Cricket Association Case : ఫరూఖ్ అబ్దుల్లాకు ఈడీ సమన్లు

ABN , First Publish Date - 2022-05-27T21:42:31+05:30 IST

జమ్మూ-కశ్మీరు క్రికెట్ అసోసియేషన్ కేసులో మనీలాండరింగ్ జరిగినట్లు

Cricket Association Case : ఫరూఖ్ అబ్దుల్లాకు ఈడీ సమన్లు

న్యూఢిల్లీ : జమ్మూ-కశ్మీరు క్రికెట్ అసోసియేషన్ కేసులో మనీలాండరింగ్ జరిగినట్లు ఆరోపిస్తూ నమోదు చేసిన కేసులో దర్యాప్తు కోసం మే 31న హాజరుకావాలని మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లాకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసింది. న్యూఢిల్లీలోని Enforcement Directorate కార్యాలయంలో హాజరుకావాలని తెలిపింది. ఈ విషయాన్ని నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ శుక్రవారం ట్విటర్ వేదికగా ధ్రువీకరించింది.


నేషనల్ కాన్ఫరెన్స్ (National Conference) చీఫ్ ఫరూఖ్ అబ్దుల్లా (Farooq Abdullah)కు గతంలో సమన్లు జారీ చేసినపుడు ఆయన హాజరుకాలేదని, అందుకే ఆయనకు మళ్ళీ సమన్లు జారీ చేశామని ఓ అధికారి తెలిపారు. 


నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ శుక్రవారం ఇచ్చిన ట్వీట్‌లో, తమ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ ఫరూఖ్ అబ్దుల్లాకు ఈడీ సమన్లు జారీ చేయడం కొత్త విషయం ఏమీ కాదని తెలిపింది. భారత దేశంలో అన్ని ప్రతిపక్ష పార్టీలకు ఇది సాధారణ విషయమేనని పేర్కొంది. ఈ కేసులో తన నిర్దోషిత్వాన్ని ఆయన నిరంతరం చెప్తున్నారని, దర్యాప్తు సంస్థలకు దర్యాప్తులో సహకరిస్తున్నారని పేర్కొంది. ఈ సందర్భంలో కూడా అదేవిధంగా సహకరిస్తారని తెలిపింది. 


ఈ ఏడాది మార్చిలో ఈడీ ఈ కేసులో ఓ నిందితునికి సంబంధించిన రూ.7.25 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసింది. అంతకుముందు ఫరూఖ్ అబ్దుల్లాకు చెందిన ఆస్తులను కూడా జప్తు చేసింది. 


ఫరూఖ్ అబ్దుల్లా 2006 నుంచి 2012 మధ్య కాలంలో జమ్మూ-కశ్మీరు క్రికెట్ అసోసియేషన్ (JKCA) అధ్యక్షునిగా ఉన్నారు. ఆ సమయంలో ఆయన తన పదవిని దుర్వినియోగం చేసినట్లు ఈడీ ఆరోపించింది. దీనివల్ల లబ్ధిదారు ఆయనేనని పేర్కొంది. జేకేసీఏకు బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ) ఇచ్చిన నిధుల దుర్వినియోగం జరిగినట్లు కేసు నమోదు చేసింది. 2002-2011 మధ్య కాలంలో జేకేసీఏ నుంచి రూ.43 కోట్లకుపైగా (ప్రస్తుతం రూ.50 కోట్లకు పైగా అని ఆరోపిస్తున్నారు) దుర్వినియోగమైనట్లు ఆరోపించింది. జేకేసీఏకు బీసీసీఐ ఇచ్చిన రూ.112 కోట్ల నుంచి ఈ సొమ్మును దారి మళ్ళించారని ఈడీ ఆరోపించింది. అహ్‌సాన్ అహ్మద్ మీర్జా, మీర్ మంజూర్ ఘజన్ఫర్, అబ్దుల్లాలకు చెందిన  రూ.14.32 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ 2020లో జప్తు చేసింది. ఫరూఖ్ అబ్దుల్లాకు చెందిన గుప్కర్ రోడ్ బంగళా కూడా జప్తు చేసినవాటిలో ఉంది. మీర్జాపై ప్రాసిక్యూషన్ కంప్లయింట్‌ను ఈడీ దాఖలు చేసింది. 


 


Updated Date - 2022-05-27T21:42:31+05:30 IST