TMC Leader Vs ED : పార్థ ఛటర్జీ అక్రమ సంపాదన ఎక్కడ దాచారంటే...?

ABN , First Publish Date - 2022-09-20T22:18:36+05:30 IST

పశ్చిమ బెంగాల్ అధికార పార్టీ టీఎంసీ మాజీ నేత పార్థ ఛటర్జీ (Partha Chatterjee)

TMC Leader Vs ED : పార్థ ఛటర్జీ అక్రమ సంపాదన ఎక్కడ దాచారంటే...?

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్ అధికార పార్టీ టీఎంసీ మాజీ నేత పార్థ ఛటర్జీ (Partha Chatterjee) అక్రమ సంపాదనను అర్పిత ముఖర్జీ ఇంట్లో దాచారని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate-ED) తెలిపింది. ఆయన అనేక చట్ట వ్యతిరేక కార్యకలాపాల ద్వారా భారీ మొత్తాన్ని సంపాదించారని చెప్పింది. ఆయన టీచర్స్ రిక్రూట్‌మెంట్ కుంభకోణంలో నిందితుడనే సంగతి తెలిసిందే. 


పార్థ ఛటర్జీ, ఆయన సన్నిహితురాలు అర్పిత ముఖర్జీ (Arpita Mukherjee)లపై మొదటి ఛార్జిషీటును ఈడీ (Enforcement Directorate) సోమవారం దాఖలు చేసింది. పార్థ కేవలం టీచర్స్ రిక్రూట్‌మెంట్ కుంభకోణం ద్వారా మాత్రమే కాకుండా అనేక ఇతర చట్ట వ్యతిరేక కార్యకలాపాల ద్వారా కూడా భారీగా సొమ్ము సంపాదించినట్లు ఈ ఛార్జిషీట్ పేర్కొంది. ఆ సొమ్మును ఆయన అర్పిత ఇంట్లో ఆమె పేరు మీద పెట్టారని ఆరోపించింది. రెండు ఇళ్ల నుంచి రూ.49.8 కోట్లను ఈడీ స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. 


తన ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్న సొమ్ము తనది కాదని, అది పార్థ ఛటర్జీకి చెందినదని అర్పిత ముఖర్జీ ఈడీకి చెప్పారు. ఈ సొమ్ము పార్థకు చెందినదేనని రుజువు చేయడానికి తగిన సాక్ష్యాధారాలు లభించాయని ఈడీ పేర్కొంది. ఆయన సామాన్యుల పేరు మీద బూటకపు కంపెనీలను ఏర్పాటు చేశారని, వారికి తెలియకుండానే వారిని ఆ కంపెనీల్లో డైరెక్టర్లుగా నియమించారని తెలిపింది. డబ్బు కోసం ఉద్యోగాలను అమ్ముకున్నారని, ఆ సొమ్మును మనీలాండరింగ్ చేయడమే లక్ష్యంగా ఈ కంపెనీలను ఏర్పాటు చేశారని ఆరోపించింది. 


పార్థ ఛటర్జీ ఆధ్వర్యంలోని అనంత టెక్స్‌ఫ్యాబ్ కంపెనీ రిజిస్టర్డ్ చిరునామా నుంచి ఈడీ రూ.27.90 కోట్ల నగదును, రూ.4.31 కోట్ల విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకుంది. అదేవిధంగా సింబయాసిస్ మర్చంట్స్ ప్రైవేట్ లిమిటెడ్, వ్యూమోర్ హై రైజ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీలను కూడా ఆయన ఏర్పాటు చేశారని ఈడీ తెలిపింది. 


సెంట్రీ ఇంజినీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్, ఎచ్చాయ్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు అర్పిత ముఖర్జీకి చెందినవని, మనీలాండరింగ్ కోసం వీటిని వాడుకున్నారని తెలిపింది. ఈ కంపెనీల ఖాతాల్లో నగదును జమ చేసేవారని, ఆ తర్వాత ఆ కంపెనీల పేరు మీద స్థిరాస్తులను కొనేవారని పేర్కొంది. ఉద్యోగాల కోసం డబ్బులిచ్చి, మోసపోయినవారి స్టేట్‌మెంట్లను కూడా ఈడీ రికార్డు చేసింది. 


పార్థ ఛటర్జీని ఈ ఏడాది జూలైలో ఈడీ అరెస్ట్ చేసింది. అనంతరం ఆయనపై ముఖ్యమంత్రి మమత బెనర్జీ కఠిన చర్యలు తీసుకున్నారు. ఆయనను టీఎంసీ పదవుల నుంచి తొలగించడంతోపాటు మంత్రి పదవి నుంచి కూడా ఉద్వాసన పలికారు. 


Updated Date - 2022-09-20T22:18:36+05:30 IST