Advertisement
Advertisement
Abn logo
Advertisement
Mar 5 2021 @ 20:04PM

మెహబూబా ముఫ్తీకి ఈడీ సమన్లు

న్యూఢిల్లీ : జమ్మూ-కశ్మీరు మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసింది. ఓ మనీలాండరింగ్ కేసులో దర్యాప్తు కోసం మార్చి 15న హాజరు కావాలని ఆదేశించింది. ఈ కేసు వివరాలు వెల్లడి కాలేదు. 


ఈడీ అధికారులు శుక్రవారం తెలిపిన వివరాల ప్రకారం, మనీలాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం నమోదైన కేసులో ప్రశ్నించేందుకు మెహబూబా ముఫ్తీకి సమన్లు జారీ చేశారు. మార్చి 15న న్యూఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో హాజరు కావాలని ఆమెను కోరారు. 


జమ్మూ-కశ్మీరును రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించిన తర్వాత మెహబూబా ముఫ్తీ దాదాపు ఓ సంవత్సరంపాటు నిర్బంధంలో ఉన్న సంగతి తెలిసిందే. 


మెహబూబా ముఫ్తీ శుక్రవారం ఇచ్చిన ట్వీట్‌లో రాజకీయ ప్రత్యర్థులను బెదిరించేందుకు, దెబ్బతీసేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. రాజకీయ ప్రత్యర్థులను తనకు దాసోహం చేసుకోవడానికి నిరంతరం ప్రయత్నిస్తోందన్నారు. ప్రభుత్వ దండనాత్మక చర్యలు, విధానాలపై తాము ప్రశ్నించడాన్ని సహించలేకపోతున్నారని దుయ్యబట్టారు. ఇలాంటి హ్రస్వదృష్టి వల్ల ప్రయోజనం ఉండదని స్పష్టం చేశారు. 


ఇదిలావుండగా, జమ్మూ-కశ్మీరు మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లాకు చెందిన రూ.12 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ గత ఏడాది జప్తు చేసిన సంగతి తెలిసిందే. జమ్మూ-కశ్మీరు క్రికెట్ అసోసియేషన్ కుంభకోణంలో మనీలాండరింగ్ ఆరోపణలపై కేసు నమోదు చేసింది. 


Advertisement
Advertisement