ED raids in Hyderabad : క్యాసినో ఏజెంట్లు నేపాల్‌ను స్థావరంగా ఎంచుకుంది ఇందుకేనా..

ABN , First Publish Date - 2022-07-27T22:56:02+05:30 IST

ఫెమా (ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్) నిబంధనలను అతిక్రమిస్తున్న క్యాసినో డీలర్లు, ఏజెంట్ల ఆట కట్టించడమే లక్ష్యంగా ఈడీ (Enforcement Directarate) రంగంలోకి దిగింది.

ED raids in Hyderabad : క్యాసినో ఏజెంట్లు నేపాల్‌ను స్థావరంగా ఎంచుకుంది ఇందుకేనా..

హైదరాబాద్ :  ఫెమా (FEMA) (ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్) నిబంధనలను అతిక్రమిస్తూ నేపాల్(Nepal)లో క్యాసినో(Casino) ఈవెంట్లు నిర్వహిస్తున్న హైదరాబాదీ డీలర్లు, ఏజెంట్లే లక్ష్యంగా ఈడీ (Enforcement Directarate) రంగంలోకి దిగింది. పెద్ద ఎత్తున క్యాసినో ఈవెంట్స్ నిర్వహిస్తున్నారనే సమాచారంతో హైదరాబాద్‌(Hyderabad)లో బుధవారం సోదాలు(Raids) చేసిన విషయం తెలిసిందే. అయితే దాదాపు 1900 కిలోమీటర్ల దూరంలో ఉండే నేపాల్‌లో హైదరాబాదీలు క్యాసినోలు నిర్వహిస్తుండటం, ఇక్కడి నుంచి గ్యాంబర్లకు తరలించడం వెనుక పెద్ద కారణమే ఉంది. వాస్తవానికి క్యాసినోతోపాటు ఇతర బెట్టింగ్ గేమ్స్‌‌కు పొరుగు దేశం శ్రీలంక అడ్డాగా ఉండేది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి జూదగాళ్లను ప్రత్యేక విమానాల్లో కొలంబో నగరానికి తీసుకెళ్లేవారు. అయితే ఇటివల శ్రీలంకలో తలెత్తిన తీవ్ర ఆర్థిక సంక్షోభంతో అక్కడి క్యాసినోలు మూతపడ్డాయి. అక్కడికి తీసుకెళ్లే పరిస్థితి లేదు. దీంతో క్యాసినో నిర్వహకులు రూటు మార్చారు. మరో పొరుగుదేశం నేపాల్‌ను స్థావరంగా మార్చుకున్నారు. స్థానిక ఏజెంట్ల సహకారంతో హైదరాబాద్ వ్యక్తులే అక్కడ క్యాసినోలు ఈవెంట్లు ప్లాన్ చేస్తున్నారు. ఇండో-నేపాల్ సరిహద్దుకు దగ్గర్లోనే ఉండే పశ్చిమబెంగాల్‌లోని సిలిగురి నగరంలోని హోటళ్లల్లో గ్యాంబ్లర్లను దించుతున్నారు. వీసా అవసరం కూడా లేకపోవడంతో  అక్కడి నుంచి నేపాల్‌లోని గేమింగ్ ఈవెంట్స్‌కు తీసుకెళ్తున్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండానే తమ పనిని ముగిస్తున్నారు. 


ఒక్కొక్కరి నుంచి రూ.3 లక్షలు వసూలు..

స్థానిక ఏజెంట్లు ప్రత్యేక ప్యాకేజీల పేరిట స్థానిక జూదగాళ్లను ఆకర్షిస్తున్నారు. విమానం చార్జీలు, హోటల్ బస, డ్రింక్స్, వినోదం కోసం ఒక్కొక్కరి నుంచి రూ.3 లక్షల వరకు వసూలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి వెళ్లే జూదగాళ్లను ప్రత్యేక విమానాల ద్వారా తీసుకెళ్తున్నారు. ఇందులో భాగంగానే జూన్ 10 -13 మధ్య సిలిగురికి దగ్గర్లో ఇండో-నేపాల్ సరిహద్దు(Indo-Nepal Border)లోని మునిసిపాలిటీ ‘ఝపా’లో క్యాసినో ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో హైదరాబాద్ నుంచి వెళ్లినవారే అధిక సంఖ్యలో పాల్గొన్నారని సమాచారం. మొత్తం 4 రోజుల ప్యాకేజీకి గానూ ఒక్కొక్కరి నుంచి రూ.3 లక్షలు వసూలు చేశారట. 180 సీట్ల ప్రత్యేక చార్టర్ ఫ్లైట్‌ ద్వారా శంషాబాద్ నుంచి బాగ్‌దోగ్రా ఎయిర్‌పోర్టుకు తీసుకెళ్లారు. వీసా అవసరం లేదు కాబట్టి అక్కడి నుంచి సులభంగా రోడ్డు మార్గంలో క్యాసినో స్థావరాలు చేరుకున్నారని సమాచారం. 


నేపాల్‌లో విదేశీయులకు గ్యాంబ్లింగ్ చట్టబద్ధం..

ఏజెంట్లు చెబుతున్న సమాచారాన్నిబట్టి నేపాల్‌లో విదేశీ పౌరులు చట్టబద్ధంగా జూదం ఆడొచ్చు. ఇందుకు అక్కడి చట్టాలు అనుమతిస్తున్నాయని ఏజెంట్లు అంటున్నారు. ఈ కారణంగానే ప్రత్యేక ప్యాకేజీలు ఆఫర్ చేసి అక్కడికి తీసుకెళ్తున్నారని సమాచారం. ఆసక్తి ప్రదర్శించిన గ్యాంబర్ల నుంచి ఫ్లైట్ టికెట్లు, హోటల్ బుకింగ్స్ ఛార్జీలు వసూలు చేస్తున్నారు. గ్యాంబర్లను ఆకట్టుకునేందుకు నేపాల్‌కు చెందిన డ్యాన్సర్ల వీడియోలను ఇక్కడివారికి చూపిస్తున్నారు. అంతేకాదు ఇండియాలోని వేర్వేరు సినీ ఇండస్ట్రీలకు చెందిన డ్యాన్సర్లతో డ్యాన్స్ చేయిస్తున్నారు.


హైదరాబాద్‌లో బుధవారం సోదాలు

హైదరాబాద్‌‌ స్థానిక క్యాసినో డీలర్లు, ఏజెంట్లే టార్గెట్‌గా నగరంలో 8 చోట్ల బుధవారం సోదాలు చేపట్టింది. నేపాల్‌లో పెద్దఎత్తున గేమింగ్ ఈవెంట్స్ నిర్వహిస్తున్నారని ఆరోపణలు రావడంతో ఏజెంట్లు మాధవ్ రెడ్డి, ప్రవీణ్ చీకోటి‌, ఇతరుల ఇళ్లల్లో అధికారులు తనిఖీలు చేశారు. హవాలా మార్గంలో లావాదేవీలు జరిపినట్టు అధికారులు గుర్తించారు. క్యాసినో ఏజెంట్లు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి పశ్చిమబెంగాల్‌ ఉత్తర భాగంలో బాగ్‌డోగ్రా ఎయిర్‌పోర్ట్(Bagdogra Airport)కు ప్రత్యేక విమానాలను నిర్వహించి కస్టమర్లను ఇక్కడి నుంచి తీసుకెళ్లారని అధికారులు గుర్తించారు. ఇండో-నేపాల్ సరిహద్దుకు సమీపాన ఉండే సిరిగురికి దగ్గర్లోని ఒక ప్రాంతంలో జూన్ 10 - 13 మధ్య మెచి క్రౌన్ ఝాపా హోటల్లో ‘ ఆల్ ఇన్ ’ పేరిట ‘క్యాసినో వెగాస్‌’ను బిగ్ డాడీ నిర్వహించింది. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, నెల్లూరుల నుంచి ఈ గ్యాంబ్లింగ్ రాకెట్లను నిర్వహించారు. 4 రోజుల ప్యాకేజీలో విమాన చార్జీలు, ఫుడ్, హోటల్ బస, డ్రింక్స్, వినోదం కోసం గ్యాంబర్లు మొత్తం రూ.3 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. నేపాల్‌తోపాటు థాయ్‌లాండ్‌లోని పుఖేట్ ద్వీపం కూడా ఏజెంట్ల గమ్యస్థానంగా ఉందని ఈడీ అధికారులు తేల్చారు. కార్డ్ గేమ్, అందర్‌ బహర్, రొలెట్టె, బక్కరత్‌లను నిర్వహిస్తున్నారు. టాలీవుడ్, బాలీవుడ్‌తోపాటు నేపాలీ డ్యాన్సర్లతో కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. విజేతలకు హవాలా మార్గంలో చెల్లింపులు చేస్తున్నట్టు ఈడీ గుర్తించింది. కాగా ఈ హవాలా రాకెట్టుపై మే నెలలో కథనాలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ కథనాల ఆధారంగా ఈడీ అధికారులు సోదాలు చేశారు.

Updated Date - 2022-07-27T22:56:02+05:30 IST