మాజీ సీఎం మేనల్లుడిపై ఈడీ ఛార్జిషీటు

ABN , First Publish Date - 2022-04-03T21:38:53+05:30 IST

ఇసుక అక్రమ మైనింగ్ కేసులో పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్..

మాజీ సీఎం మేనల్లుడిపై ఈడీ ఛార్జిషీటు

చండీగఢ్ : ఇసుక అక్రమ మైనింగ్ కేసులో పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ మేనల్లుడు భూపేందర్ సింగ్ అలియాస్ హనీపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆదివారంనాడు చార్జిషీటు నమోదు చేసింది. హనీతో పాటు ఆయన అసోసియేట్ కుద్రప్‌దీప్ సింగ్‌ పేరు కూడా ఈ చార్జిషీటులో ఈడీ పేర్కొంది. మనీలాండరింగ్ ఆరోపణలపై ప్రత్యేక పీఎంఎల్‌ఎల్ కోర్టుకు ఈ చార్జిషీటును ఈడీ సమర్పించింది. ఈ కేసులో తదుపరి విచారణను ఏప్రిల్ 6వ తేదీకి కోర్టు వాయిదా వేసింది.


పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు 18 రోజుల ముందు జనవరి 19న హనీ, ఇతరులపై ఈడీ దాడులు జరిపింది. అక్రమ ల్యాండ్ మైనింగ్ కేసులో జరిపిన ఈ దాడుల్లో ఈడీ రూ.10 కోట్ల నగదు, 21 లక్షలకు పైగా విలువ చేసే బంగారం, రూ.12 లక్షలు విలువ చేసే ఒక రోలెక్స్ వాచ్ స్వాధీనం చేసుకుంది. హనీ, అతని సహచరుడు సందీప్‌ కుమార్‌, కుద్రదీప్‌ సింగ్‌ ఇళ్లలో రూ.2 కోట్లు సీజ్‌ చేసింది. ఈ ముగ్గురు ప్రొవైడర్స్‌ ఓవర్సీస్‌ సర్వీసెసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీలో డైరెక్టర్లుగా ఉన్నారని ఈడీ గుర్తించింది. దీంతో వారిపై అక్రమ మైనింగ్‌ వ్యవహరంలో మనీ లాండరింగ్‌ కేసు నమోదు చేసింది. ఫిబ్రవరి 3వ తేదీ రాత్రి హనీని అరెస్టు చేసింది.ఎన్నికల ముందు చన్నీ మేనల్లుడిని ఈడీ అదుపులోకి తీసుకోవడం అప్పట్లో చర్చనీయాంశమయింది.

Updated Date - 2022-04-03T21:38:53+05:30 IST