స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షియోమీకి భారీ షాక్.. రూ.5,551 కోట్లు సీజ్.. కారణం ఇదే..

ABN , First Publish Date - 2022-04-30T21:58:28+05:30 IST

న్యూఢిల్లీ : స్మార్ట్‌ఫోన్ల దిగ్గజం Xiaomi టెక్నాలజీ ఇండియా ప్రైవేటు లిమిటెడ్‌కు Enforcement Directorate (ఈడీ) భారీ షాకిచ్చింది.

స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షియోమీకి భారీ షాక్.. రూ.5,551 కోట్లు సీజ్.. కారణం ఇదే..

న్యూఢిల్లీ : స్మార్ట్‌ఫోన్ల దిగ్గజం Xiaomi టెక్నాలజీ ఇండియా ప్రైవేటు లిమిటెడ్‌కు Enforcement Directorate (ఈడీ) భారీ షాకిచ్చింది. కంపెనీకి చెందిన రూ.5,551.27 కోట్లను సీజ్ చేసింది. కంపెనీ బ్యాంకు ఖాతాల్లోని డబ్బును సీజ్ చేశామని వివరించింది. షియోమీ కంపెనీ విదేశీ లావాదేవీల్లో అవకతవకలను గుర్తించామని, ఇండియన్ ఫారెన్ ఎక్స్చేంజీ నిబంధనలను షియోమీ ఉల్లంఘించింది. అందుకే ఫారెన్ ఎక్చ్సేంజీ మేనేజ్‌మెంట్ యాక్ట్, 1999లోని నిబంధనల ప్రకారం.. కంపెనీ ఖాతాల్లోని సొమ్మును సీజ్ చేశామని ట్విట్టర్ వేదికగా ఈడీ ప్రకటించింది. షియోమీ ఇండియా, తన మాతృసంస్థ మధ్య లావాదేవీలపై పరిశీలన జరుగుతోందని ఈడీకి చెందిన ఓ అధికారి సమాచారం. కాగా షియోమీ ఇండియా,  చైనాలో తన మాతృసంస్థల వ్యాపార నిర్మాణాత్మక విధానాల మధ్య వ్యత్యాసాలను ఈడీ పరిశీలిస్తోందని పలు మీడియా రిపోర్టులు పేర్కొంటున్నాయి. 


కాగా గత రెండు నెలలుగా షియోమీపై ఈడీ దర్యాప్తు జరుపుతోంది. ఈ నెల మొదటి వారంలో షియోమీ కార్ప్ ఇండియా మాజీ హెడ్‌కు ఈడీ సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. వ్యాపార కార్యకలాపాల్లో ఇండియన్ ఫారెన్ ఎక్స్చేంజ్ చట్టాలను ఆచరిస్తున్నారో లేదో రిపోర్ట్ ఇవ్వాలని ఈడీ అధికారులు కోరారు. ఈడీ విచారణకు హాజరుకావాలంటూ షియోమీ కార్ప్ మాజీ ఇండియన్ మేనేజింగ్ డైరెక్టర్ మను కుమార్ జైన్‌ను ఈడీ కోరింది. కానీ ఈడీ సమన్లకు మను కుమార్ జైన్, కంపెనీ స్పందించలేదు. అయితే భారతీయ చట్టాలకు లోబడే వ్యాపార కార్యకలాపాలను కొనసాగిస్తున్నామని, అన్నీ నిబంధనలను పాటిస్తున్నామని అప్పట్లో మీడియాకు ఒక ప్రకటన విడుదల చేసింది. అధికారులకు కావాల్సిన సమాచారంతోపాటు దర్యాప్తులో సంపూర్ణంగా సహకరిస్తామని అందులో పేర్కొంది. కాగా 2021లో భారత్‌లో అత్యధిక స్మార్ట్‌ఫోన్లు విక్రయించిన కంపెనీగా షియోమీ నిలిచిన విషయం తెలిసిందే. భారత్‌లో షియోమీ మార్కెట్ షేర్ 24 శాతంగా ఉంది.

Updated Date - 2022-04-30T21:58:28+05:30 IST