Corruption trap of tenders for EPS: ఈపీఎస్‌కు టెండర్ల అవినీతి ఉచ్చు

ABN , First Publish Date - 2022-07-26T13:43:03+05:30 IST

రహదారుల నిర్మాణం కోసం ఆహ్వానించిన టెండర్ల(Tenders)లో అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలపై మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి(Eps)కి

Corruption trap of tenders for EPS: ఈపీఎస్‌కు టెండర్ల అవినీతి ఉచ్చు

                    - ఎడప్పాడిపై విచారణకు ‘సుప్రీం’ గ్రీన్‌ సిగ్నల్‌ 

 

అడయార్‌(చెన్నై), జూలై 25: రహదారుల నిర్మాణం కోసం ఆహ్వానించిన టెండర్ల(Tenders)లో అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలపై మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి(Eps)కి వ్యతిరేకంగా నమోదై మూడేళ్ళుగా కోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసు విచారణ త్వరితగతిన పూర్తి చేసేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఈపీఎస్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పలు రహదారుల నిర్మాణాల కోసం పిలిచిన టెండర్లలో తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని తన సమీప బంధువులకు ఆ కాంట్రాక్టులను అప్పగించారన్న ఆరోపణలు వచ్చాయి. వాటిపై సీబీఐ(Cbi)తో పారదర్శకంగా విచారణ జరిపించాలని కోరుతూ డీఎంకే ఆర్గనైజింగ్‌ సెక్రటరీ ఆర్‌.ఎస్.భారతి మద్రాసు హైకోర్టు(Madras High Court)లో ఒక పిటిషన్‌ వేశారు. అలాగే, రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ అధికారులకు కూడా ఆయన ఫిర్యాదు చేయగా, విచారణ చేపట్టింది. ఈ విచారణలో మొత్తం రూ.4,800 కోట్ల మేర అవినీతి జరిగినట్టు గుర్తించింది. అదేసమయంలో ఆర్‌.ఎస్.భారతి దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. దీనిపై హైకోర్టు న్యాయమూర్తి జగదీష్‌ చంద్ర సారథ్యంలోని ధర్మాసనం విచారించి 2018 అక్టోబరు 12న సీబీఐ విచారణకు ఆదేశించింది. ఆ తర్వాత ఈ ఆదేశాలపై ఎవరైనా అప్పీల్‌ చేస్తే, ఆ సమయంలో తమ వాదనలు కూడా ఆలకించాలని కోరుతూ ఆర్‌ఎస్.భారతి సుప్రీంకోర్టులో కేవియట్‌ పిటిషన్‌ను వేశారు. ఇదిలావుంటే, తనపై సీబీఐ విచారణకు స్టే విధించాలని కోరుతూ ఎడప్పాడి సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశారు. దీనిపై అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్‌ గగోయ్‌ సారథ్యంలోని ధర్మాసనం విచారించి సీబీఐ విచారణకు హైకోర్టు జారీచేసిన ఉత్తర్వులపై తాత్కాలిక స్టే విధించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్‌.వి. రమణ సారథ్యంలోని ధర్మాసనం ఎదుట అవినీతి నిరోధక, పర్యవేక్షణ విభాగం తరపున హాజరైన న్యాయవాదులు రంజిత్‌ కుమార్‌(Ranjit kumar), అరిస్టాటిల్‌ ఒక విన్నపం చేశారు. మాజీ సీఎం ఎడప్పాడి(Edappadi)పై ఉన్న అవినీతి కేసు గత మూడేళ్ళుగా సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉందని దీనిపై త్వరితగతిన ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని కోరారు. వారి వినతిపై సానుకూలంగా స్పందించిన సుప్రీం ధర్మాసనం ఈ పిటిషన్‌పై త్వరలోనే విచారణ జరుపుతామని హామీ ఇచ్చింది. 

Updated Date - 2022-07-26T13:43:03+05:30 IST