మనీలాండరింగ్ కేసుల్లో... China కంపెనీలు

ABN , First Publish Date - 2022-07-05T22:13:14+05:30 IST

చైనా కంపెనీలు వరసబెట్టి మనీలాండరింగ్ కేసు ఇరుక్కుంటున్నాయి.

మనీలాండరింగ్ కేసుల్లో... China కంపెనీలు

* విస్తృతంగా ED దాడులు 

* వివోపై తాజాగా దాడులు

న్యూఢిల్లీ : చైనా కంపెనీలు వరసబెట్టి మనీలాండరింగ్ కేసు ఇరుక్కుంటున్నాయి. మెుబైల్ దిగ్గజం షియోమీపై దాడులు జరిగిన తర్వాత... తాజాగా... వివో సంస్థపై Enforcement Directorate దాడులు చేసింది. ఈ చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీదారు మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటోన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ వ్యవహారంపై భారత ప్రభుత్వ ఏజెన్సీ ED విచారణ జరుపుతోంది. ఈ క్రమానికి సంబంధించి... అధికారులు తెలిపిన వివరాల ప్రకారం... దేశవ్యాప్తంగా 44 చోట్ల వివో, దాని అనుబంధ సంస్థలపై దాడులు జరుగుతున్నాయి. గతంలో మొబైల్ కంపెనీ షియోమీకి చెందిన రూ. 5,551 కోట్ల ఆస్తులను ఈడీ జప్తు చేసిన విషయం తెలిసిందే. చైనా స్మార్ట్‌ఫోన్ తయారీదారులు రాయల్టీ పేరుతో... డబ్బును దేశం నుంచి పంపుతున్నాయని, ఈ క్రమంలో... పన్ను ఎగవేతలకు పాల్పడుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి.


ఈ క్రమంలో... చైనా కంపెనీలపై ప్రభుత్వం విచారణను ముమ్మరం చేసింది. ఇందుకు సంబంధించి వీవో కార్యాలయాల్లో దాడులు నిర్వహించారు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్ తో పాటు కొన్ని దక్షిణాది రాష్ట్రాల్లో దాడులు కొనసాగుతున్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం. దేశ మొబైల్ ఫోన్ మార్కెట్‌లో చైనా కంపెనీలు ఆధిపత్యం కొనసాగిస్తున్నాయి. వీటిలో Xiaomi, Oppo, Vivo వంటి చైనాకు చెందిన బ్రాండ్లు  ఉన్నాయి. దేశంలో ఈ కంపెనీలు భారీగా సంపాదిస్తున్నప్పటికీ కూడా పన్నులు మాత్రం చెల్లించడం లేదు. ఈ కంపెనీల మోసాన్ని బట్టబయలు చేసేందుకు ప్రభుత్వం మల్టీ ఏజెన్సీ విచారణను ప్రారంభించింది.


మరికొన్ని ఏజెన్సీలు కూడా దీనిపై విచారణ జరుపుతున్నాయి. ఈ కంపెనీలు... రెగ్యులేటరీ ఫైలింగ్‌లు, ఇతర రిపోర్టింగ్‌లలో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు తలెత్తాయి. వీటితోపాటు మరికొన్ని అంశాలకు సంబంధించి కూడా ఏజెన్సీలు విచారణ జరుపుతున్నాయి. చైనా కంపెనీలు తమ ఆదాయానికి సంబంధించిన సమాచారాన్ని దాచిపెట్టాయని, పన్ను ఎగవేత కోసం... లాభాలను నివేదించలేదని ఆరోపణలు తలెత్తాయి. భారతీయ మార్కెట్‌లో దేశీయ పరిశ్రమను నాశనం చేయడానికి తమ పలుకుబడిని ఉపయోగించాయని ఆరోపణలున్నాయి. మరోవైపు... ఈ కంపెనీలు ఉత్పత్తుల పంపిణీలో పారదర్శకంగా లేవని కూడా ఆరోపణలున్నాయి. రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్‌లో  చేసిన ఫైలింగ్‌లలో... చైనా కంపెనీలు నష్టాలను చూపించాయి. అయితే... ఈ సమయంలో అవి విపరీతమైన అమ్మకాలను నిర్వహించడంతోపాటు, అత్యధిక ఫోన్‌లను విక్రయించే కంపెనీల జాబితాలో అగ్రస్థానంలో నిలవడం గమనార్హం. 

Updated Date - 2022-07-05T22:13:14+05:30 IST