అయ్యింది.  చార్జీల భారం తగ్గించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి.


సామాన్యులకు భారమే..

పల్లె వెలుగు నుంచి సూపర్‌ లగ్జరీ, ఏసీ సీర్వసుల వరకు చార్జీలు పెరగడంతో ప్రయాణికులపై అదనపు భారం పడుతోంది. డీజిల్‌ సెస్‌ పేరిట ప్రభుత్వం చార్జీలు పెంచుకుంటూ పోవటం సామాన్య, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థికభారమే. ార్జీల పెంపు పెనుభారంగా మారుతుంది.

- చిమ్మిలి రాయుడు, కొత్తపల్లి, కావలి మండలం


చార్జీలు పెంపు దారుణం

బస్సు చార్జీలు పెంచడం దారుణం. మూడేళ్లలో మూడోసారి చార్జీలు పెంచి ప్రయాణికులపై పెనుభారం మోపారు.  పల్లెవెలుగు సర్వీసులతోపాటు ఎక్స్‌ప్రె్‌సల్లో కూడా అధిక మొత్తంలో పెంచడంవల్ల పేదలు ఇబ్బందులు పడక తప్పదు. 

- గడ్డం రవీంద్ర, ఉదయగరి



Updated Date - 2022-07-03T05:20:52+05:30 IST