మెజారిటీ మాదే...

ABN , First Publish Date - 2022-06-29T13:40:11+05:30 IST

వచ్చే నెల 11వ తేదీన ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్‌) వర్గం జరుపతలపెట్టిన సర్వసభ్యమండలి సమావేశాన్ని అడ్డుకునేందుకు ఒ.పన్నీర్‌సెల్వం

మెజారిటీ మాదే...

- ఈసీ ముందుకు ఈపీఎస్‌ వర్గం

- వానగరంలోనే సర్వసభ్యమండలి సమావేశం


చెన్నై, జూన్‌ 28 (ఆంధ్రజ్యోతి): వచ్చే నెల 11వ తేదీన ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్‌) వర్గం జరుపతలపెట్టిన సర్వసభ్యమండలి సమావేశాన్ని అడ్డుకునేందుకు ఒ.పన్నీర్‌సెల్వం (ఓపీఎస్‌) కేంద్ర ఎన్నికల కమిషన్‌ (ఈసీ)ను ఆశ్రయించిన విషయం తెలిసిందే. పార్టీ సమన్వయకర్తగా ఉన్న తన అనుమతి లేకుండా ఆ సమావేశాన్ని నిర్వహించడం కుదరదని, ఆ మేరకు ఆదేశాలివ్వాలంటూ ఆయన ఈసీని కోరారు. దీంతో ఈసీ నుంచి ఎలాంటి ఆదేశాలు రాక ముందే తమ వివరణ ఇచ్చేందుకు ఈపీఎస్‌ వర్గం సిద్ధమైంది. ఈ నెల 23న జరిగిన సర్వసభ్యమండలి సమావేశం నుంచి ఇప్పటివరకూ పార్టీలో చోటుచేసుకున్న సంఘటనలను వివరిస్తూ కౌంటర్‌ అఫిడవిట్‌ సమర్పించేందుకు ఢిల్లీ వెళ్లనుంది. పార్టీలో ఓపీఎ్‌సకు స్వల్ప మెజారిటీ కూడా లేదని, ఈపీఎ్‌సకు మద్దతు ప్రకటించిన సర్వసభ్యమండలి సభ్యుల సంతకాలతో ద్రువపత్రాలు, మద్దతుదారులైన శాసనసభ్యుల సంతకాలతో పత్రాలను యుద్ధప్రాతిపదికన సిద్ధం చేస్తోంది. 


మండలి నిర్ణయమే శిరోధార్యం...

ఈ విషయమై ఈపీఎస్‌ వర్గానికి చెందిన సీనియర్‌ న్యాయవాది ఒకరు మాట్లాడుతూ.. అన్నాడీఎంకేకు సంబంధించినంతవరకూ సర్వసభ్యమండలి సమావేశంలో తీసుకునే నిర్ణయాలే చెల్లుబాటవుతాయని, ఈ విషయంలో ఈసీ జోక్యం చేసుకునే అవకాశమే లేదన్నారు. సర్వసభ్యమండలిలోనూ, ఉన్నత కార్యాచరణ మండలిలోనూ ఈపీఎ్‌సకే మద్దతు ఉందని రాతపూర్వకమైన దస్తావేజులతో కేంద్ర ఎన్నికల సంఘం వద్ద రుజువు చేయనున్నామని చెప్పారు. అంతే కాకుండా పార్టీ ఎమ్మెల్లోల్లో ఒకరిద్దరు మినహా తక్కినవారంతా ఈపీఎస్‌ వెంటే ఉన్నారని, 75 మంది జిల్లా కార్యదర్శుల్లో 70 మంది ఆయనకే మద్దతు ప్రకటించారని గుర్తు చేశారు. ఇటీవల జరిగిన సర్వసభ్యమండలి సమావేశం వీడియో ఆధారాలతో ఈసీకి అందిస్తామన్నారు. గతంలో పార్టీలో సమన్వయకర్త, ఉప సమన్వయకర్త పదవులు లేకుండానే శశికళను పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తొలగించిన విధానాన్ని తెలియజేసి, ఆ రీతిలోనే 90 శాతానికి పైగా సర్వసభ్యమండలి సభ్యుల ప్రతిపాదన మేరకు నిర్ణయాధికారం ఈపీఎస్‏కే ఉందని స్పష్టంగా వివరించనున్నామని తెలిపారు. ప్రస్తుతం కేంద్ర ఎన్నికల సంఘానికి తమ తరఫు ఆధారాలతో సహా వినతి పత్రం సమర్పించనున్నామని వెల్లడించారు. ఈ దిశగానే గత రెండు రోజులుగా న్యాయనిపుణుల సూచనల మేరకు ఎన్నికల సంఘానికి సమర్పించనున్న వినతి పత్రంలో వివిధ అంశాలను పొందుపరుస్తున్నామన్నారు. జూలై 11న జరిగే సర్వసభ్యమండలి సమావేశానికి ముందే ఈసీని ఈపీఎస్‌ న్యాయవాదులు కలవనున్నారన్నారు.


2400 మంది సభ్యుల మద్దతు...

అన్నాడీఎంకే సర్వసభ్యమండలిలో ఈపీఎస్‏కు సుమారు 2400 మంది సభ్యులు మద్దతు ప్రకటించారు. ఈ మేరకు వారి సంతకాలతో ఈపీఎస్‌ వద్ద లేఖలున్నాయని ఆయన మద్దతుదారులు చెబుతున్నారు. పార్టీలో ఏమాత్రం మెజారిటీ లేకపోయినా ఓపీఎస్‌ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఇటీవల జరిగిన సర్వసభ్యమండలి సమావేశంలో ఓపీఎస్‏కు పార్టీ లేశమాత్రమైనా మద్దతు లేదని స్పష్టమైందన్నారు. 


మళ్లీ హైకోర్టును ఆశ్రయించనున్న ఓపీఎస్‌ ..?

ఓ వైపు అన్నాడీఎంకే సర్వసభ్యమండలి సమావేశాన్ని అడ్డుకునే దిశగా కేంద్రఎన్నికల సంఘాన్ని ఆశ్రయించిన ఓపీఎస్‌.. మరో వైపు ఆ సమావేశాన్ని నిలుపుదల చేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్‌ వేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. ఈ దిశగా మంగళవారం ఉదయం నుంచి గ్రీన్‌వే్‌సరోడ్డులోని ఓపీఎస్‌ నివాసంలో మద్దతుదారులు, న్యాయనిపుణులతో చర్చలు జరుపుతున్నారు. ఇటీవల జరిగిన సర్వసభ్యమండలి సమావేశంలో పార్టీ నిబంధనలను, కోర్టు ఉత్తర్వులను ఉల్లఘించిన విషయాన్ని పేర్కొంటూ ఓపీఎస్‌ పిటిషన్‌ వేయాలని భావిస్తున్నారు.


వానగరంలోనే...

అన్నాడీఎంకే సర్వసభ్యమండలి సమావేశం ముందుగా ప్రకటించినట్లు  వానగరం శ్రీవారు వేంకటాచలపతి కల్యాణమండపంలో జరుగుతుందని పార్టీ ప్రిసీడియం చైర్మన్‌ తమిళ్‌మగన్‌ హుసేన్‌ ప్రకటించారు. గత నాలుగు రోజులుగా సర్వసభ్యమండలి సమావేశాన్ని ఎక్కడ నిర్వహించాలన్నదానిపై పార్టీ సీనియర్‌ నాయకులు పలు ప్రాంతాలను పరిశీలించారు. అయితే ఆయా ప్రాంతాల్లో పలు అంశాల కారణంగా అవాంతరాలు ఏర్పడే సూచనలు కనిపిస్తుండడంతో  శ్రీవారు కల్యాణమండపంలో నిర్వహించాలని నిర్ణయించారు. 

Updated Date - 2022-06-29T13:40:11+05:30 IST