ఏడీ ఆ పసివాడు

ABN , First Publish Date - 2021-06-18T06:02:21+05:30 IST

ఏడీ ఆ పసివాడు కనిపించడం లేదు సత్యం మాట్లాడే ఆ పసివాడు సూటిగా చూసే ఆ చిన్నవాడు...

ఏడీ ఆ పసివాడు

ఏడీ ఆ పసివాడు 

కనిపించడం లేదు

సత్యం మాట్లాడే ఆ పసివాడు

సూటిగా చూసే ఆ చిన్నవాడు

భయం అంటే తెలియని అమాయకుడు

కనిపించకుండా పోయాడేం ...?


భయపడ్డాడా ...!

ఈ అవకాశవాదులను

ఈ బూట్లు నాకే వ్యక్తులను

ఈ పొగడ్తల భజనబృందాలను

భయంతో అనునిత్యం భయపడేవాళ్ళను

ఈ మూర్ఖులను చూడలేక పారిపోయాడా...

కనిపించకుండా పోయాడా...?


ఏదైనా చెట్టుతొర్రలో దాక్కున్నాడా

ఏ చెరువుగట్టు మీదో కునుకు తీస్తున్నాడా

ఏదైనా రాజద్రోహం కేసులో ఇరుక్కున్నాడా...

కోర్టుధిక్కార కేసులో బందీ అయినాడా


గ్రహాంతరాలకి వెళ్ళిపోయాడా

హత్య చేయబడ్డాడా

గూగుల్‌లో దొరకడం లేదు

మాప్స్‌కీ చిక్కడం లేదు

ఎంత వెతికినా దొరకడం లేదు


ఒక్కసారి ఆ పసివాడిని చూడాలి

ఒక్కసారి గుండెలకు హత్తుకోవాలి


రాజుకీ

రాజు నిర్ణయాలను సమీక్షించే తీర్పరికి కూడా

ఒంటిమీద దుస్తులు లేవని చెప్పే చేవగల

ఆ పిల్లవాడు, ఇప్పుడీ దేశానికి కావాలి

ఆ ధైర్యం ఇక్కడెవరికీ లేదిప్పుడు


ఇదేమాట మిత్రునితో అంటే

అతనన్నాడు-

ఆ కుర్రవాడు ఉన్నా

అతడు సత్యం చెప్పినా

అతనితో కోరస్ అందుకునే వాళ్ళిప్పుడు లేరు

అందుకున్నా ఆలోచించే వ్యక్తులూ లేరు


ఇప్పుడంతా-

నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు

అని సాగిపోయేవాళ్ళే ...

(ఓ బెంగాలి కవిత స్పూర్తితో)

రాజేందర్ జింబో 

Updated Date - 2021-06-18T06:02:21+05:30 IST